Sunday 27 April 2014

why i post VOTE ?

"ఎందుకు ఓటు వేయాలి?"




"నా ఓటూ, నా ఇష్టం.. నాకు ఎవరూ నచ్చలేదు.. అసలు ఈ ప్రజాస్వామ్యమే నచ్చలేదు.. నేను ఓటు వేయను...." అని చాలా మొండిగా మాట్లాడుతున్న వాళ్లెందరో ఉన్నారు..
మీరు అంటున్నది బానే ఉంది.. మీ ఓటూ మీ ఇష్టమే.. కానీ.. మీకు తెలీకుండానే మీ భవిష్యత్ మొత్తం ఈ ప్రభుత్వాలతో ముడిపడి ఉంది...
ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి... గతుకుల రోడ్లలో చేతులూ, కాళ్లూ, నడుమూ విరగ్గొట్టుకుంటూ ప్రభుత్వాల్ని తిట్టుకున్న రోజులు... పప్పులూ, ఉప్పులూ, పెట్రోలూ అన్నీ పెరిగిపోతుంటే, కరెంటు బిల్లులు పెరిగిపోతుంటే.. మీరు కొన్న ప్రతీ చిన్నా చితకా వస్తువుకీ 12, 14% చొప్పున దౌర్జన్యంగా టాక్సులు వసూలు చేసి మీ జేబులు ఖాళీ చేస్తుంటే... అలా టాక్సుల రూపంలో మన జేబుల నుండి దోచుకున్న సొమ్మంతా చోటామోటా రాజకీయ నాయకుల నుండి పార్టీల అధినేతల వరకూ సిగ్గులేకుండా స్వాహా చేస్తుంటే....
మీకు కనీసం ఉక్రోషం రావట్లేదా? అంత చేతకాని జనాల్లా మారిపోయారా? లేదా జనం ఎలా పోతే మనకెందుకు... మనం హాపీగా ఉన్నాం కదా... అని డిసైడ్ అయిపోయారా?
--------
"ఎవరికి ఓటు వేసినా దోపిడీ ఆపలేం కదా..." అని ఓ కామన్ స్టేట్‌మెంట్ అందరం పాస్ చేస్తున్నాం..
నువ్వు కులానికో, మతానికో, వెయ్యి రూపాయల నోటుకో, రెచ్చగొట్టే నాయకుల ప్రసంగాలకో, అన్నీ ఉచితం అనే వాగ్దానాలకో అమ్ముకుపోబట్టే కదా... దోచుకుంటోంది వాళ్లు? నువ్వు అమ్ముడుపోవడం ఆపేయ్.. నిజాయితీగా నీకు నచ్చిన వాళ్లకు ఓటు వెయ్యి... ఎందుకు రాదు మార్పు ప్రజాస్వామ్యంలో?
మన దగ్గర పగటి వేషాలు వేసే ప్రతీ ఒక్కర్నీ తరిమి తరిమి కొట్టు... అలా కొట్టగలిగేది ఒక్క నీ ఓటుతోనే! ఆ ఒక్క ఓటూ వెయ్యక టివిలోనో, థియేటర్లోనో సినిమాలు చూస్తూనో, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పుకుంటూనో.. ఓ సెలవు రోజు వచ్చిందని గడిపేస్తే ఇంకా ఈ భారతదేశంలో బ్రతికే నైతిక హక్కు మనకెక్కడ?
-------------
రెచ్చగొట్టే వాళ్లని నమ్మకు... వాళ్లు నీ బలహీనతలతో, నీ ఎమోషన్లతో ఆడుకుంటున్నారని గ్రహించు... అలాంటి వాళ్లు అధికారంలోకి వచ్చినా ఒక్క క్షణం నిన్ను ప్రశాంతంగా బ్రతకనీయరు... కొట్టుకుని చస్తూ.. మధ్యలో నీబోటి సామాన్యుడిని సమిధని చేస్తూ..
అలాగే ఉచిత వాగ్దానాలకు పడిపోకు... నీ బ్రతకు నువ్వు బ్రతకాల్సిందే.. ఎవరో వచ్చి ఉద్ధరించరు..
నీకంటూ ఓ ఆత్మసాక్షి ఉంటుంది.... ఏ హీరో గొప్ప వంటి వందల విషయాలపై పనికిమాలిన నాలెడ్జ్ పోగేసుకోవడం తర్వాత చేద్దువు.. ముందు ఏ పార్టీకీ, ఏ అభ్యర్థికీ ఓటు వేస్తే జనాలు సంతోషంగా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచించు... ఉన్నది కొద్ది సమయమే... ఈ సమయం దాటిపోతే ఐదేళ్లు చాలా బాధపడతావ్....!!
అన్నట్లు ఎలక్షన్ కమీషన్ నియమాల ప్రకారం ఓటు వేసేటప్పుడు మనతో పాటు సెల్‌ఫోన్ ఉండకూడదు.. పొరబాటున తీసుకెళ్లి ఇబ్బందుల పాలవకండి... ఓటర్ కార్డునో, ఓటు స్లిప్‌నో మాత్రమే కూడా తీసుకెళ్లి ఒకటికి పదిసార్లు మంచీ చెడూ ఆలోచించి బాధ్యతగా ఓటు వేద్దాం..

No comments:

Post a Comment