Monday 7 April 2014

శ్రీరామనవమి



శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.

శ్రీరాముడు త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్ర శుద్ధనవమి, గురువారంనాడు పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో, అభిజిత్ముహూర్తంలో, అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడని రామాయణ గ్రంధంద్వారా మనకు తెలుస్తున్నది.

ఆ దేవుని జన్మదినం ప్రజల అందరికీ పండుగదినం. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేశాక, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడౌతాడు.

ఈ శుభసంఘటనకూడా చైత్రశుద్ధనవమినాడే జరిగిందిట!. శ్రీ సీతారాములకళ్యాణంకూడా ఈరోజునే జరిగింది. ఈచైత్రశుద్ధ నవమినాడు ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలంలో ’సీతారామకళ్యాణఉత్సవాన్ని’ వైభవోపేతంగా జరుపుతారు. అసలీ రాముడెవరు, ఈయన పుట్టినదినాన్ని మనంఎందుకు పండుగగా జరుపుకుంటున్నాం అనేఅనుమానం ఈకాలపుయువతకు రాకపోదు. అందుకే ఈరాముడు దేవుడెందు కయ్యాడు? ఈయన పుట్టినదినం పండుగ ఎందుకైంది అనే విషయం కొద్దిగా చెప్పుకుందాం.

అయోధ్యకు రాజు దశరథుడు. ఆయనకు సంతానం కలక్కపోడంతో మొత్తం ముగ్గురిని వివాహమాడాతాడు. వారే కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఐనా సంతానంలేదనే ఆయన బాధమాత్రం తీరలేదు. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరనే ఆయన చింతంతా. 

ఆయన కుల పురోహితుడైన వశిష్టమహామునిరాజుకు పుత్రకామేష్టియాగంచేస్తే తప్పక సంతానం కలుగుతారని సలహాఇస్తాడు. ఋష్యశృంగమహామునికి యజ్ఞకార్యాన్ని నిర్వహించేందుకు ఆహ్వానించమంటాడు వశిష్టుడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికివెళ్ళి తనకోరిక విన్నవించుకుని, ఆయన్ను తనవెంట అయోధ్యకు తీసుకుని వస్తాడు. యఙ్ఞం సంతృప్తిగా ,నిరాటాంకంగా పూర్తవుతుంది. ఆయజ్ఞానికి తృప్తిచెందిన అగ్నిదేవుడు, పాయసంతో నిండిన ఒకపాత్రను దశరథునికి ప్రసాదించి, భార్యలకు ముగ్గురికీ ఇవ్వమంటాడు.

దశరథుడు ఆపాయసాన్ని ముగ్గురికీ పంచుతాడు. ఐతే సుమిత్ర తనవాటా పాయసాన్నుంచిన బంగారుగిన్నెను అంతఃపురంపైన ఉంచుకుని తలారబెట్టుకుంటుండగా ఒకగ్రద్దవచ్చి దాన్ని తనకు పనికివచ్చే ఆహారంగాభావించి తీసుకువెళుతుంది. ఆవిష్యం భర్తకు తెలిస్తే కోపిస్తాడానే భయంతో సుమిత్ర తనఇద్దరు సవతులకూ ఆవిషయం చెప్పగా కౌసల్యా, కైకేయీ తమభాగాల్లో సగం సగం ఆమె కిస్తారు.

ఆగ్రద్ద పాయసంఉన్న గిన్నెను ఒకవనంలో జారవిడుస్తుంది. అంజనీదేవి సంతానం అభిలషించి శివునికి అభిషేకం చేస్తుండగా ఆగిన్నె ఆమె సమీపంలో పడుతుంది, దాన్ని శివప్రసాదంగా భావించి భుజిస్తుంది. కాలక్రమాన ఆమెకూడా గర్భవతియై, హనుమంతునికి జన్మనిస్తుంది.

ఇక్కడ అయోధ్యలో పాయసం సేవించిన కొద్దికాలానికే ముగ్గురు రాణులూ గర్భంధరిస్తారు. చైత్రమాసం తొమ్మిదవరోజైన నవమినాడు, మధ్యాహ్నం పట్టపురాణిఐన కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికీ, సుమిత్రకు ఇద్దరు బిడ్డలకు లక్ష్మణ శతృఘ్నూలకు జన్మనిస్తారు. వారి జ్ఞన్మనక్షత్రాలను పరిశీలించిన వశిష్టమహాముని, శ్రీరాముడు ధర్మసంస్థాపనార్థం అవతరించిన శ్రీమహావిష్ణువు యొక్క ఏడవఅవతారమనీ, రావణుని సంహరించి సకలజనులకూ, మౌనులకూ సుఖసంతోషాలను అందించనే అవతరించాడనీ, లక్ష్మణుడు శ్రీమహావిష్ణూవు శేషపానుపనీ, భరత, శతృష్ణులు మహావిష్ణువు శంఖచక్రాలనీ గ్రహిస్తాడు. 

ఆ తర్వాత శ్రీరాముడు విశ్వామిత్రయాగ సమ్రక్షణార్ధం బయల్దేరి వరుసగా రాక్షస సంహారం మొదలెట్టి, అరణ్యవాసంలో ఉండగా ఆయన సహధర్మచారిణిఐన సీతనూ అపహరించిన రావణాసురుని సమ్హరిస్తాడు.ఇలా తాపసులకూ, సాధారణ మానవులకూ రాక్షస సమ్హారంతో సుఖశాంతులనందిస్తాడు. ఆందుకే శ్రీరాముని పుట్టినరోజును మానవులంతా దుష్టసమ్హారం కావించిన మహానుభావుని జన్మదినంగా జరుపుకుంటారు.

ఈపండగ సందర్భంగా హైందవులంతా తమ ఇళ్ళలో చిన్నసీతారాముల విగ్రహాలకు కల్యాణోత్సవం చేస్తుంటారు. ఆతర్వాత విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్రనవరాత్రి మహారాష్ట్రలోనూ, వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిరోజులుపాటు సాగుతుంటుంది..

ఇటీవల జరిపిన జ్యోతిషశాస్త్ర పరిశోధనలఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 నజన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు.ఆలయాల్లో, ముఖ్యంగా భద్రాచలంలో ఈ శ్రీరామనవమీరోజున జరిగే ఉత్సవాలు తిలకించుటకు భక్తులుపోటెత్తుతారు.

సీతారాములకల్యాణం. వసంతోత్సవం ఇవన్నీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిచూసి తరిస్తారు. వేసవిలో జరిగే ఈపుట్టు పండుగకు బెల్లం, మిరియాలు కలిపి తయారుచేసే పానకం అందరికీ పంచుతారు. భక్తులంతా ఎంతో ప్రీతితో సేవిస్తారు.. ఉత్సవమూర్తుల ఊరేగింపు, దీన్నే నగరోత్సవమనీ, మాడవిధుల్లో ఊరేగింపనీ అంటారు.

వసంతోత్సవంగా రంగునీళ్ళు చల్లుకుంటూ ఉత్సాహంగా సాగుతుంటుంది. ఈసందర్భంగా కొందరు హిందువులు కొన్నిప్రాంతాల్లో ఉపవాసదీక్షను పాటిస్తారు దేవాలయాలను అందంగా విద్యుద్దీపపు కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణంచేస్తారు. శ్రీరామునితోబాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయునికూడా ఆరాధిస్తారు. శ్రీరాముని జన్మవృత్తంతాన్నినాటకాలుగా, హరికధలుగా, పారాయణగానూ, హరికధలూ, బుర్రకధలూ, తోలుబొమ్మలాటలూ, సత్సంగాలుకూడాజరుగుతాయి.

భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో, ప్రతిసంవత్సరం ఈఉత్సవం వైభవంగాచేస్తారు. ప్రభుత్వం తరఫున, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి తనతలమీద పెట్టుకుని తలంబ్రాలకువాడే ముత్యాలను సీతారామకళ్యాణ సందర్భంగా తీసుకునివస్తాడు. రవి" అంటేసూర్యుడు. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో సూర్యుని "Amon Ra" లేదా "Ra" అనేవారు. లాటిన్భాషలో కూడా "Ra" ప్రత్యయం వెలుగును సూచిస్తుంది. దేశంలోని ప్రజలంతా సిరిసంపదలతో, సుఖసంతోషాలతో ఉంటే అదిరామరాజ్యమని హిందువుల విశ్వాసం. ఒకసారి పార్వతీదేవి పరమశివుని ‘కేనోపాయేనలఘునా విష్ణోర్నామసహస్రకం’ అని, విష్ణు సహస్రనామస్తోత్రమునకు సూక్ష్మమైన మార్గంచెప్పమని కోరుతుందిట!. దానికి పరమేశ్వరుడు, “ఓపార్వతీ! నేను నిరంతరము ఆఫలితము కొరకు జపించేది ఇదేసుమా!” అని ఈక్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు. శ్లో|| శ్రీరామరామరామేతిరమేరామేమనోరమే | సహస్రనామతత్తుల్యంరామనామవరాననే ||

- ఈశ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్కవిష్ణు సహస్రనామపారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితంకూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధనవమినాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉంటాయిట! ఏభక్తులు కాశీలో జీవిస్తూ ఆపుణ్యక్షేత్రంలో మరణిస్తారో వారి మరణ సమయాన, భక్తవ శంకరుడైన శంకరుడే ఈతారక మంత్రం వారికుడిచెవిలో చెప్పి, వారికి సధ్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢవిశ్వాసం. ఇకభక్తరామదాసు ఐతేసరేసరి!

శ్రీరామనామ గానమాధుర్యాన్ని భక్తితో సేవించి,’శ్రీరామ నీనామ మెంత రుచిరా…‘ అనికీర్తించాడు. మనం శ్రీరామనామాన్ని పలికేప్పుడు ‘రా’ అనేందుకు మననోరు తెరవగానే మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి, ఆరామనామ అగ్ని జ్వాలలోపడి దహించుకుపోతాయట!

‘మ’ అనే అక్షరం పలకను మననోరు మూసుకున్నప్పుడు బయట మనం వదలిన ఆపాపాలు ఏవీమనలోకి ప్రవేశించవట.అందువల్లనే మానవులకు ‘రామనామస్మరణ’ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట! శ్రీరామనవమిరోజున వీధులలో పెద్దపెద్ద పందిళ్ళువేసి, సీతారామకళ్యాణం చేస్తారు. ప్రతి గృహంలోనూ రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యంచేసి అందరకీ పంచుతారు, పూర్వం తాటాకు విసినికర్రలు పంచేవారు .

అవతార పురుషుడుగా, మానవాళికి మంచి మార్గాన్ని చూపేందుకై మానవరూపంలో భూమిమీద జన్మించి, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కావించిన దైవంగా ఎందరికో శ్రీరాముడు ఇలువేల్పుగా నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. శ్రీరామచంద్రప్రభువుపేరున అవతరించిన ప్రధానమైన పండుగ శ్రీరామనవమి. అఖిలాంద్రులేకాక , దేశవిదేశాలలోని హైందవులతా జరుపుకునే ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. భగవంతుడైన శ్రీరామచంద్రుడు సకల జీవరాసులనూ రక్షించి, బ్రోచుగాక.

No comments:

Post a Comment