Monday 7 April 2014

ఓటరు అంతరం(గం)




" మీ కొఱకే మేం ఉన్నాం . మీకేం కావాలనిపించినా మమ్మల్ని  కలవండి , మాకు తెలపండి . ఆ పై ఆ మీ వెతని మఱచిపోండి , మేం చూసుకొంటాంగా . మీరు చేయాల్సినది ఒక్కటే ఒక్కటి .ఏమిటని ఆశ్ఛర్యపోతున్నారా ? ఏమీ లేదు . భగవంతుడి వద్దకు వెళ్ళి మనం వేడుకుంటాం ,అది కావాలి , యిది కావాలి అని . ఆ తర్వాత ఆయనకే వదిలేస్తాము , అలాగే మీకేం కావాల్సినా మాకు చెప్పండి , మీరొదిలేసేయండి . ఆ పై మేం చూసుకొంటాం . మీరు మాత్రం ఈ ఎన్నికలలో  మీ పవిత్రమైన ఓటు మా చిహ్నం మీద వేసి మమ్మల్నే ఎన్నుకోవాలి  " అంటూ అందరు నాయకులు వెళ్ళిపోతున్నారు రాజకీయ అభ్యర్ధులు , వారి అనుచరగణం .

ఈ రాజకీయ నాయకులలో కొందరు గత ఎన్నికలలో గెలిచినవాళ్ళు .
ఇంకొందరు ఓడిపోయి గేలి చేయబడినవాళ్ళు .
మఱికొందరు ధరావత్తుకూడా దక్కించుకోని వాళ్ళు .
ఇంకొంతమంది యిపుడిపుడే రాజకీయాల్లోకి అడుగెడ్తున్నవాళ్ళు .
మఱికొంతమంది యితర పార్టీలతో పొత్తులు పెట్టుకొన్న వాళ్ళు .
వీళ్ళే కాకుండా ఏ యితర పార్టీలతో సంబధం లేకుండా స్వతంత్ర అభ్యర్ధులు యింకా కొంతమంది .

ఎవరు ఎటువంటివారైనా , ఎలాంటివారైనా , వాళ్ళందరూ పుట్టి బుధ్ధెఱిగిన నాటి నుంచి , కూటికి , గుడ్డకు నోచుకోని వాళ్ళే ,
అటువంటి వాళ్ళను కూడా వదలకుండా వదలకుండా , ఆకట్ట్టుకునే విధంగా ( మాయ ) మాటలు చెప్తూ , ఓట్లు తమకే వేయమని మఱీ మఱీ అడుక్కుంటూనే వున్నారు .

గతంలో తామెప్పుడూ వాళ్ళను చూడలేదు , వాళ్ళు కూడా తమనెప్పుడూ చూడలేదు , అయినా ఎన్నో ఏళ్ళ నుంచి తామిరువురూ పరిచయస్తులమేనన్నట్లుగా ఈ ఎన్నికల సమయంలో ఆ రాజకీయ నాయకులందరూ మాట్లాడుతుంటే , వాళ్ళందరికీ తాము ఎలా తెలుసా ? ఎలా తెలుసా ? అని ఆలోచించి , చివరికి వాళ్ళనే అడిగేశారు ఆ ఓటర్లు .

" మేము ప్రతి ఎన్నికల సమయంలో , మున్సిపల్ కార్యాలయం నుంచి జనాభా లెక్కలు తీసుకొంటాము . ఆ లెక్కలలో , మీ పేరు , మీ చిఱునామా వివరంగా వుంటాయి . అందుకే , మీరు మాకు బాగా తెలిసిన వారులా , కావలసిన వారులా భావించి , మీ వద్దకు వస్తుంటాము . అయితే సహజంగా ఈ తంతు ప్రతి 5 ఏళ్ళ కొకమారు జరుగుతుంటుంది . అయితే అప్పుడప్పుడు కొంతమంది స్వారధ పరుల , ఆవేశపరుల అవిశ్వాశ తీర్మానాలతో , మధ్యంతర ఎన్నికలప్పుడు కూడా యిలా వస్తుంటాము " నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు .

ఎవరెవరో వస్తారు ? , ఆరాలు తీస్తారు . ఆప్యాయంగా పలకరిస్తారు . మేం నిత్యం చేసే మా వృత్తి పనిని ఆ కాసేపు చేస్తుంటారు . వీలు చేసుకొని , మేం వండుకున్న వంట తింటుంటారు ( ఆనక మాకుంటుందో , లేదో కూడా ఆ లోచించరు ).
మన అభ్యర్ధనలన్నింటినీ ఓపికగా , శ్రధ్ధగా వీంటారు ( విన్నట్లు నటిస్తారు ) , ఆనక వెళ్తూ వెళ్తూ , " మీ ఓటు మాకే వేయండి , మీ వాళ్ళ చేత కూడా వేయించండి , మఱచిపోవద్దు " అంటూ మఱీ మఱీ చెప్పుకుంటూ వెళ్తారు .

మన అభ్యర్ధనలను మాత్రం వాళ్ళు ఆ గడప దాటగనే మఱచిపోతారు .

" ఒరేయి సాంబిగా మీ యింట్లో 10 ఓట్లున్నాయిగదా , మఱేంటిరా యిప్పుడు 6 ఓట్లే కనపడ్తున్నాయి , వాళ్ళేరి రా ? బైటకు వెళ్ళారా ? ఏంటి ? త్వరగా పిలిపించు , మీ మొత్తం ఓట్లు నాకే పడి తీరాలి " అంటాడా రాజకీయ నాయకుడు .

" చిత్తం బాబొ , మా మొత్తం ఓట్లు మీకే ఏత్తాం లెండి , కాకుంటే మాయి , యిప్పుడు 6 ఓట్లేనండి ."

" అదేంటిరా సాంబా మిగిలిన 4 ఓట్లు వేరే వాళ్ళకు అమ్మేశావా ఏంటి ? "

" లేదు బాబొ , ఆ 4 ఓట్లు మురిగిపోయాయి కదండి ."

" మురిగిపోవటమేమిటిరా ? మున్సిపల్ లెక్కలలో కనపడ్తుంటే ? "

" అదేమో నాకు తెల్వదండి , మీకు కూడా చెప్పాను , మూడేళ్ళ నాడు డెంగ్యూన బడి చచిపోయారు కదండి . అప్పుడు మీకు సెప్పా కదండి . మీరు మాకు నాయం సేత్తానన్నారు కదండి " .

" అవునవునురోయ్ సాంబా , యిప్పుడిపుడే గుర్తొస్తున్నది . మఱేంటిరా మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పలేదా ? జనాభా లెక్కలలో తీసేసే వాళ్ళు కదా ! "

" సెప్పాను బాబొ , సర్టిఫికెట్ అడిగాను , దుడ్డు కడితే గాని యివ్వనన్నారు . నా దగ్గర దుడ్డు లేక కట్టల , అందుకే కాబోలు యింకా  ఆళ్ళ లెక్కలలో నా వాళ్ళు బతికినట్టే కనపడ్తుండారు ."

" సరేలేరా సాంబా యిప్పుడున్న ఆ 6 ఓట్లు నాకే వేయించు  " అంటూ వెళ్ళిపోతున్నారా ఆ రాజకీయ నాయకులు .

" వేయిత్తా బాబూ , యిపుడన్నా ఆళ్ళకి మీరు సెప్పి , ఆ జనాభా లెక్కలలో తీసేయించండి " .

" పర్వాలేదులేరా , ఆ పని నేను చూస్తాగా " .

" దుడ్డు కట్టాలట , కొంచెం సూడండి బాబొ " .

" వాళ్ళు పోయారు గదరా , యింక వాళ్ళ గురించెందుకురా . యిప్పుడు నీ వద్దనున్న ఈ 6 ఓట్లు మఱచిపోకుండా నా గుర్తుకే ఓట్లేయించు " వెళ్ళిపోయారు .

సహజంగా ఎన్నికలన్న తర్వాత , ఎంతమంది బరిలో వున్నా , ఎవరో ఒక్కరే గదా గెలిచేది . అలా గెలిచిన వారు , ఒక్క ఓటు తేడాతో గెలిచినా , ఆ గెలిచినవారు మిగిలిన ఈ జనాభా మొత్తాన్ని పరిపాలిస్తారు ( ఎవరికి యిష్టమున్నా , లేకపోయినా , ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళను , వినియోగించుకోని వాళ్ళను , ఒక్క మాటలో చెప్పాలంటే యావన్మందిని ).
తీరా గెలిచిన తర్వాత  ఆ నాయకుల తీరెలా వుంటుందంటే  " ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే చందం " .

No comments:

Post a Comment