Thursday, 3 April 2014

MARADU LOKAM--OLD AGE HOMES

"అమ్మ, నాన్నల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్పిస్తే మంచిది..."

"ఎందుకు?" అని అతను అడగలేదు. అడిగితే చాలా విషయాలు బైటకొస్తాయి. ఆరు నెలలు ఇక్కడా, ఆరు నెలలు అక్కడ... పల్లెటూళ్ళ ఖర్చు తక్కువ... సిటీల్లో ఖర్చు ఎక్కువ. ఆ లెక్కన తానే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. ఈ గొడవ అంతటి కంటే చెరో నాలుగువేలు వేసుకుంటే ఇద్దరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వుంటారు. ఈ లెక్కలు, బాధ్యతలు, ఏడుపులు, విసుక్కోవటాలు, ముఖ్యంగా కొంపలో 'ముసలివాసనా' లేకుండా వుంటుంది.

'మీకు ఇష్టమేనా?' అని ఆ తల్లితండ్రుల్ని ఎవ్వరూ అడగలేదు. సెకండ్ హాండ్ వస్తువులను అమ్మేయటానికి ఎంత తాపీగా నిర్ణయం తీసుకుంటారో అంత తేలిగ్గా ఆ వృద్ధ తల్లితండ్రుల జీవితం గురించి నిర్ణయం తీసుకోబడింది.

అమ్మనాన్నలు 'ఎదిగిపోయిన' తమ బిడ్డల 'మేధస్సు' కు ఆశ్చర్యపోయారు. బాల్యం నుంచీ నేర్పిన కెరీరిజం, లౌక్యం, కూసింత స్వార్ధం తాలూకు పరిణామక్రమం ఇది. వాళ్ళకు అమ్మ, నాన్నలు గుర్తొచ్చారు. బిడ్డల చదువుల కోసం తల్లితండ్రుల్ని పల్లెటూళ్ళో వదిలేసి సిటీ సుఖాలకు అలవాటుపడ్డ ప్రాణాలు కొంత కాలం గడిచేసరికి తమ 'కెరీరిజం' తాలూకు పెంపకం ఇప్పుడు తమ 'నిజ స్వరూపాలను' ప్రదర్శించటం మొదలుపెట్టాయి. జీవితం అంటే ఇదేనా?

కొడుకులు గొప్పవాళ్ళవ్వాలని మనస్సు చంపుకుని బిడ్డల్ని రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో పెట్టి అప్పులు చేసి తినీ తినక ప్రాణం పెట్టి చదివించిన తల్లి తండ్రుల 'ఋణం' 'ఓల్డ్ ఏజ్ హోమ్' కు చేర్చటం ద్వారా పరిసమాప్తం... ఇదీ మోడ్రన్ 'ఋణ విముక్తి' ప్లానింగ్...

No comments:

Post a Comment