Thursday, 3 April 2014

MARADU LOKAM ---PREMA

సాయంత్రం అవుతుంది.

డెబ్భై ఏళ్ళ వృద్ధుడు అత్యంత ఏకాగ్రతతో, మమకారంతో మొక్కలు నాటుతున్నాడు. రెండు, మూడుసార్లు చూపు ఆనక గునపం తగిలి వ్రేళ్ళు చిట్టి రక్తం వచ్చింది. దాన్ని పట్టించుకోని ఆ వృద్ధుడు నాటిన మొక్కలన్నింటినీ జాగ్రత్తగా నీళ్ళు పోసాడు.

ఇదంతా గమనిస్తున్న ఆయన మనవడు అడిగాడు "తాతా! ఆ మొక్కలు పెద్దయి కాయలు కాసేనాటికి నువ్వు చచ్చిపోతావు కదా ఎందుకీ శ్రమ?"

ఆయన మనవడి వంక చూసి నవ్వాడు. లాభనష్టాల కాలుక్యులేషన్స్ లేని తరం అది. అందుకే ఇలా అన్నాడాయన.

"నాయనా! నేను చచ్చిపోవచ్చు... నువ్వూ, నీ బిడ్డలూ ఈ చెట్ల కాయలు తింటారు... మా తాత నాటిన చెట్ల కాయలు నేను తిన్నాను. ఈ తల్లి పచ్చగా వుంటేనే కదా అందరం బ్రతికేది... నువ్వూ నాలుగు మొక్కలు నాటు నాయనా..."

మనవడు తలాడించాడు. తాత చెప్పిన 'జీవిత సత్యం' అతనికి అర్ధం అయ్యిందో లేదో మనకు తెలీదు.

***

(లోకమంతా కుళ్ళిపోయిందని కాదు కానీ ఒకప్పుడు మహనీయుల సంఖ్య తక్కువగా వుండేది ఇప్పుడు స్పందించే మనుష్యుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గ్లోబల్ వార్మింగ్ కంటే అత్యంత ప్రమాదకరం.)

No comments:

Post a Comment