Thursday 3 April 2014

అహోబల క్షేత్ర మహిమ గురించి అన్నమయ్య రాసిన కీర్తన....


                        


అహోబల క్షేత్ర మహిమ గురించి అన్నమయ్య రాసిన కీర్తన....
అనిశము దలచరో అహోబలం
అనంత ఫలదం అహోబలం
హరి నిజనిలయం అహోబలం
హరవిరించి నుత అహోబలం
అరుణ మణిశిఖరమహోబలం
అరిదైత్యహరణ మహోబలం
అతిశయ శుభదం అహోబలం
అతుల మనోహర మహోబలం
హత దురితచయం అహోబలం
యతి మత సిద్ధం అహోబలం
అగు శ్రీ వేంకట మహోబలం
అగమ్య మసురుల కహోబలం
అగపడు పుణ్యుల కహోబలం
అగకుల రాజం అహోబలం
అనిశము అంటే ఎప్పుడూ ఆహోబలం అని స్మరిస్తే చాలు అది అనంత ఫలాన్ని ఇస్తుందట. స్వామి వారి బలమైన రూపాన్ని చూసి... దేవతలంతా అహోబలం అహోబలం అని కీర్తించారట. అదే అహోబల క్షేత్రమైందని ఓ కథ ( అహోబిల క్షేత్రమని ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. దీనికి కూడా ఓ కారణం ప్రచారంలో ఉంది ). అదే అన్నమయ్య చెబుతున్నారు.
నిజంగానే హరి కొలువైన క్షేత్రమే అహోబలం. హర ( శివుడు ), విరించి( బ్రహ్మ) హరిని కీర్తించే ప్రదేశమే అహోబలం. సూర్యుని వలే శోభించే శిఖరం గల ప్రదేశం, రాక్షసుల్ని సంహరించిన ప్రదేశం ఈ అహోబలం.
నమ్మలేనంత శుభాన్ని ఇచ్చే క్షేత్రం అహోబలం. అత్యంత సుందరమైన స్థలం. దురితచయం అంటే పాప సమూహాన్ని హతం చేసేది ఈ అహోబలం. మోక్షానికి చేరే యతిమతం సిద్ధించే ప్రదేశమే ఈ అహోబలం.
పాపాలను ఖండించేదే ఈ అహోబలం. రాక్షసులు ప్రవేశించలేనిదీ అహోబలం. పుణ్యులకు మాత్రమే కనిపించేది ఈ అహోబలం. అగకులం అంటే పర్వత కులం. అలాంటి పర్వతాలకు రాజులాంటిది ఈ అహోబలం.
అందుకే అన్నమయ్య అంటున్నారు... అహోబలమహోబలమహోబలం అని ఒక్క సారి స్మరిస్తే చాలు... హరి సన్నిధికి చేరుతారని.
( సాక్షాత్తు ఆదిశేషుడే శేషాచల పర్వతమై వెలశాడని చెబుతారు. అందులో తలమీద తిరుమల వేంకటేశుడు, నడుము మీద అహోబల నారసింహుడు, తోకమీద శ్రీశైల మల్లికార్జునుడు వెలిశారు. అందుకే ఈ క్షేత్రానికి అంత ప్రాముఖ్యం. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో నవనారసింహులు వెలిశారు )

No comments:

Post a Comment