Friday 11 April 2014

"అయన వస్తున్నాడు" వర్సెస్ "ఆయన వస్తేనే బాగుంటుంది "



గతకొద్దిరోజులుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నవారికి పై రెండు స్లోగన్‌ల గురించి వివరించి చెప్పనవసరంలేదు. చూడనివారికోసం వివరణ - పై రెండు స్లోగన్‌లూ రెండు వేర్వేరు రాజకీయపార్టీల ఎన్నికల ప్రచార చిత్రాలలోనివి. మొదటిదేమో జగన్ పార్టీది, రెండేదేమో తెలుగుదేశానిది.

జగన్ పార్టీ ప్రచారచిత్రాలలో  ముందు ఏదో ఒక అక్రమాన్ని చూపిస్తారు. ఆ తర్వాత బాధితులవర్గంలోని ఒక వ్యక్తి లేచి ఇంకెన్నాళ్ళు మీ అక్రమాలు, ఆయనొస్తున్నాడు ఎలుగెత్తి అరుస్తారు. ఇంతలో పెద్ద ఎత్తున గాలి, దుమారం వస్తాయి. ఆ వెంటనే మీసాల రామ్ అన్నయ్య(ఈయన ఈ మధ్యనే సాక్షిలోకి రీఎంట్రీ ఇచ్చారు) తన బేస్ వాయిస్‌లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, దుమ్ము దులపండి అంటూ పిలుపునిస్తారు. థమ్సప్ యాడ్‌లోలా గాలి, దుమారాన్ని చూపటంపై జోకులు బాగా పేలుతున్నాయి...'వచ్చేదెవరూ! వైఎస్ దెయ్యమా?' అని.

ఇక తెలుగుదేశం ప్రచారచిత్రాలలో ముందుగా, పెరిగిపోతున్న ధరలు, కరెంట్ కోత వంటి ఏదో ఒక సమస్యను ప్రస్తావిస్తారు. స్క్రీన్ అంతా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుందిగానీ, ఎక్కడో ఒక్కచోటమాత్రమే పసుపురంగు కనిపిస్తూఉంటుంది. సమస్యగురించి పాత్రలు మాట్లాడుకున్న తర్వాత ముక్తాయింపుగా "ఆయనున్నప్పుడే బాగుండేది, మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది" అని ఒకరితో చెప్పిస్తారు. ఆ వెంటనే చంద్రబాబు తలకాయ స్లో మోషన్‌లో ఇటువైపుకు తిరుగుతుంది. అయితే క్లోజప్‌లో చూపించటంవల్లనో, ఏమోగానీ చంద్రబాబు ముఖంలో నవ్వు కృతకంగా, కళావిహీనంగా ఉంది. ఈ చిత్రాలను రూపొందించిన దర్శకుడు, నటుడు అల్లరి రవిబాబు, జగన్ పార్టీ ప్రచారచిత్రాలను చూసి పోటీగా అదే థీమ్‌తో తీయటంకాక మరేదైనా కొత్తగా ప్రయత్నించాల్సిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

No comments:

Post a Comment