Thursday 3 April 2014

MARADU LOKAM-SMASANAM

మయం... మధ్యాహ్నం పదకొండున్నర గంటలు

ప్రదేశం... స్మశానం.

సంఘటన... శవం కాలుతుంది.

కాటికాపరి నిర్లిప్తంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. చితి చుట్టూ దాదాపుగా ఇరవైమంది దాకా జనం వున్నారు. అందరి ముఖాలు గంభీరంగా, విషాదంగా వున్నాయి. విషాదం అంటే పూర్తి విషాదం కూడా కాదు. కొందరం కొంచెం ఇవతలికి వచ్చి అరచేయి అడ్డు పెట్టుకుని, లో గొంతుకలలో సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఇంకొందరు బ్లాంక్ ఫేస్ లతో చితి వంకే చూస్తున్నారు. మళ్ళీ అది దుఃఖం కూడా కాదు 'ఎంత త్వరగా తతంగం పూర్తవుతుందా?' అనే ఇరిటేషన్ క్షమించాలి అసహనం కావచ్చు వాళ్ళ బుర్రలో ఏ ఆలోచనలు తిరుగుతున్నాయో సరిగ్గా వాళ్ళకే తెలీదు ఇంక మనకేం తెలుస్తుంది?

కఫాలం 'ఫట్' మంటూ పగిలింది.

గుంపులోని జనం కొందరు 'గోవిందా' అనుకున్నారు. 'ఇక ఎళ్ళండి... ఇక్కడుండి మీరు చేసేదేమీ లేదు..." కాటికాపరి కొంచెం అసహనంగా చెప్పాడు. అతని కోపం అతనిది. అడిగిన మొత్తంలో సగం బేరం ఆడి డబ్బులు చేతిలో పెట్టారు పైగా కట్టెలు, కిరోసిన్ అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. "ధూ... కక్కుర్తి నాయాళ్ళు... ఎప్పటికైనా ఈడకి రాకపోరు... అప్పుడు చెబుతా మీ పని..." కసిగా తనలో తనే గొణుకుతున్నాడు. వాళ్లొచ్చేసరికి ఈయనే అప్పుడూ కాటికాపరిలాగా వుంటాడా అన్నది వేరే ప్రశ్న.

"వాడెంత ఫోజ్ కొడుతున్నాడో చూశారా? ఎంత డబ్బిచ్చినా చాలదు వెధవకు... శవాల మీద వ్యాపారం అంటే ఇదే కాబోలు..." ఓ పెద్ద మనిషి తన ప్రక్కనున్న ఇంకో పెద్దమనిషితో అంటున్నాడు.

"అందుకే హాయిగా ఎలక్ట్రిక్ క్రిమిటోరియమ్ లో చేయిస్తే పోయేది..."

"గంధపు చెక్కలతో తగలబెట్టాలని ఆయన కోర్కె... బాగానే సంపాదించాడు కదా ఏదైనా కోరుకుంటాడు..." అని గొంతు తగ్గించి "అన్నట్లు మీరు ముఫ్ఫైనో, అరవై లక్షలో ఇవ్వాలంటగా బైట జనం టాక్..." అన్నాడు.

ఆ పెద్ద మనిషి సీరియస్ గా చూశాడు "చచ్చినోడు వచ్చి నీతో చెప్పాడా? పోనీ నోటూ, పత్రం వుందా? ఎవడిష్టం వచ్చినట్టు వాడనుకుంటే దాంతో నాకేం సంబంధం?" గట్టిగానే అన్నాడు.

స్మశానం దగ్గర్లో గజం భూమి ధర ఎంత వుంది? దినానికి మేకపోతులు ఎక్కడ నుండి తెప్పించాలి? ముగ్గురు కొడుకులు ఆస్తి పంచుకుంటే ఒక్కోడికి ఎంత వస్తుంది? ఏ కొడుకుతో మంచిగా వుంటే లాభం? కూతురు ఆస్తిలో నాకూ వాటా వుందని కోర్టులో కేసు పెడుతుందా? నిజంగానే ఆయుష్షు తీరి చచ్చిపోయాడా లేకపోతే ఆస్తికోసం ఇంట్లో వాళ్ళే మందు పెట్టి చంపేశారా? పిల్లికి బిచ్చం పెట్టకుండా అడ్డమైన పనులూ చేసి ఎన్నికోట్లు వెనకేసి ఉంటాడు?


ఈవిధంగా అత్యంత విలువైన, ప్రీతికరమైన, ఆనందదాయకమైన సంభాషణలు చేసుకుంటూ ఆ మరణించిన వ్యక్తి తాలూకు బంధువులు, స్నేహితులు స్మశానం నుండి తిరిగి 'జనారణ్యం' వైపుగా సాగిపోయారు.

No comments:

Post a Comment