ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గా కీర్తించబడే మన దేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు (లోక్ సభ) వాటితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
మంచి పాలకులు వస్తేనే ఈ దేశం , ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి
స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ దేశం లో ఎవరికీ ఓటు వేయాలో , ఎటువంటి నాయకులను అధికార పీటం పై ఉంచాలో మనం తెలుసుకోలేక పోవటం శోచనీయం.
దొంగలు, దోపిడిదారులు, అవినీతి జలగలు, పుండాకోర్లు, దగాకోర్లు దర్జాగా మన ముందుకు ఓట్లు అడగటానికి వస్తున్నారు అంటే మనం ఎంతగా దిగజారి పోయి ఉన్నామో అర్ధం చేసుకోండి.
స్వాతంత్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా ఇంకా మనలో ఏమాత్రం చైతన్యం వచ్చినట్లు కనపడుటం లేదు.
ప్రజలు బిచ్చగాళ్ళ వాలే మారారు. అవినీతి, లంచగొండి తనం రెండు కళ్ళు గా మారాయి. దేశం సొమ్ము తింటే తిన్నాడులే, ఎవడు తినలేదు? అనే వింత జంతువులు పుట్టుకొచ్చాయి.
ఈ దేశం లో చదువు నైతిక విలువలను, సమాజం పట్ల కర్తవ్యాన్ని, భాద్యతను, దేశ భక్తిని నేర్పటం లేదు. వివేకాన్ని నేర్పలేని ఈ విద్య దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నది.
డబ్బు పెట్టి అందలం ఎక్కటం, అందినకాడికి దండుకోవటం , అయినవారికి, అనుచర గణానికి దోచి పెట్టటం 'రాజనీతి' గా మారింది. చట్టాలు చుట్టాలుగా మారాయి.
ఒక అప్పుడు సాంబారు ఇడ్లీకి, సారా బుడ్డికి ఓటు అమ్ముకున్న కొద్ది మంది అమాయకులను చూసాం. ఓటు అమ్ముకున్నా ఆనాడు వారిలో నిజాయితి ఉండేది. డబ్బు ఇచ్చిన వాడికే ఓటు వేసేవారు.
నేడు అమాయకులు లేరు కాని ఆనాటి కంటే ఈనాడు ఇంకా ఎక్కువ మంది 'అత్యాస పరులు' తయారైయ్యారు.
రకరకాల ప్రలోబాలకు లొంగి తమ ఓటును అమ్ముకుంటున్నారు. అందరి దగ్గర డబ్బు తీసుకుంటున్నారు. నేతలకు లేని నీతి తమకెందుకు అనే వింత వాదనల తో ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసారు.ఈ ఆలోచనా తీరులో పెను మార్పు రావాలి. .
' ఆయన వస్తాడు తాయిలాలు ఇస్తాడు'
అని ఆశగా ఎదురు చూసే అమాయకులు కళ్ళు తెరిచి వాస్తవాలను తెలుసుకోండి. బిచ్చగాళ్ళ వాలే మారకండి.
మతానికి, కులానికి, ప్రాంతానికి, ధనానికి, దర్పానికి, ద్వేషానికి లొంగకుండా నిర్బయంగా ,వివేకంగా మచ్చ లేని మంచి పాలకులను ఎన్నుకోవాలి. అప్పుడే ఈ దేశానికి విముక్తి.
No comments:
Post a Comment