Thursday, 3 April 2014

MARADU LOKAM- POLITICS

"ఏంటిది?"

మంత్రిగారు సీరియస్ గా అడిగేసరికి పీఎ భయంగా నటించాడు. నిజంగా భయపడటం మానేసి చాలాకాలం అయ్యింది. ఎందుకంటే ఆయన తాలూకు బొక్కలు, స్కాములు, బినామీలు అన్నీ పీఎకి సృష్టంగా తెలుసు. పైపైన బెదిరించటమే కానీ పీఎని ఏమీ చేయలేనని మంత్రిగారికి కూడా తెలుసు. అందుకే గొంతును మరింత గంభీరంగా మార్చుకుని అడిగాడు.

"ముందు అనుకున్నట్లు వాళ్ళు ఇవ్వాల్సింది ఎనభైకోట్లు కదా ఇప్పుడేంటి అరవైతో సరిపెట్టేస్తున్నారు?"

పీఎ ఈసారి వినయంగా నటించాడు. "దానికే ఏడుస్తున్నారు సార్... కాంట్రాక్ట్ లో పెద్దగా మిగిలేదేం లేదంటున్నారు. అనుకున్నదానికంటే ఎక్కువే ఖర్చయిందంట... నాలుగొందల అడుగులు అనుకుంటే ఎనిమిది వందల అడుగులు దాకా డ్రిల్ చేయాల్సి వచ్చిందంట... ఇంజనీరింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయాయని ఒకటే గొడవ..."

"ఇదంతా చెప్పటానికి నువ్వెంత నొక్కావురా?" మంత్రిగారు పైకి అన్లేదు మనసులో అనుకున్నారు. ఆయనకీ తెలుసు తెగేదాకా లాగితే ఆ కాంట్రాక్టర్ తన మొగుడి దగ్గరకే పోతాడు అప్పుడు అసలైన లెక్కలన్నీ బైటకొస్తాయి.

నీటిలో వుండే ఫ్లోరోసిస్ తదితర విష పదార్ధాల కారణంగా మనుష్యులు, జంతువులు, ఇతర ప్రాణులు దారుణంగా బలైపోతున్నారన్న దయతో ఏదో విదేశీ ప్రభుత్వం మన స్వదేశీ ప్రభుత్వానికి వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చింది. ఆ డబ్బుతో నీటిని శుద్ధి చేసి స్వచ్చమైన నీటిని జనానికి అందించాలి. వెయ్యి కోట్లు ఇంకా రాకముందే అంచనాలు, కమీషన్లు, లెక్కలు పూర్తయిపోయాయి. ఇప్పుడు వాటాలు తేల్చుకుంటున్నారన్నమాట.

"సరే ఫైనల్ గా ఇంకో ఐదు పంపమని వాడికి చెప్పు... త్వరలో ఎలక్షన్లు వస్తున్నాయి... ఈసారి ఎంత మేత పెట్టాలో మళ్ళీ రూలింగ్ లోకి రాకపోతే జీవితాంతం కోర్టులు, ఎంక్వయిరీ కమీషన్ల చుట్టూ తిరగాలి..."

"చేసుకున్నవాడికి చేసుకున్నంత..." పీఎ కూడా పైకి అన్లేదు మనస్సులో అనుకుంటూ వినయంగా తలాడించాడు.

No comments:

Post a Comment