Tuesday 24 March 2015

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పేరు 'అమరావతి'



అమరావతి చరిత్ర :అమరావతి ఆగ్నేయ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ నందు ఉన్న ఒక పట్టణము, ఇదేపేరుతో ఉన్న రెవిన్యూ మండలానికి కేంద్రము. పిన్ కోడ్: 522020. ఇది గుంటూరు జిల్లాలో కృష్ణా నదీ తీరానికి కుడి వైపున ఉన్నది. ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది.[1] ఈ పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటకము ప్రసిద్ధిచెందినది.చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణము లో వసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు.
చరిత్ర
అమరావతిలో కల అమరేశ్వర ఆలయం కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రాయన గ్రంథంలో పొందుపరచబడి వున్నాయి. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.
అమరేశ్వరాలయం
గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం. ప్రతి యేటా విజయదశమి రోజున . మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి . అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు . జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు ,కుమార స్వామి , ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్టితమై ఉన్నాడు.
అమరారామం
అమరలింగేశ్వరస్వామి దేవాలయ గోపురము
అమరలింగేశ్వర స్వామి (శివుడు) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు వున్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందుతున్నాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించినట్టుగా ఇందులో రాసి ఉంది.
స్థలపురాణం
త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించి . అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్టించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
పునరుద్ధరణ
1980లో జరిగిన పుష్కరాల సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రస్థుతం మనం చూస్తున్న విశాలమైన ఆలయద్వారం ఎత్తైన గాలిగోపురం గతంలో చిన్నద్వారం చిన్న గాలిగోపురంగా ఉండేవి. మొత్తం విచ్చిన్నం చేసి కొత్త నిర్మాణం కొరకు లోతుగా పునాదులు తీయబడ్డాయి. ఈ తవ్వకాలలో భౌద్ధ సంస్కృతికి చెందిన పాలరాతి శిల్పాలు అనేకం లభించాయి. ప్రస్థుతం మ్యూజియంలో కనిపిస్తున్న నంది ఈ తవ్వకాలలో లభించిందే. అలాగే మరికొన్ని చిన్న శిల్పాలు ఈ తవ్వకాలలో లభించాయి.
బౌద్ధ సంస్కృతి
ప్రధాన వ్యాసము: అమరావతి స్తూపం
అమరావతి స్తూపం నమూనా (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మ్యూజియంలో ఉన్న చిత్రం
అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నె.గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ.[2] అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. తావ్వకాల తరువాత పాలరాతి మీద చెక్కబడిన ప్రధాన్యత లేని కొన్ని శిల్పాలు నిర్లక్ష్యంగా వదిలి వేయబడ్డాయి. ప్రజలు ఈ పాలరాతి ముక్కలను తమ ఇండ్లకు తీసుకువెళ్ళి మెత్తని పొడిచేసి రంగోలీలో వాడుకున్నారు. తరువాత ఒక పలుచని కంచెతో సురక్షితం చేసినా ప్రజలు సులువుగా లోపల ప్రవేశించి స్థాపం సమీపంలో సంచరించారు. ఇందులో ఐదు పీరియడ్స్ కి సంబంధించిన నివాసుల అధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.
అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.
అమరావతి యొక్క లాటిట్యూడ్ 16 డిగ్రీల 34' ఉత్తరం , లాంగిట్యూడ్ 80 డిగ్రీల 17' తూర్పు. అమరావతికి అతి దగ్గర రైల్వే స్టేషను గుంటూరు. అక్కడ నుండి అమరావతికి బస్సు సర్వీసు ఉంది. వర్షాకాలంలో విజయవాడ నుండి లాంచిల ద్వారా కృష్ణానది పై ప్రయాణించి అమరావతి చేరవచ్చు. స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.
సత్యం శంకరమంచి వ్రాసిన అమరావతి కథలు ఈ గ్రామ/పట్టణ సంస్కృతికి అద్దంపట్టాయి.
రాజ వాసి రెడ్డి వెంకటాద్రి నాయుడు. మంగళగిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వున్న చిత్ర పటము. స్వంత కృతి
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు
ప్రధాన వ్యాసము: వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు
వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు అమరావతి సంస్థాన పాలకుడు. 1761 ఏప్రిల్ 20న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పాలనా కాలంలో చెంచులు గ్రామాలపైబడి దోచుకుంటూ ఉండేవారు. ఈ దోపిడీలను అరికట్టడానికి ఆయన 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి, వారిని మట్టుపెట్టించాడు. ఈ సంఘటనను "అటునుంచి కొట్టుకురండి" అన్న కథలో (అమరావతి కథలు)చక్కగా వివరించబడినది. ఈ సంఘటన జరిగిన గ్రామం పేరు నరుకుళ్ళపాడు గా మారింది. దానితో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా, ఆయన అశాంతికిలోనై, పాప పరిహారార్ధం దేవాలయాల నిర్మాణం చెయ్యమన్న కొందరు పెద్దల సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు. అమరావతి లోని అమరలింగేశ్వరస్వామి గుడిని పునరుద్ధరించాడు. 1807-09లో మంగళగిరి నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే బేతవోలు అనే గ్రామం పేరును జగ్గయ్యపేట గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు 1817, ఆగష్టు 17న మరణించాడు.
చేరుకునే మార్గం
కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షించే. ఈ పట్టణానికి రోడ్డు, విజయవాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి చేరుకోవడానికి విజయవాడ నుండి నేరుగా బస్సులున్నాయి. గుంటూరు నుండి 32 కిలోమీటర్ల దూరం ఉన్న అమరావతి చేరుకోవడానికి గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. గుంటూరు, విజయవాడల నుండి రైలులో కూడా అమరావతి చేరుకోవచ్చు. లేదా బోటులలో తేలికగా చేరవచ్చు.(1970-80 బోటు ద్వారా జలమార్గంలో అమరావతి చేరుకునే సదుపాయం ఉంది. తరువాత ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ విజయవాడ నుండి అమరావతికి మోటర్ బోటు ప్రయాణ వసతి కల్పించింది. అయినప్పటికీ ఇప్పుడే జలమార్గంలో బోటు సేవలు లభ్యం కావడం లేదు. అందుకు కారణం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పట్టడం. వర్షాకాలంలో మాత్రమే బోట్లు నడపగలిగిన జలమార్గంలో మిగిలిన సమయంలో ఇసుకదిబ్బలు. రాళ్ళు అడ్డుగా ఉండడమే ఇదుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. రాష్ట్ర ప్రభుత్వ బస్సు లు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి అమరావతి కి నడుస్తాయి. విజయవాడ లేదా గుంటూరు చేరుకుని అక్కడి నుండి అమరావతి వెళ్ళవచ్చు. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అమరావతిలో దలైలామా అమరావతి వచ్చిన సమయంలో ఆరంభించిన బౌద్ధనిర్మాణం పని జరుగుతూ ఉంది.
గ్రామంలోని ఇతర దేవాలయలు
శ్రీ బాలత్రిపురసుందరీ అమ్మవారి ఆలయం:- అమరావతి గ్రామంలోని క్రోసూరు రహదారి చెంత ఈ నూతన ఆలయ ప్రతిష్ఠోత్సవ వేడుకలు 2014,జూన్-8, ఆదివారం నాడు కన్నులపండువగా కొనసాగినవి. ఈ సందర్భంగా మండప దేవతాపూజలు, ప్రాతరౌపాసన, గర్తన్యాసం, రత్నన్యాసం, జీవన్యాసం, ధాతున్యాసాలను శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఉదయం 7-43 గంటల దివ్యముహూర్తంలో యంత్రస్థాపన, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలను నిర్వహించినారు. అదే సమయంలో, సింహవాహనం, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, శిఖర, కలశ ప్రతిష్ఠా మహోత్సవాలను సైతం, నిర్వహించినారు. 9 గంటలకు కళాన్యాసం, ప్రాణప్రతిష్ఠ, దిష్టికుంభం, పూర్ణాహుతి నిర్వహించినారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు.

No comments:

Post a Comment