Tuesday 13 May 2014

HAPPY MOTHER'S DAY...



అమ్మ.. పాపం పిచ్చిది... ఆమెకేం తెలీదు.. ఎంత చెప్పినా విన్పించుకోదు.. చాలాసార్లు విసిగిస్తుంది కూడా.. "ఎందుకు అలా తినూ తినూ అని వెంటపడతావు.. ఆకలేస్తే నేను తింటా కదా" అని కసురుకున్నా ఆ విసురుకి మనస్సు కష్టపెట్టుకోదు.. 

బిడ్డ మొహంలో దిగులు పొడచూపనీయదు.. బిడ్డ ఎక్కడ దిగాలు పడిపోతుందోనని తనకు చేతనైన నాలుగు మాటలతో "నేనున్నాగా... ఇది కాకపోతే ఇంకోటి.." అంటూ కొండంత అండగా నిలవాలని అపసోపాలు పడుతుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నిపుణుల్లా ఆమెకు స్ఫూర్తి రగిలించడం తెలీదు.. కానీ ఆమె బాధల్లోనూ, కష్టాల్లోనూ, నిరంతరం వెన్నంటి చెప్పే చిన్న చిన్న మాటలే మనం కుప్పకూలకుండా కాపాడేస్తున్నాయి.

ఏమీ తెలీనప్పుడు.. "అదేంటీ.. ఇదేంటీ" అని సమాధానం చెప్పేవరకూ మారాం చేసి పాపం ఆవిడ ఓపికను పరీక్షించేవాళ్లం.. ఇప్పుడు మనకన్నీ తెలుసు... ఆమెకేం తెలీదని ఓ తేలిక నవ్వుతో చిన్నచూపు చూసినా "బిడ్డలే కదా, ఎంత ఎదిగిపోయారో అని సంతోషిస్తుందే" తప్ప బాధపడిపోదు.

అమ్మ శ్రమపడుతున్నా.. ఆ శ్రమ ఏళ్ల తరబడిగా కళ్లెదుటే ధారబోస్తున్నా... అమ్మ నడుములు వంగిపోతున్నా.. మోకాళ్లు నలిగిపోతున్నా.. ఐరన్, కాల్షియమ్‌లు కొరతపడి మొహంలో జీవం చచ్చిపోతున్నా.. మన విజయాలకు అమ్మ కడుపునిండా సంతోషపడట్లేదని ఏడ్చేస్తాం గానీ... అప్పటికీ లేని సత్తువ తెచ్చుకుని... ఆవిరైన అనుభూతులు అగాధాల్లోంచి తోడుకుని వచ్చి అమ్మ నవ్వే నవ్వు మన కళ్లకు ఆనదు.

అమ్మలందరూ అనీమియాతో జీవశ్చవాల్లా తయారవుతున్నారు.. వాళ్లని ఓసారి హాస్పిటల్‌కి తీసుకెళ్లి బాగోగులు చూడాలన్న స్పృహే రాదు... అదేమంటే అమ్మే కదా.. కాసేపు పడుకుని లేచి మళ్లీ ఆమే ఓపికగా తిరిగేస్తుందిలే అన్పిస్తుంది.. పాపం ఎవరూ పట్టించుకోక రోజూ ఆమె చేసేది అదే కదా!

మదర్స్ డే రోజు నాలుగు ముద్దులూ, ఫోన్‌లో విషెస్, వీలైతే ఓ చీరో, ఫోనో కొని అమ్మల పట్ల మన concern చాటేసుకున్నామనుకుంటున్నాం...

కళ్లు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడగలుతున్నామంటే.. ఈ శరీరంలో ఊపిరంటూ ఉందంటే అది అమ్మ గర్భంలో ఊపిరిపోసుకున్నదే... మన ప్రపంచం ఆ గర్భం నుండి మొదలైందీ.. స్మశానంలో అంతమవుతుంది... ఈ మధ్య గడిపేదంతా తల్లి పెట్టిన భిక్షే. పురుటి నొప్పులు పడలేననుకుంటేనో, అబార్షన్ చేయించుకుందామనుకుంటేనో ప్రపంచం అనేదే తెలీకుండానే ఆ గర్భంలో సమాధి అయిపోయేవాళ్లం. ఒక్కసారి మనసారా అమ్మని స్మరించుకోండి.. జీవితం అర్థమవుతుంది.

ఆమెకంటూ ఎలాంటి ప్రపంచం లేదు.. బాల్యాన్ని కన్నవాళ్ల దగ్గరా.. యౌవ్వనాన్ని కట్టుకున్న వాడి దగ్గరా... మధ్యవయస్సు, ముసలితనాలను మన బాగోగుల దగ్గరా తాకట్టు పెట్టేసింది.. అయినా ఇంకా అమ్మ శ్రమనీ, ఓపికనీ పిండేయాలనే...

ఆమె కళ్లల్లోని ప్రేమ ఆమె అమాయకత్వంగా కన్పిస్తుంది.. మన పట్ల ఆమె చూపించే జాగ్రత్త చేతకానితనంగా కన్పిస్తుంది... ఆమెని రకరకాలుగా అర్థం చేసేసుకుని చివరకు ఎందుకూ పనికిరాని.. ఏమీ తెలియని వ్యక్తిగా పక్కనపెట్టేయడం మాత్రం చాలా బాగా నేర్చేసుకున్నాం.

No comments:

Post a Comment