1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నిజాయితీపరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు మరియు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు. ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తరువాత మనం మళ్ళీ 1953 నాటి పరిస్థితికి వచ్చాము. కొత్త రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ నెల 7వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
మరి ఇప్పుడు మన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అవబోతున్నారు? ఆనాడు ఆంధ్రకేసరి కూర్చున్న కుర్చీలో ఇప్పుడు ఎవరు కూర్చోబోతున్నారు? ప్రకాశం గారి స్థాయి నాయకులు ఇప్పుడు ఎవరూ లేరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అలాంటి వారు ఇమడలేరు కూడ. కాని అలాంటి మహనీయుడు అలంకరించిన పదవిని అందుకోబోయే వ్యక్తి అంతటి గొప్పవాడు కాకపోయినా, ఆ పదవికి, ప్రకాశం గారికి అవమానం కలిగించేలా ఉండకూడదని నా అభిప్రాయం. సింహం స్థానంలో గుంటనక్కలకి అవకాశం ఇవ్వకూడదు.
ఇప్పుడు రాజకీయాలలో ఉన్నవాళ్ళు ఇంచుమించు అందరూ దొంగలే కావచ్చు. కాని అందుబాటులో ఉన్నవాళ్ళలో మెరుగైన వాళ్ళని ఎన్నుకోవడమే మనం చెయ్యగలిగింది. వ్యవస్థలలోని లోపాలు సవరించబడేవరకు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అద్భుతాలు జరగవు. రామరాజ్యం రాకపోయినా పరవాలేదు కాని రౌడీరాజ్యం రాకుండా ఉంటే చాలు.
అందుకే అవినీతి చీకటిని తిడుతూ కూర్చోకండి. ఓటు దీపం వెలిగించండి.
tanguturi prakasanm pantulu Garu
No comments:
Post a Comment