Tuesday 13 May 2014

ఫుడ్‌ విలువ కోల్పోతోందా...!!



నా చిన్నప్పుడు తాతయ్య దగ్గర పెరిగా... పేద కుటుంబం కాదు గానీ జాగ్రత్త కల మనిషి..

నెలకోరోజు ఎగ్ తింటే అదో పండగ లాంటి ఫీలింగ్.. అన్నం అంతా పులుసుతో తినేసి ఎగ్ చివరి వరకూ అపురూపంగా దాచేసుకుని సంతృప్తిగా తినే అలవాటు...

అమ్మమ్మా, తాతయ్య పొలం వెళ్లి ఇంటికొచ్చి కూరలొండే ఓపిక లేక వేడి వేడి అన్నం, ఎరగారం (కొంతమందికే ఈ పదం అర్థమవుతుంది) పచ్చడేసుకుని ఆవురావురుమంటూ తినేవాళ్లూ..మాకూ అదే అమృతంతో సమానం...

వేయించిన మినుములు, అటుకుల్లాంటివి స్నాక్స్... మధ్యలో ఆకలేస్తే తినడానికి..!

అవేమంత గొప్ప ఫుడ్స్ కాకపోయినా జీవితాంతం గుర్తుండిపోయే సంతృప్తి..

తర్వాత చెన్నైలో సినిమా ఫీ‌ల్డ్‌లో జాబ్ చేసేటప్పుడు... సేలరీ సరిపోక.. ఒక పూట మాత్రమే తినడానికి రూ. 30 చేతిలో ఉండేవి.. ఆ 30తో రూమ్మేట్ రాంబాబూ, నేనూ శరవణ భవన్ లో ఓ మీల్స్ తీసుకుని రూమ్ కెళ్లి సగం సగం తిన్న రోజులు. అప్పుడూ ఫుడ్ విలువా, దాని సంతృప్తీ తెలిసింది..

ఇవ్వాళ చాలామంది ఇళ్లల్లో వారానికో రోజు స్పెషల్ డే.. మరికొందరికైతే వారానికి మూడు నాలుగు రోజులు కూడా అలవాటైపోయింది. నాన్ వెజ్ ల లాంటివో, వెజిటేరియన్స్ అయితే ఏవో ఒక వెరైటీసో ఉండాల్సిందే...

చాలామందికి ఫుడ్ ఓ వ్యసనమైపోయింది... చేయడానికి ఎలాంటి శారీరక శ్రమా లేదు కానీ కడుపులో ఖాళీ లేకపోయినా ఏదో ఒకటి తోసిపారేసేటంత బలహీనతై పోయింది.

ఫుడ్ విలువా తెలీదు చాలామందికి. అన్ని వస్తువుల్లాగే ఆహారమూ ఓ వస్తువైపోయింది. ఎంత పెట్టయినా కొనేసుకోగలం... కానీ తినే ముద్దలో జీవం లేదు.. అది లోపలికి వెళ్లి జీర్ణం కావడానికి కావలసిన అర్హత మన శరీరానికి లేదు.. ఇంకేం వంటపడుతుంది?

శరీరానికీ.. మనస్సుకీ... ఆహారానికీ చాలా అవినాభావ సంబంధం ఉంది.

శరీరమూ, మనస్సూ కోరుకోవాలి ఆహారాన్ని.. శరీరం అంటే నాలుకొక్కటే కాదు... సత్తువ కోసం తహతహలాడే శారీరక అవయువాలు. అలాంటి తహతహలేమీ మన శరీరాలకు ఇప్పుడు లేవు... కేవలం ఉన్నది నాలుక పడే తహతహే...!!

ఎందుకు తింటున్నారో తెలీక.. తినేది అరగకా... అరగకపోయినా ఇంకా తినాలన్పించే నాలుకను నియంత్రించుకోలేక సతమతమవుతున్న వాళ్లెందరో....!!

చివరిగా ఒక్క మాట.. నా దేశానికి, నా ప్రజలకు ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోతోందో, రూపాయి విలువ ఎంత పడిపోతోందో మాత్రమే తెలుసు.. దీన్ని అభివృద్ధి అనుకోవలసి వస్తోంది. శ్రమా, ఆహారం విలువా ఎంతగా దిగజారిపోతున్నాయో ఏమాత్రం తెలీదు. 

No comments:

Post a Comment