Tuesday 13 May 2014

ఫుడ్‌ విలువ కోల్పోతోందా...!!



నా చిన్నప్పుడు తాతయ్య దగ్గర పెరిగా... పేద కుటుంబం కాదు గానీ జాగ్రత్త కల మనిషి..

నెలకోరోజు ఎగ్ తింటే అదో పండగ లాంటి ఫీలింగ్.. అన్నం అంతా పులుసుతో తినేసి ఎగ్ చివరి వరకూ అపురూపంగా దాచేసుకుని సంతృప్తిగా తినే అలవాటు...

అమ్మమ్మా, తాతయ్య పొలం వెళ్లి ఇంటికొచ్చి కూరలొండే ఓపిక లేక వేడి వేడి అన్నం, ఎరగారం (కొంతమందికే ఈ పదం అర్థమవుతుంది) పచ్చడేసుకుని ఆవురావురుమంటూ తినేవాళ్లూ..మాకూ అదే అమృతంతో సమానం...

వేయించిన మినుములు, అటుకుల్లాంటివి స్నాక్స్... మధ్యలో ఆకలేస్తే తినడానికి..!

అవేమంత గొప్ప ఫుడ్స్ కాకపోయినా జీవితాంతం గుర్తుండిపోయే సంతృప్తి..

తర్వాత చెన్నైలో సినిమా ఫీ‌ల్డ్‌లో జాబ్ చేసేటప్పుడు... సేలరీ సరిపోక.. ఒక పూట మాత్రమే తినడానికి రూ. 30 చేతిలో ఉండేవి.. ఆ 30తో రూమ్మేట్ రాంబాబూ, నేనూ శరవణ భవన్ లో ఓ మీల్స్ తీసుకుని రూమ్ కెళ్లి సగం సగం తిన్న రోజులు. అప్పుడూ ఫుడ్ విలువా, దాని సంతృప్తీ తెలిసింది..

ఇవ్వాళ చాలామంది ఇళ్లల్లో వారానికో రోజు స్పెషల్ డే.. మరికొందరికైతే వారానికి మూడు నాలుగు రోజులు కూడా అలవాటైపోయింది. నాన్ వెజ్ ల లాంటివో, వెజిటేరియన్స్ అయితే ఏవో ఒక వెరైటీసో ఉండాల్సిందే...

చాలామందికి ఫుడ్ ఓ వ్యసనమైపోయింది... చేయడానికి ఎలాంటి శారీరక శ్రమా లేదు కానీ కడుపులో ఖాళీ లేకపోయినా ఏదో ఒకటి తోసిపారేసేటంత బలహీనతై పోయింది.

ఫుడ్ విలువా తెలీదు చాలామందికి. అన్ని వస్తువుల్లాగే ఆహారమూ ఓ వస్తువైపోయింది. ఎంత పెట్టయినా కొనేసుకోగలం... కానీ తినే ముద్దలో జీవం లేదు.. అది లోపలికి వెళ్లి జీర్ణం కావడానికి కావలసిన అర్హత మన శరీరానికి లేదు.. ఇంకేం వంటపడుతుంది?

శరీరానికీ.. మనస్సుకీ... ఆహారానికీ చాలా అవినాభావ సంబంధం ఉంది.

శరీరమూ, మనస్సూ కోరుకోవాలి ఆహారాన్ని.. శరీరం అంటే నాలుకొక్కటే కాదు... సత్తువ కోసం తహతహలాడే శారీరక అవయువాలు. అలాంటి తహతహలేమీ మన శరీరాలకు ఇప్పుడు లేవు... కేవలం ఉన్నది నాలుక పడే తహతహే...!!

ఎందుకు తింటున్నారో తెలీక.. తినేది అరగకా... అరగకపోయినా ఇంకా తినాలన్పించే నాలుకను నియంత్రించుకోలేక సతమతమవుతున్న వాళ్లెందరో....!!

చివరిగా ఒక్క మాట.. నా దేశానికి, నా ప్రజలకు ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోతోందో, రూపాయి విలువ ఎంత పడిపోతోందో మాత్రమే తెలుసు.. దీన్ని అభివృద్ధి అనుకోవలసి వస్తోంది. శ్రమా, ఆహారం విలువా ఎంతగా దిగజారిపోతున్నాయో ఏమాత్రం తెలీదు. 

HAPPY MOTHER'S DAY...



అమ్మ.. పాపం పిచ్చిది... ఆమెకేం తెలీదు.. ఎంత చెప్పినా విన్పించుకోదు.. చాలాసార్లు విసిగిస్తుంది కూడా.. "ఎందుకు అలా తినూ తినూ అని వెంటపడతావు.. ఆకలేస్తే నేను తింటా కదా" అని కసురుకున్నా ఆ విసురుకి మనస్సు కష్టపెట్టుకోదు.. 

బిడ్డ మొహంలో దిగులు పొడచూపనీయదు.. బిడ్డ ఎక్కడ దిగాలు పడిపోతుందోనని తనకు చేతనైన నాలుగు మాటలతో "నేనున్నాగా... ఇది కాకపోతే ఇంకోటి.." అంటూ కొండంత అండగా నిలవాలని అపసోపాలు పడుతుంది. పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నిపుణుల్లా ఆమెకు స్ఫూర్తి రగిలించడం తెలీదు.. కానీ ఆమె బాధల్లోనూ, కష్టాల్లోనూ, నిరంతరం వెన్నంటి చెప్పే చిన్న చిన్న మాటలే మనం కుప్పకూలకుండా కాపాడేస్తున్నాయి.

ఏమీ తెలీనప్పుడు.. "అదేంటీ.. ఇదేంటీ" అని సమాధానం చెప్పేవరకూ మారాం చేసి పాపం ఆవిడ ఓపికను పరీక్షించేవాళ్లం.. ఇప్పుడు మనకన్నీ తెలుసు... ఆమెకేం తెలీదని ఓ తేలిక నవ్వుతో చిన్నచూపు చూసినా "బిడ్డలే కదా, ఎంత ఎదిగిపోయారో అని సంతోషిస్తుందే" తప్ప బాధపడిపోదు.

అమ్మ శ్రమపడుతున్నా.. ఆ శ్రమ ఏళ్ల తరబడిగా కళ్లెదుటే ధారబోస్తున్నా... అమ్మ నడుములు వంగిపోతున్నా.. మోకాళ్లు నలిగిపోతున్నా.. ఐరన్, కాల్షియమ్‌లు కొరతపడి మొహంలో జీవం చచ్చిపోతున్నా.. మన విజయాలకు అమ్మ కడుపునిండా సంతోషపడట్లేదని ఏడ్చేస్తాం గానీ... అప్పటికీ లేని సత్తువ తెచ్చుకుని... ఆవిరైన అనుభూతులు అగాధాల్లోంచి తోడుకుని వచ్చి అమ్మ నవ్వే నవ్వు మన కళ్లకు ఆనదు.

అమ్మలందరూ అనీమియాతో జీవశ్చవాల్లా తయారవుతున్నారు.. వాళ్లని ఓసారి హాస్పిటల్‌కి తీసుకెళ్లి బాగోగులు చూడాలన్న స్పృహే రాదు... అదేమంటే అమ్మే కదా.. కాసేపు పడుకుని లేచి మళ్లీ ఆమే ఓపికగా తిరిగేస్తుందిలే అన్పిస్తుంది.. పాపం ఎవరూ పట్టించుకోక రోజూ ఆమె చేసేది అదే కదా!

మదర్స్ డే రోజు నాలుగు ముద్దులూ, ఫోన్‌లో విషెస్, వీలైతే ఓ చీరో, ఫోనో కొని అమ్మల పట్ల మన concern చాటేసుకున్నామనుకుంటున్నాం...

కళ్లు తెరిచి ఈ ప్రపంచాన్ని చూడగలుతున్నామంటే.. ఈ శరీరంలో ఊపిరంటూ ఉందంటే అది అమ్మ గర్భంలో ఊపిరిపోసుకున్నదే... మన ప్రపంచం ఆ గర్భం నుండి మొదలైందీ.. స్మశానంలో అంతమవుతుంది... ఈ మధ్య గడిపేదంతా తల్లి పెట్టిన భిక్షే. పురుటి నొప్పులు పడలేననుకుంటేనో, అబార్షన్ చేయించుకుందామనుకుంటేనో ప్రపంచం అనేదే తెలీకుండానే ఆ గర్భంలో సమాధి అయిపోయేవాళ్లం. ఒక్కసారి మనసారా అమ్మని స్మరించుకోండి.. జీవితం అర్థమవుతుంది.

ఆమెకంటూ ఎలాంటి ప్రపంచం లేదు.. బాల్యాన్ని కన్నవాళ్ల దగ్గరా.. యౌవ్వనాన్ని కట్టుకున్న వాడి దగ్గరా... మధ్యవయస్సు, ముసలితనాలను మన బాగోగుల దగ్గరా తాకట్టు పెట్టేసింది.. అయినా ఇంకా అమ్మ శ్రమనీ, ఓపికనీ పిండేయాలనే...

ఆమె కళ్లల్లోని ప్రేమ ఆమె అమాయకత్వంగా కన్పిస్తుంది.. మన పట్ల ఆమె చూపించే జాగ్రత్త చేతకానితనంగా కన్పిస్తుంది... ఆమెని రకరకాలుగా అర్థం చేసేసుకుని చివరకు ఎందుకూ పనికిరాని.. ఏమీ తెలియని వ్యక్తిగా పక్కనపెట్టేయడం మాత్రం చాలా బాగా నేర్చేసుకున్నాం.

LIFE IS BEAUTIFUL




చాలామంది లైఫ్ అయిపోయిందనుకుంటారు... లైఫ్‌లో ఇంకేం చెయ్యలేం అనుకుంటారు.. ఏ ఒక్క లైఫూ అంత మీనింగ్‌లెస్‌గా అయిపోయేది కాదు..

నావరకూ నేను ఎంతమందిని చూశానో.. నిన్న మొన్నటి వరకూ చాలా స్ట్రగుల్ పడీ.. ఇప్పుడు చాలా గౌరవప్రదమైన స్థాయిల్లో ఉన్న వాళ్లని...

వేళ్ల మీద లెక్క పెట్టుకోండి... ఐదంటే ఐదేళ్లు.... చాలా విలువైన ఐదేళ్లు మీ లైఫ్‌లో పొంచి ఉంటాయి.. ఆ ఐదేళ్లు ఎంత వీలైతే అంత కష్టపడండి.. కన్పించిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోండి.. తెలివైన నిర్ణయాలు తీసుకోండి... చాలు.. మీరు ఇన్నేళ్లు పడిన దిగులంతా ఆ సక్సెస్‌లో కొట్టుకుపోతుంది.

ఖాళీగా ఉంటున్నామే... ఇంట్లో వాళ్ల చూపుల్ని కూడా భరించలేకపోతున్నామే.. చనిపోవాలనిపిస్తుందే... అని ఏవేవో పిచ్చి ఆలోచనలు చేయకండి...

లైఫ్‌లో కెరీర్ ఓ చిన్న ఎపిసోడ్ మాత్రమే. ఆఫ్టరాల్ కెరీర్, సెటిల్మెంట్ గురించే అంత భారీ ఆలోచనలు చేస్తే ఎంతో విలువైన లైఫ్ ముందుంది... అది ఎవరు లీడ్ చేస్తారు?

యెస్... గిల్ట్ ఫీల్ ఉంటుంది... పరీక్షలు రాసీ... ఫలితాలు సరిగ్గా వచ్చీ రాకా.. అంతా బాగున్నా ఉద్యోగాలు దొరక్కా.... అన్నీ చాలా టిపికల్‌‌గానే ఉంటాయి... ఏది ఎలాగైనా చావనీయండి... నేర్చుకోవడం, కష్టపడడం ఆపకండి... ఖచ్చితంగా మీకంటూ ఓ క్షణం వస్తుంది... ఆ క్షణం మీరు నేర్చుకున్నదీ, కష్టపడినదీ దాని సత్తా ఏమిటో మీరే నమ్మనంత నిరూపించి చూపిస్తుంది.

ఫోకస్ పెట్టిన ప్రతీదీ ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది.. వదిలేసిన ప్రతీదీ ఖచ్చితంగా నిరాశపరుస్తుంది. ఇది యూనివర్శల్ ట్రూత్. ఏ క్షణం మీరు జీవితంపై, కెరీర్‌పై ఆశ వదిలేస్తారో అంతటితో మీ అవకాశాలు నిలిచిపోతాయి. నేర్చుకుంటూ ట్రై చేయడమే... అలా ప్రయత్నించేటప్పుడు ఎవరెన్ని అవమానాలైనా చేయనీయండి... ఎన్ని మాటలైనా అననీయండి... పెదాలపై ఒక్క నవ్వుని నమ్ముకోండి... అందరి దగ్గరా ఆ ఒక్క నవ్వు నవ్వేసి లోపలెంత బాధ ఉన్నా తొక్కిపెట్టి మరింత కసిగా సాగిపొండి...

ఆ నవ్వే మీకు శ్రీరామరక్ష.. ఆ నవ్వే మీ కాన్ఫిడెన్స్ లెవలూ కూడా.. రేపు మీరేంటో ఈ ప్రపంచానికి నిరూపించేదీ ఆ నవ్వే... ఏ అవకాశాలూ లేవనీ, అందరూ చులకన చేస్తున్నారనీ ఏడ్చి ఏం సాధిస్తారు... నవ్వడం మొదలెట్టండి.. నేర్చుకోవడం మొదలెట్టండి.. కష్టపడడం మొదలెట్టండి... అన్నీ అవే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి.. ఈ పూట కాకపోతే ఇంకో పూట ఆలస్యమవుతుందంతే.. కానీ రాకుండా మాత్రం పోవు.

ఒక్కటి మాత్రం నిజం... కసి ఉన్నోడిదే లైఫ్.. కసి లేని వాడికి జీవితం ఎప్పుడూ సహకరించదు... కసిని నిలుపుకోండి.. సాధించండి ఏదైనా, ఎంతవరకైనా..! లైఫ్ రబ్బర్ బాండ్ లాంటిది.. ఎంత సాగదీస్తే అంత దూరం సాగుతుంది.. ఎంత వదిలేస్తే అంత కుంచించుకుపోతుంది...!!

what is LIFE ?





మనిషికి చావంటే ఊహకు తట్టుకోలేనంత భయం... కానీ బ్రతికుండీ ఏం సాధిస్తున్నారో మాత్రం తెలీదు..
పుట్టినప్పటి నుండీ మేజర్ డెస్టినేషన్ చావు వైపే ప్రయాణమే అయినా.. ఎలాగోలా ఆ భగవంతుడు చావు నుండి మనకు మినహాయింపు ఇస్తాడన్న ఆశ... అందరూ పోతున్నా.. కాసేపు భయపడిపోయి.. బలవంతంగా ఆలోచనలు మళ్లించేసుకుని మనుషుల సమూహంలో సేఫ్‌గా ఉండిపోయే ప్రయత్నం..
పదిమంది చుట్టూ చేరితే మనకు చావు గుర్తురాదు.. చావు గురించి భయాలు మర్చిపోతాం.. నాకు తెలిసి ఈ టాపిక్ ఇంతవరకూ చదివే ధైర్యం ఉన్న వాళ్లు కూడా తక్కువే.. అంత భయం మనకు ఇలాంటివి ఆలోచించాలంటే..!!
ఓకే ఫైన్.. సో భగవంతుడు అద్భుతమైన లైఫే ఇచ్చాడన్నది అర్థమైంది కదా... మనకు బ్రతకాలన్న బలమైన కోరికని గమనిస్తే! సో ఆ అద్భుతమైన లైఫ్ ఏం ఊడబీకుతున్నాం?
తెల్లారిలేస్తే కుట్రలూ, కుతంత్రాలూ, మోసాలూ, వాడుకోవడాలూ, వాడుకుని వదిలేయడాలూ, ఎలాగోలా పెట్టెలు పెట్టెలు కూడబెట్టాలన్న స్వార్థాలూ.. చివరకు నవ్వూ, నడకా, నడతా, అందం, ఆకారం అన్నీ నటనే.. నటించడానికి కాదు కదా ఇంత గొప్ప జీవితం ఉంది?
ఎందుకు పుట్టామో తెలీదు... ఏం సాధించాలనుకుంటున్నామో క్లారిటీ లేదు.. ఏదోలా రోజులు గడిపేస్తే చాలు.. కడుపునిండా తింటే అదే జీవితం.. తూలిపోయేలా తాగితే అదే జీవితం... మెరిసిపోయే వర్క్ శారీస్ కట్టుకుంటే అదే జీవితం... ఖరీదైన కార్లలో తిరిగితే అదే జీవితం.. ఏం కొనాలన్నా డబ్బుకు ఢోకా లేకపోతే అదే జీవితం.... నిజంగా ఇదా జీవితం?
"నా లైఫ్‌లో ఫలానా కార్ ఒక్కటి కొంటే చాలు ఇంకేం అవసరం లేదు..." అని ఎంతో థ్రిల్లింగ్‌గా చెప్పేస్తుంటారు కొంతమంది. చాలామందికి ఇలాంటివే చిన్నాచితకా కోరికలు ఉండిపోతాయి..
వీటన్నింటి వెనుకా రహస్యం.. ఇలాంటి కోరికలతో జీవితం పట్ల ఆశని నిలబెట్టుకోవడం... మనుషులకు జనాలు ఉండాలి.. జనాలు చూసే గౌరవప్రదమైన చూపులూ, పలకరింపులూ కావాలి... వాటన్నింటి మధ్యా వయస్సునీ, చావునీ మర్చిపోవాలి.. ఈ భూమ్మీదే స్థిరంగా పాతుకుపోతామన్న భ్రమలో ఉండిపోవాలి..
ఒక్కసారి అన్నీ తల్లక్రిందులు అయితే తట్టుకునే మానసిక స్థైర్యం ఎంతమందికి ఉంది?
లైఫ్ ఎప్పుడూ నువ్వు కోరుకున్నట్లు ఉండదు.... ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు...
ఈ జీవితానికి ఏదైనా పర్పస్ ఉండాలీ అంటే నువ్వు సంపాదించుకోవడం, నువ్వు సుఖపడడం కాదు... సుఖపడడంలో తప్పులేదు.. కానీ నువ్వు సుఖం తనివితీరా తీర్చుకునే లోపు జీవితం ముగిసిపోతుంది.. ఇంకా నీ వల్ల ఈ ప్రపంచానికి ఉపయోగమేముంది?
భగవంతుడిని ఆయుష్షు కోసం ప్రార్థించేటప్పుడు.. నీ సుఖం కోసం ఆయుష్షు కోరుకుంటే భగవంతుడు విన్పించుకోడు... సమాజానికి ఏదైనా చెయ్యడం కోసం.. "ఈ భూమ్మీద మిగిలి ఉంటే ఏదైనా చేయగలను స్వామీ" అని దణ్ణం పెట్టుకో... ఫలితం ఉంటుంది... ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేదా అని డిబేట్లు మనకు అనవసరం.. భగవంతుడు ఉన్నా.. లేదా సూపర్ పవర్ లాంటిదోదో ఉన్నా.. ప్రతీదీ ప్రకృతీ, మనిషీ, సమాజం హార్మోనీని కాపాడే ప్రయత్నంలో అవసరాన్ని బట్టి కొన్ని ప్రాణాలను తీయకా తప్పదు.. కొన్ని ప్రాణాలను కాపాడకా తప్పదు.. అది ఆ సూపర్ పవర్ విద్యుక్త ధర్మం.

Monday 5 May 2014

First Chief Minister Of Andhra Pradesh---tanguturi prakasanm pantulu



1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నిజాయితీపరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు మరియు మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి కెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరి అని పేరు పొందినవాడు. ఈ రోజు రాష్ట్రం విడిపోయిన తరువాత మనం మళ్ళీ 1953 నాటి పరిస్థితికి వచ్చాము. కొత్త రాష్ట్రాన్ని పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఈ నెల 7వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

మరి ఇప్పుడు మన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అవబోతున్నారు? ఆనాడు ఆంధ్రకేసరి కూర్చున్న కుర్చీలో ఇప్పుడు ఎవరు కూర్చోబోతున్నారు? ప్రకాశం గారి స్థాయి నాయకులు ఇప్పుడు ఎవరూ లేరు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో అలాంటి వారు ఇమడలేరు కూడ. కాని అలాంటి మహనీయుడు అలంకరించిన పదవిని అందుకోబోయే వ్యక్తి అంతటి గొప్పవాడు కాకపోయినా, ఆ పదవికి, ప్రకాశం గారికి అవమానం కలిగించేలా ఉండకూడదని నా అభిప్రాయం. సింహం స్థానంలో గుంటనక్కలకి అవకాశం ఇవ్వకూడదు.

ఇప్పుడు రాజకీయాలలో ఉన్నవాళ్ళు ఇంచుమించు అందరూ దొంగలే కావచ్చు. కాని అందుబాటులో ఉన్నవాళ్ళలో మెరుగైన వాళ్ళని ఎన్నుకోవడమే మనం చెయ్యగలిగింది. వ్యవస్థలలోని లోపాలు సవరించబడేవరకు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అద్భుతాలు జరగవు. రామరాజ్యం రాకపోయినా పరవాలేదు కాని రౌడీరాజ్యం రాకుండా ఉంటే చాలు.  

 అందుకే అవినీతి చీకటిని తిడుతూ కూర్చోకండి. ఓటు దీపం వెలిగించండి.


tanguturi prakasanm pantulu Garu