Saturday, 26 December 2020

Two Coins

 అది ద్వాపరయుగం. ఓసారి కృష్ణార్జునులకు ఓ పేద బ్రాహ్మణుడు కనిపించాడు. జాలిపడిన అర్జునుడు అతనికి ఓ సంచీ నిండుగా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ బ్రాహ్మణుణ్ని మార్గమధ్యంలో ఓ దొంగ దోచుకున్నాడు. గతిలేక అతడు మళ్లీ వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.


      ఓరోజు అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ వజ్రం ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాడు. గదిలో మూలన ఉన్న కుండలో దాచిపెట్టి పడుకున్నాడు.


      తెల్లారింది. చూస్తే భార్య లేదు. ఆ కుండా లేదు. పరుగెత్తుకుంటూ నదీతీరం దగ్గరికి వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కానీ కుండలో వజ్రం లేదు. నదిలో నీళ్లకోసం కుండ వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.


      మళ్లీ కృష్ణార్జునులు అతణ్ని విచారించారు ఏమైందని. ‘‘ఇక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు’’ అన్నాడు అర్జునుడు. ‘‘లేదు అర్జునా. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం’’ అంటూ బ్రాహ్మణుడికి రెండు బంగారు నాణేలు ఇచ్చాడు శ్రీకృష్ణుడు. 

      


సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలువలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా...’ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఓ జాలరి వలకి చిక్కి విలవిల్లాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. 


      ‘ఈ రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం’ అనుకుని నాణేలు ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ చేపను ఓ నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసింది. ‘‘అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుందండీ’’ అంటూ భర్తని పిలిచింది. గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారిద్దరూ. అది నదిలో వాళ్లు జారవిడుచుకున్న వజ్రం. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై ‘‘దొరికింది... దొరికింది నా చేతికి చిక్కింది’’ అని గావుకేకలు పెట్టాడు ఆ బ్రాహ్మణుడు. 


అదే సమయంలో ఇంట్లోకి వచ్చిన దొంగ కంగారుపడ్డాడు. ‘గతంలో ఈ బ్రాహ్మణుడి నుంచే బంగారు నాణేల సంచి దొంగిలించా, ఇప్పుడు అతను నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. అందుకే నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు’ అనుకుని వణికిపోయాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ‘‘నీ బంగారు నాణేలు నువ్వే తీసేసుకో. నన్ను మాత్రం రక్షకభటులకు పట్టివ్వద్దు’’ అని ప్రాధేయపడ్డాడు. 


      దంపతులు నివ్వెరపోయారు. పోగొట్టుకున్న రెండూ తిరిగి వచ్చాయి.  పరుగు పరుగున కృష్ణార్జునుల దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.


      ‘‘కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నువ్విచ్చిన రెండు నాణేలూ అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది’’ అని ప్రశ్నించాడు అర్జునుడు.


      ‘‘అర్జునా, తన దగ్గర బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. 


👉అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి చెడ్డలు, ఈతిబాధలు, కష్టసుఖాల గురించి ఆలోచించాడు. 


నిజానికి అది దేవుడు చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను’’ అని ముక్తాయించాడు శ్రీకృష్ణ పరమాత్మ.🍁


నాన్నా తో ప్రయాణం

 ఒక ఇంట్లో 80 సంవత్సరాలు వయసున్న తండ్రి, 45 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒక రోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది.


అది ఏమిటి? అని తండ్రి, కొడుకుని అడిగాడు.


కాకి అని చెప్పేడు కొడుకు.


మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి


ఇప్పుడే కదా కాకి అని చెప్పేను అన్నాడు కొడుకు.


మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.


కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో ” అది కాకి, కాకి ” అని గట్టిగా చెప్పేడు.

మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.

కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు” ఎందుకు నాన్నా ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అది కాకి అని 4సార్లు చెప్పేను, అర్థంకావట్లేదా”


కొంచంసేపటి తరవాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజి తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చ్హాడు.అందులో ఈ విధంగా రాసి ఉంది.


“ఇవాళ నా మూడేళ్ళ కొడుకు నాతోపాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అది ఏమిటి నాన్నా? అని వాడు 23సార్లు అడిగాడు.ప్రతిసారీ నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పేను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది.”


కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పేడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడంవల్ల 4సార్లు అడిగితే కొడుకు విసుక్కుంటున్నాడు

.

తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్దచేస్తారు. వాళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత.🍁

ఎవరు ధనవంతులు?

 ఎవరు ధనవంతులు?

ఓ జంట తమ ఆర్నెల్ల చంటిపాపతో సహా విహారయాత్రకు బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ పెద్ద హోటల్‌లో బసచేశారు.


 రాత్రిపూట పాప పాలకోసం గుక్కపెట్టి ఏడవడం ప్రారంభించింది. ఆ దంపతులు కూడా తెచ్చుకున్న పాలడబ్బా అప్పటికే ఖాళీ అయి పోయింది. దాంతో హోటల్‌ వాళ్ల దగ్గరికి వెళ్లి, ‘‘దయచేసి ఓ కప్పు పాలు ఇవ్వగలరా?’’ అని అడిగింది ఆ బిడ్డ తల్లి.


‘‘కప్పు పాలు రూ.యాభై అండీ... ఇవ్వమంటారా?’’ అన్నారు హోటల్‌ నిర్వాహకులు. ‘‘ఫర్వాలేదు.. ఇవ్వండి!’’ అని ఆమె పాలు తీసుకుని పాపకు తాగించింది.


తెల్లారి ఆ దంపతులు స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను చూడటానికి వెళ్లారు. ఇంతలో పాప మళ్లీ గుక్కపెట్టింది. చూట్టూ చూస్తే ఏ దుకాణాలూ కనపడలేదు. కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు పక్కన ఓ టీకొట్టు కనిపించింది. అడిగితే వాళ్లు పాలు ఇచ్చారు. బొజ్జ నిండటంతో పాప హాయిగా బజ్జుంది. తర్వాత ‘‘పాలకు ఎంత?’’ అని టీకొట్టు వ్యక్తిని అడిగింది ఆ తల్లి. 


‘‘పసిపిల్లల కోసం ఇచ్చిన పాలకు డబ్బులు తీసుకోమండీ’’ అన్నాడతను నవ్వుతూ. ఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదు. అంతేకాదు ప్రయాణంలో పాపకు అవసరమవుతాయని మరికొన్ని పాలు కూడా డబ్బాలో పోసిచ్చాడు. 


అక్కడినుంచి బయల్దేరిన ఆ తల్లిలో అంతర్మథనం... 


🌿‘నిజంగా ఎవరు ధనవంతులు? 

🌿అంతపెద్ద హోటల్‌ యజమానులా? 

🌿లక టీకొట్టు నడుపుకుంటున్న ఈ మామూలు మనిషా!? 


🌿గప్పతనం ఎందులో ఉంది... గుణంలోనా? లేక సంపదలోనా?’


* * *


🌿చలామంది సంపాదన యావలోపడి, తాము మనుషులమన్న సంగతే మర్చిపోతుంటారు. 


👉కనీ, ప్రతిఫలం ఆశించకుండా తోటివారికి చేసే చిన్నచిన్న సాయాలు... డబ్బు ఇచ్చే మజాను మించిన మంచి అనుభూతినిస్తాయి.🍁