గౌరవ పూజ్యులైన మాస్టారికి..
నమస్కారాలతో-
బావున్నారా?, గురుపూజోత్సవం రోజు గుర్తుకు వచ్చారు. నేను గురువునైనా నా గురువు మీరు కదా? మీతో ఫోన్లో రెండు ముక్కలు మాట్లాడేకన్నా నాలుగు ముక్కలు వుత్తరంగా రాద్దామని యెందుకో అనిపించింది. ఇదిగో అదిగో అని మన ‘ఉపాధ్యాయ దినోత్సవం’ వెళ్ళిపోయి ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ వచ్చేసింది.
మాస్టారూ.. మీరంటే చిన్నప్పటి నుండి నాకు చాలా యిష్టం. ఎంత యిష్టం అంటే పెద్దయ్యాక నేను కూడా మీలాగ మాస్టారు అవ్వాలనుకున్నాను. అయ్యాను. అయినందుకు చాలా సంబరపడ్డాను. అదే విషయం అప్పుడు మీకొచ్చి చెప్పాను. చాలా ప్రయోజకుడినయ్యానని నన్ను మీరు మెచ్చుకున్నారు. ‘మన దగ్గరున్నది జ్ఞానమైనా అజ్ఞానమైనా దాచుకోము.. పిల్లలకి యిచ్చేస్తాము..’ అని మీరు నవ్విన నవ్వు కూడా నేను మరిచిపోలేదు. మనకి మాత్రమే నిరంతర విద్యార్థిగా వుండే వీలు.. కాదు, అవసరం వున్నదని మీరు గర్వంగా చెప్పారు. అప్పటికీ నేను మిమ్మల్ని అడిగాను.. ‘ఆ రోజుల్లో- మీ రోజుల్లో బతకలేక బడిపంతులు అనేవారట కదా?’ అంటే- ‘మనం మాత్రమే బతికితే అది బతుకెలా అవుతుంది?’ అని మీరన్న మాట చదివిన పాఠాలకన్నా యెక్కువ గుర్తుంది. ఈ రోజుల్లో- మా రోజుల్లో ‘బతకడానికి బడిపంతులు’ అని అంటున్నారు!
ఔను.. ఇప్పుడు బతకడానికి బడిపంతులు. జీతాలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో వుద్యోగాలు వొదులుకొని వొచ్చిన వాళ్ళున్నారు. పిల్లలతో పాటు మనమూ యింటికి వచ్చేయొచ్చు. పిల్లలతో పాటు మనకూ సెలవులు వుంటాయి. స్ట్రెస్ లేదు. స్ట్రెయిన్ లేదు. ప్రెజర్ లేదు. బ్లడ్ ప్రెజర్ లేదు. పాఠం చెప్పామా.. మన పని అయిపోయిందా.. అంతే. చెప్పినా చెప్పకున్నా నడుస్తుంది. అదంతే. అప్పుడప్పుడూ ప్రభుత్వం ఆపనీ ఈపనీ అని అడ్డమైన పనులూ అప్పజెప్పినా మిగతా ప్రభుత్వ వుద్యోగులతో పోలిస్తే మనమే నయం. మిగతా ప్రభుత్వ శాఖల్లో వుద్యోగులు వుద్యోగుల్లా లేరు. పార్టీ కార్యకర్తల్లా వున్నారు. జెండాలూ చొక్కాలూ వొక్కటే తక్కువ. అలా వుండకపోతే వుద్యోగం చెయ్యలేరు. చెయ్యనివ్వరు. ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినా అంతే. ఇప్పుడు యింకాస్తా యెక్కువయ్యింది. మన పనిగంటల్లో మనం పనిచేసి రావడానికి లేదు. సాయంత్రం అయిదు తరువాతే అధికారులు వస్తారు. పగలంతా పని వొదిలి, అప్పుడు విధులు చేపడతారు. పని గంటలు దాటాకే వుద్యోగులకి పనికి ఆహార పథకం ప్రారంభమవుతుంది. కింది నుండి పైదాకా ఆమ్యామ్యాలే. పెరసంటేజీలే. కంచం లేని యిల్లు వుండొచ్చు. లంచం లేని ఆఫీసు లేదు. అయ్యయ్యో అనుకోకుండా అసహ్యించుకోకుండా ‘అయ్యో.. మనకి వాళ్ళలా రెండు చేతులా రాబడి లేదే’ అని వాపోయే వుపాధ్యాయులే మాలో యెక్కువ. డిగ్రీలూ పీజీలూ పీహేచ్దీలూ చేసి చాలక- బియ్యీడీ యెంట్రెన్సులూ రాసి- ర్యాంకుల కోసం కోచింగులకూ వెళ్ళి- చచ్చే చెడీ ర్యాంకులూ తెచ్చుకొని- శిక్షణ పూర్తిచేసి- పాసయినా కాదని లేదని మళ్ళీ టెట్ లూ రాసి- దాని కోసం మళ్ళీ కోచింగులకూ వెళ్ళి మార్కులు స్కోరూ చేసి- మళ్ళీ డియ్యస్సీ నోటిఫికేషన్ కోసం చూసి- కోచింగ్ సెంటర్లో చేరి- పరీక్ష రాసి- నెగ్గితే అప్పుడు వుద్యోగం. ఈ వుద్యోగంలో చేరినాక ఆ అలసట తీరేలా రిలాక్స్ అయిపోవడమే. జీవితాంతమూ రిలాక్స్ అయిపోవడమే!
ఉపాధ్యాయ వృత్తి గొప్పది కావచ్చు. కాని వుద్యోగంలో చేరినాక – వుద్యోగంగా గొప్పది అనుకొనేవాళ్ళు తగ్గిపోయారు. అందుకే వుపాధ్యాయ వుద్యోగంలో చేరినవాళ్ళు సబ్జెక్ట్ చేతిలో వుంటుంది.. గ్రిప్ వుంటుంది.. అన్నంతవరకే వుండి, ఆపైన పిల్లలకి చెప్పాల్సిన పాఠాలు గాలికి వదిలి, ‘కాంపిటేటీవ్ కు ప్రేపేరవడం’లో ములిగి, గ్రూప్సో సివిల్సో సాధిస్తామన్న నమ్మకంలో తేలి, తాము అవకాశం లేకనో ఆపద్ధర్మంగానో అందులో వున్నాం తప్పితే, తమ స్థాయి యిది కాదని ప్రెస్టేజ్ ఫీలవడం.. ఆఫీలింగు అందరికీ చూపించడం ద్వారా యెక్కడో వుండాల్సిన వాళ్ళం యిక్కడ యిలా యీసురోమంటూ యేడవాల్సి వొస్తున్నందుకు దేవుణ్ణి నిందించడమో.. పూజలు చెయ్యడమో.. మొక్కులు మొక్కడమో.. యింతే. కాదంటే ఒక టీచర్ మరో టీచర్ని వృత్తి ద్వారా జీవిత భాగస్వామిగా యెంపిక చేసుకొని యెడ్జెస్ట్ చేసుకోవడమో.. అంతే!
ఒక్క జీతం మీద బతకడం కష్టం. నాతం కూడా వుండాలి. నాతం లేదని నాతోటివాళ్ళు నానా బాధా పడిపోతున్నారు. నానా గడ్డీ కరుస్తున్నారు. ఇప్పుడు మన వుపాధ్యాయుల్లో చాలా వరకు రియలెస్టేట్ బ్రోకర్లే.. తప్పితే డైలీ కట్టుబడి వ్యాపారం చేసేవాళ్ళే.. ఈ బ్రోకర్లకి యే సైటు యెక్కడవుందో తెలిసినట్టుగా యే పాఠం యెక్కడవుందో తెలీదు. ఈ ఫైనాన్షియర్లకి వడ్డీ లెక్కలు తప్ప మరే లెక్కలూ రావు. మొత్తానికి యేదో వొక వ్యాపారం.. యేదో వొక వ్యవహారం.. యేదీ లేకపోతే ప్రవేటు కాన్సెప్ట్ కార్పోరేట్ స్కూళ్ళలో కాలేజీల్లో పిల్లల్ని పోటాపోటీగా చేర్పిస్తున్నారు. ఒక విద్యార్థిని చేర్పించినందుకు అయిదు నుండి పది వేలు ఆదాయం. అక్కడున్న విద్యాసంస్థలను బట్టి.. యేరియాని బట్టి.. ఆ ధరలు అటూ యిటూ అవుతాయి.. అంతే. గవర్నమెంటు కాలేజీల్లో పనిచేసిన లెక్చరర్లు అయితే రిజైన్ చేస్తే భద్రత వుండదు గనుక సెలవు పెట్టి ప్రవేటు కాలేజీలలో పనికి కుదిరిపోతున్నారు. ఎన్నడూ లేనిది శ్రద్ధగా నోట్సులు కూడా తయారు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం కంటే ప్రవేటు వాడు యెక్కువ యేమీ యివ్వడు. కాని అసలు కంటే కొసరు మీదే యావ. ఇక్కడ చూస్తే సెలవు పెట్టిన కాలేజీకి కొత్త లెక్చరర్లు రారు. పాఠాలు జరగవు. ఆశించిన ఫలితాలు రావు. కాలేజీలు నడవవు. గవర్నమెంటు ఇన్స్టిట్యూషన్స్ లో చదువులు బాగోవు అని మాట. ఉన్న క్యారక్టర్ని చెరిచేస్తున్నారు. చేరిపేస్తున్నారు. అధికార్లూ అంతే. రేకుల షెడ్లలో వేలకొద్దీ లక్షలకొద్దీ ప్రవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అవి అర్హత లేనివి కావు. ఆదాయ మార్గాలు. అంతే. ఇక, మాటకారితనమూ చనువూ చతురతా వున్నవాళ్ళు యివికాక యల్ఐసి యితరత్రా యిన్సూరెన్సు యేజెంట్లుగా.. అది కూడా పెళ్ళాల పేర్లతో.. తెగ కష్టబడుతున్నారు. చాలా కష్టపడి యీ దశకు వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు.
‘ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ వుద్యోగం యివ్వాలి’ అని సోషల్ నెట్ వర్క్స్ లో పోస్టులు పెడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠాలు చెప్పే మాస్టార్లు తమ పిల్లల్ని మాత్రం తాము పనిచేసే పాఠశాలల్లో చేర్పించరు. తమ పాఠశాల వున్నా చోట కూడా కనీసం వుండరు. ఒకసారి వుద్యోగంలో చేరామా? యిక అంతే. వేసినప్పుడు వేప చెట్టు. తీసినప్పుడు రావి చెట్టు. మన ఈక కూడా యెవడూ తెంపలేడు. అదీ ధీమా. అదీ భీమా. కాదన గలమా? లేదనగలమా?
చదువుని వ్యాపారం చేసిసింది ప్రభుత్వం. నేనో బడ్డీ పెట్టుకుంటా.. నేనో దుకాణం తెరచుకుంటా.. అంటే నాకు డబ్బు కట్టు.. నీవు నీ వ్యాపారం చేసుకో అని సెన్సు లేకుండా లైసెన్సులు యిస్తోంది. నచ్చినంత ఫీజు వసూల్ చేయడమే. ఏటికి యేడూ ఫీజుల నియంత్రణ మీద టీవీల్లో చర్చలు. ఎప్పటిలాగే. ఫీజుల నియంత్రణ పోరాట కమిటీలు యేర్పడ్డాయని అంటే పరిస్థితిని అంచనా వెయ్యొచ్చు. కోర్టులు తాఖీదులు యిస్తాయి. కాని యేమి లాభం? ప్రభుత్వమూ అధికారులూ వెచ్చగా ముడ్డి కింద వేసుకు కూర్చుంటున్నారు. చూస్తే స్కూళ్ళకు గ్రౌండ్స్ కూడా లేవు. కోళ్ళ ఫారంలో కోళ్ళలా పెరుగుతున్నారు పిల్లలు. చాలక యిన్స్టిట్యూషన్స్ మీద సెల్ టవర్లు. అద్దెలు వస్తాయి కదా? అసలు ప్రభుత్వం వుందో చచ్చిందో తెలీడం లేదు!
మాస్టారూ.. నేను మిమ్మల్ని చూసి చెడిపోయాను. అనవసరంగా మాస్టారునయ్యాను. మాస్టారూ.. మా మాస్టారులు యెలా వున్నారో తెలుసా? పాఠం వదిలి యెప్పుడూ యింక్రిమెంట్ల గురించే మాటలు. మీకాలంలో వుపాధ్యాయులు వుద్యమాలు నడిపారు. జనాన్ని నడిపించారు. మీది వొక చరిత్ర. మాది హీన చరిత్ర. దీన చరిత్ర. మాస్టారూ.. మీకు యిక్కడ వొక మాట చెప్పాలి. నిజాయితీగా ప్రభుత్వ పాఠశాల నడిపితే మా వూరి చుట్టూ వున్న మూడు నాలుగు ప్రవేటు స్కూళ్ళు మూతబడ్డాయి. అందుకు బహుమతిగా ప్రవేటు పెద్దల యిన్ఫ్లియన్సుతో నన్ను ట్రాన్స్ ఫర్ చేసారు.
మాస్టారూ.. మీ తరంలో యేమో గాని మా తరంలో మాస్టార్లు అంటే గౌరవం లేదు. సినిమాల్లో కూడా యెప్పటి నుండో బఫూన్లని చేసేసారు. అదేమిటో సినిమాలే కాదు, లోకం కూడా అంతే అనిపిస్తుంది. ‘మాష్టారూ.. పర్లేదు యింకో పెగ్గేసుకోండి’ అంటాడు వొకడు. ‘మాష్టారూ.. పేకేసుకుందాము వస్తారా..?’ అంటాడు మరొకడు. ‘మాస్టారూ.. ఓ ఫైవుంటే సర్దుతారా..?’ అని, ‘మాష్టారూ.. మీరు భలే మెగాస్టారు..!’ అని యెకసెక్కానికి మనమే యెబ్రివేషన్లయిపోయాము. అప్పటికీ ‘మాస్టారు’ మన తెలుగు పదం కాదు, ‘గురువు’ కదా అని సరిపెట్టుకున్నాను. సరిపెట్టుకోనిస్తేగా? ఆ వెంటనే ‘గురువుగారూ.. అగ్గిపెట్టి వుందా?’ అని, ‘గురూ.. గుంట భలేగుంది కదూ..’ అని, ‘గురూ.. నీ పెరసెంటేజీ నువ్వు తీసుకో..’ అని మనకి మర్యాదే మర్యాద. పోనీ కాసేపు ‘పంతులు’ అనుకుందాము అని అనుకోనేలోపే- ‘పంతులూ పంతులూ పావుసేరు మెంతులూ’ పద్యాలున్నూ!
పోనీ ప్రవేటు విద్యాసంస్థల్లో మనకి మర్యాద వుందా అంటే అదీ లేదు. అక్కడ స్టూడెంటు కంటే మనం హీనం. డబ్బులు కట్టేవాడు కస్టమర్. మనం సర్వీసు మాత్రమే యిచ్చే సర్వెంట్స్.. అంతే!
గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః అన్నారు. పిల్లలకు రాత నేర్పించే గురువే వారి తలరాతని కూడా మార్చెయ్యగలడని నమ్మాను. కాని మన గురువుల తలరాత అంతకన్నా ముందే చెరిపేసి కొత్తగా రాస్తే కాని యేదీ రాయడం సాధ్యం కాదని తెలుసుకున్నాను. కానీ రాయడం కన్నా చెరపడం కష్టంనిపిస్తోంది.
యిట్లు
మీ
శిష్య గురువు
No comments:
Post a Comment