Monday 8 August 2016

సాప్టేరు సిత్రాలు



అసలు సాప్టేరే దరిద్రం బాబూ.... పిల్లకాయలు గ్రాడ్య్యేషన్లు, డబల్ గ్రాడ్యేషన్లు ఇంకొందరు ఓవరాక్షన్‌గాళ్ళు డాక్టరీలు చేసి సాప్టేరులో చచ్చుతుంటారు. ఇంతబతుకూ బతికి ఇంటెనక చచ్చడమంటే ఇద్గిదేనని నా అతితీవ్రమైన అభిప్రాయం. ఆర్కుటానులు, కోటానులు, త్రిమితీయ జ్యామితి, త్రికోణమితి లాంటి అడ్డమైన చదువులకాణ్ణుంచి యూజరు లెవలు త్రెడ్లు, సోడాబుడ్ల తయారీ విధివిధానాలు, ఇంటరప్టు టేబుళ్ళు, కంప్యూటరు ఆర్గనైజేషను, మేపా, ఎమ్మైయెస్సు, ఎస్టీయెల్డీ లాంటి శత్రుదేశబాలకభయంకర చదువులన్నీ చదివిన సన్నాసులందరూ చివరాకరికొచ్చి ఎమ్మెస్ ఎక్సెల్ ఫార్ములాలు తప్ప ఇంకేమీ చేయకపోవడం, మహా ఉంటే జావా పోజోలు,  డౌక్లాసులు, సర్వీసుక్లాసులు రాయడం తప్ప ఇంకేమీ చెయ్యకపోవడం ఆఫీసు క్యూబికళ్ళనబడే పెరటిలో చచ్చడమేకదా మరీ!! Well! this is not about that.

అసలు మనం ఈ IT తద్దినంలోకి రాగానే ఒక బాదుడు కార్యక్రమం మొదలెడతారు. ముందుగా 16,483 సంతకాలు చేయించుకుంటారు. మీరు alertగా లేకపోతే ఆ సంతకాల కర్యక్రమంలో మీ ఆస్తి మొత్తం కూడా రాయించేసుకుంటారు. ఇలాగే నాచేతకూడా ఒక కంపెనీవారు నా ఆస్తి రాయించుకున్నారు. ఇది మీరు నమ్మాక, ఆ నమ్మకం నాగార్జున సిమెంటులా పటిష్టపడ్డాకమాత్రమే, చదవడం కొనసాగించమని విన్నపం. ఆ తరువాత ఇంకో దరిద్రపు కార్యక్రం. 'మా కంపెనీ అంతా ఫ్యామిలీ, మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్లు' అని అక్కడున్న కుర్ర్లపిల్లలూ, బట్టతలాయనా నొక్కివక్కాణిస్తారు. మన బజారు బ్రతుకులకు ఒక ఆసరా ఇస్తున్న, వరదబాధితులకు పులిహోరపొట్లాలు పంచుతున్న, సినిమాహాల్లోంచి వస్తూ "హండ్రెడ్ డేస్, టూ హండ్రెడ్ సెంటర్స్" అని అరచి చెబుతున్న వాళ్ళలో కనిపించే పారవశ్యంతో కూడిన ఆనందమూ, ఉన్మాదంతో కూడిన గర్వమూ వాళ్ళలో ఆసమయంలో మనం చూడొచ్చు. ఈ ఫ్యామిలీ-వ్యవహారాల గురించి The White Tigerలో అరవింద్ అడిగ ఓమాత్రంగా ఉతికాడు. అన్నట్లు చైనా యుధ్ధం సమయంలో చైనావాళ్ళు ఇదే టార్చర్ టెక్నిక్‌ని రహస్యాల్ని కక్కించడానికి భారత సైనికులమీద వాడారట. 

మీరు దీన్ని తట్టుకొని లోపలికొచ్చారనుకోండి. వచ్చి ఒక వారమైనా పారిపోలేదనుకోండి, అప్పుడు టార్చర్‌ని ఒక డిగ్రీ పెంచుతారు. "మీకు కొన్ని బాధ్యతలు ఇవ్వబోతున్నాం" అని చెబుతారు మనకా టైంలో వాడు "బాధ్యతలు" అన్నాడో, "బహుమతులు" అన్నాడో అర్ధమైఛావదు. ఇక అఖ్ఖడినుంచి మనకు రోజుకొక "బాధ్యత" అప్పజెప్పి, అదేదో ఆడికారు తాళాలప్పజెప్పినట్లు మననుంచి Thanks ఆశిస్తారు. ఈ సమయంలో మ్యానేజరు అనబడే శత్రుదేశపు జనరల్ అదేదో ప్రెసిడెన్షియల్ మెడల్ మన ఛాతీపై గుచ్చుతున్నట్లు నవ్వుతాడు. ఇహ ఆతరువాత మామూలే... "క్లైంటు అనేవాడు దేవుడు, వాడిసేవ మోక్షమార్గము", "క్లైంటుని అర్చించు కరములుకరములు"  టైపులో డైలాగులేసి మనల్ని తోమేస్తారు. మీకు ఒకే ప్రొడక్టుండి, ఇద్దరుముగ్గురు క్లైంట్లుంటే అప్పుడుంటుంది నా సామిరంగా! ఇంటిపోరు, ముండపోరు ఒకేసారి మొదలైనంత ఆనందంగా... పదిలక్షలుపోసి కొన్నకారుకి లక్కీడిప్లో మెహర్రమేష్ సినిమాకి మార్నింగ్ షో టికెట్టుతగిలినంత సంబరంగా... ఆక్సిడెంటయిన తరువాత, ఇన్ష్యూరెన్సు lapse అయ్యిచచ్చి దశాబ్దమయ్యిందని తెలిసినంత అద్భుతంగా... ఒక క్లైంటుగాడిద 'ఈ ఫీచరిలా ఉండాలి' అంటాడు. ఇంకొక గాడిద 'అలా ఉండాలి అంటాడు'. వీటిని రెండు ఫీచర్లుగా పరిగణించి feature-based-enablement చేద్దామండీ అంటే అర్ధదశాబ్దం క్రింద ప్రోగ్రామింగొదిలేసిన, తననుతాను architect మయబ్రహ్మలాగా భావించుకొనే మొగుడుగారు 'అదేం కుదర'దంటారు. ఇప్పుడుకాకపోతే if-else ఇంకెప్పుడు వాడుకుంటాం చెప్పండి? మనం ప్రోగ్రాం తిన్నగా ఇలా రాసుకుంటాం.
if (client.getId() == 1) {
display-this;
} else {
display-that;
}
కొన్నాళ్ళకి అదికూడా సరిపోదని తెలుసుకున్నాక, సరికాదని తెలిసినా if-elseif-elseif-elseకో, కొద్దిపాటి తెలివితేటలున్నోళ్ళు switch-caseకో దిగుతారు. బుద్ధిజ్ఞానం ఉన్న ఉన్నతశ్రేణి జీవులు ఈ పాటికే బిచాణా ఎత్తేసుంటారు.

ఇదిలా ఉంటే ఇహ సేల్సు జనాలుంటారు. వీళ్ళుపోయి క్లైంటుకి Axeవాడు కుర్రాళ్ళకి చూపిచ్చినట్లు, టీవీల్లో తాయెత్తులమ్ముకొవాడు మన తింగరోళ్ళకి చూయించునట్లు క్లంట్ల చెవ్వుల్లో పొగాకు పువ్వులు పూయించొస్తారు. "మీరు ఆప్‌లోకి లాగినవ్వగానే కంప్యూటరు షకీరాలా గెంతడం మొదలెడుతుంది" అని చెబుతారు. అలా కంప్యూటర్ని గెంతించే పనిలో డెవలపర్లకు దుంపతెగుతుందన్న విషయం వీళ్లకు పట్టదు. వీళ్ళకదనవసరం కూడా. వీళ్ళకుండే ఒకే ఒక్క పనేంటంటే రోడ్డుమీద పోయే ప్రతిటోపీవాలాని అవసరమైతే కిడ్నాపు చేసిమరీ క్లైంటుగా పట్టుకురావడమే. వీళ్ళు... మరియ క్లైంటు గొంతెమ్మకోరికలు product road-map పొసగవని తెలిసినా గంగిరెద్దుగంగిరెద్దులా తలూపే మొగుళ్ళు ఉన్న ప్రాజెక్టులని గ్రక్కున విడువంగ వలయుగదరా సుమతీ అని శతకకారుడు ఎప్పుడో అన్నాడు.

ఇదిలా ఉంటే కొలీగులుంటారు. కొందరికి సబ్జెక్టుంటది. వీళ్ళు కొంచెం పొగరుగా మాట్లాడినాకూడా అది ముద్దుగానే ఉంటుంది. వాడేం మాట్లాడుతున్నాడో వాడికి తెలిసినప్పుడు, ఏం చెయ్యాలో వాడికి తెలిసినప్పుడు, ఎలా చెయ్యాలో వాడికి చేతనైనప్పుడు ఇహ మనకు సమస్యే ఉండఖ్ఖర్లేదు. ఇంకొందరుంటారు. పొట్టపొడిస్తే parenthesis కనబడదు. అందుకోసమని extra-nice వేషాలేస్తుంటారు. ఇది పూర్తిగా నాకుడు భాచి. ఆఫీసుకు బయల్దేరేముందు ఇంట్లో అద్దమ్ముందు నుంచొని ఓమారు "నానాటి బ్రతుకూ నాకటము... సైనిన్ను నిజము... సైనౌటు నిజము... నట్టనడి నీపని నాకటమూ..." అని పాడుకొనొచ్చే బ్యాచిది. ఇలాంటి duffers ఎలా వస్తారో అస్సలర్ధం కాదు. ఇందులో కొందరి ఇంగ్లీషు KFC రెస్టారెంట్లలో కౌంటర్లలో పనిచేసే పిల్లకాయలకంటే దరిద్రం. ఈ సారి KFC పిల్లగాళ్ళని అడగండి వాళ్ళ క్వాలిఫికేషనేమిటోనని. "ఇంటర్మీడియట్" అనో ఇంకేదనో చెబుతారుగానీ MCA/B.Tech/M.Tech అని మాత్రం చెప్పరు.

ఇదిలా ఉండనీండి. ఒక శుభ ముహుర్తాన మీరు వేసారిపోయి, కంపెనీకి విడాకులిద్దామని నిర్ణయించుకుంటారు.  రెండోపేరాలో కనబడ్డాడే ఒక బట్టతలాయన సరిగ్గా ఇప్పుడు మీకు కనబడతాడు.  ఆయన మిమ్మల్ని అవసరమైతే ఇంటిక్కూడా పిలిచి కొంచెం సేపు మృదు మధురంగానూ, తరువాత కంపెనీగొప్ప గురించి ఇంద్రసేనారెడ్డి గురించి తనికెళ్ళ భరణి క్యారెక్టరు మాట్లాడినంత ఆవేశంగానూ మాట్లాడుతాడు.  మన కంపెనీవల్లే భూమ్మీద ఇంకా వర్షాలు పడుతున్నాయనీ, ధర్మం ఎన్నోకొన్ని పాదాలమీద నడుస్తుందనీ చెబుతాడు. మొగుడుగారు పైకి నికృష్టుడులా అనిపించినా ఆయనది స్వాతిముత్యంలో కమల్ హాసన్ క్యారక్టరని నమ్మబలుకుతాడు. అవసరమైతే మీకోసం ఆయన రెండు కిడ్నీలూ + లివరూ ఇవ్వడానికి సిధ్ధమన్న విషయన్నికూడా మీరు నమ్మేలా చెబుతాడు. నమ్మారో అంతే సంగతులు. "ఓకే" అన్న మాట మీనుండి వెలువడగానే ఈ భేతాళుడు ఇంటితో సహా మాయమౌతాడు.  పునర్దర్శనం మరోసారి మీరు విడాకుల పత్రం పంపించినప్పుడే.  మీలో ఇంకా sense of humor  మిగిలుంటే మీరు ఈ బట్టతలాయనకి మీకు తెలిసిన ఒక కంపెనీలో ఆయనకోసం 50% హైకుతో కూడిన ఆఫరొకటుందని చెప్పండి. ఈయన పూర్తిగా different trackలో వెళ్ళకపోతే అప్పుడు చూడండి.

No comments:

Post a Comment