Monday 8 August 2016

బైట్‌కోడ్ సంగమం (sagara sangamam s/w version)

అతన్ని అంత కోపంగా చూడ్డం అదే మొదటిసారి నేను. అతనో కోడ్ రివ్యూయర్. ముందురోజు ఎవరిదో కోడ్ review చేస్తూ తప్పులుబట్టాడట. మ్యానేజరుడు పిలిచి ఒక ఆవృతం వృత్తం వేసుకున్నాడు (ఒక్ రౌండేసుకున్నాడు అన్నది దుష్టవ్యవహారికం). "చిన్నలాజిక్‌ని ప్రోగ్రాంలో పెట్టలేని ఆపిల్లేం ప్రోగ్రామర్?" అని అతని ప్రశ్న. "ఆపిల్లననేంత పుడింగివా? You are fucking fired!!" అని ఇటువైపు మ్యానేజరువాదన. రెండువైపులా electronic goలు (short form is Ego). అతనికి మండుకొచ్చి "ఏదీ prime number logicరాయ్ చూద్దాం" అన్నాడు. ఆపిల్ల ఇలా రాసింది : 
private boolean isPrime(int num) {
 if ( num % 2 = 0 OR num % 3  === 0 OR num % 5 = 0 OR num % 7 = 0 OR num % 11 == 0 OR num % 13 ==== 0) {
  return false;
}
return true;
}
మనవాడి ఆవేశం బుట్టలు తెచ్చుకొంది కాదుకాదు చుట్టలు తెచ్చుకుంది ఇదికూడా కాదు కట్టలు తెంచుకుంది.

మనవాడు : ఇది ప్రోగ్రామింగా?
ఆ పిల్ల : ఏం? కాదా?
మ.వా. : ఏ language?".
ఈసారి మండిపడటం పిల్లవంతైంది.
ఆ. పి. : "Idiot!! ఎన్ని లాంగ్వేజీలున్నాయోకూడా తెలుసానీకూ! దీన్ని.. . జావా అంటారు".

ఇహ మనవాడు ఆపిల్లని కుర్చీలోంచి పక్కకి లాగేసి, కీబోర్డుచ్చుకున్నాడు. నేను చెప్పలేనుసామీ... నన్నొదిలెయ్యండి. qwerty కీబోర్దుమీద పియానోవాయించొచ్చు అని అంతకుముందు నాకెవడైనా చెప్పుంటే చెప్పిచ్చుకొనేవాణ్ణి. మనవాడు రాసిన ప్రోగ్రాం ఇలా ఉంది.
private boolean isPrime(int num) {
for (int i = 0; i < Math.sqrt(num); i++) {
 if (num % i == 0)
  return false;
}
return true;
}

రాయడం పూర్తిచేశాక ఆపిల్లొంక కొరకొరా చూస్తూ సాయికుమార్ మాడ్యులేషన్లో అన్నాడు "జావా అంటే ఇది"

ఆపిల్లలా ఆశ్చర్యపోతుండగానే మళ్ళీ మనవాడు పియానోవాయించడం షురూ చేశాడు.

def isPrime(num)
 (1..Math.sqrt(num)).each do |factor|
   if num % factor == 0
     return False
   end
 end
return True
end

ఈసారి ఆశ్చర్యపోవడం మ్యానేజర్ వంతయ్యింది.  "దిసీజ్ రూబీ" ఖంగునమోగింది మనవాడి కంఠం.

def is_prime(num):
  for i in range(Math.sqrt(num):
    if num % i == 0:
      return False 
  return True

"పైధాన్" ఆపిల్ల చెప్పింది ఖంగారుగా.

తన ల్యాపీ మరియు తన సామాను తన డెస్కు నుంచి మూటగట్టి చెచ్చుకున్నాక మనవాడు తిరిగి మాట్లాడడం మొదలెట్టాడు.

"యధో రిక్వైర్మెంట్, తధో లాజిక్
యధోలాజిక్, తధో లాంగ్వేజ్
యధో లాంగ్వేజ్, తధో ప్రోగ్రాం
యధో ప్రోగ్రామో... తధో ప్రోగ్రామర్.

రిక్వైర్మెంటు, లాజిక్కు, లాంగ్వేజు చేసే ప్రోగ్రాంలోకి నిమగ్నం చెయ్యాలి. అప్పుడే రిలీజు (దాన్నే రససిధ్ధి అంటారని నాకు ఆతరువాత తెలిసింది) జరుగుతుంది. నీ దృష్టి న్యూస్ పేపర్లమీద, మధ్యాహ్నం తినబోయే లంచిమీద. కోడ్ వారియర్!!?"

 ఆపై మనవాడు తన తట్టాబట్టా.. కాదుకాదు బట్టాపట్టా.. ఇదికూడా కాదు.. తట్టాబుట్టా సర్దుకుని పోబోతూ.. అర్ధాంతరంగా ఆగి మ్యానేజరువైపు నడిచాడు. మ్యానేజరునుద్దేశ్యించి ఇలా అన్నాడు "ఏమన్నావ్!! ఇయాం ఫక్కింగ్ ఫయర్డా? అయాం రిజైనింగ్". అది ఆ మ్యానేజరునికి చెంపదెబ్బలా తగిలింది. సరిగ్గా అతను గేటువద్దకొస్తున్నప్పుడే.. ఈ సంఘటన మొత్తానికీ మౌనసాక్షినైన నేను "నమస్తే సార్!" అని అతనికి అభివాదంచేస్తూ నన్నునేను గౌరవించుకున్నాను.

సాప్టేరు సిత్రాలు



అసలు సాప్టేరే దరిద్రం బాబూ.... పిల్లకాయలు గ్రాడ్య్యేషన్లు, డబల్ గ్రాడ్యేషన్లు ఇంకొందరు ఓవరాక్షన్‌గాళ్ళు డాక్టరీలు చేసి సాప్టేరులో చచ్చుతుంటారు. ఇంతబతుకూ బతికి ఇంటెనక చచ్చడమంటే ఇద్గిదేనని నా అతితీవ్రమైన అభిప్రాయం. ఆర్కుటానులు, కోటానులు, త్రిమితీయ జ్యామితి, త్రికోణమితి లాంటి అడ్డమైన చదువులకాణ్ణుంచి యూజరు లెవలు త్రెడ్లు, సోడాబుడ్ల తయారీ విధివిధానాలు, ఇంటరప్టు టేబుళ్ళు, కంప్యూటరు ఆర్గనైజేషను, మేపా, ఎమ్మైయెస్సు, ఎస్టీయెల్డీ లాంటి శత్రుదేశబాలకభయంకర చదువులన్నీ చదివిన సన్నాసులందరూ చివరాకరికొచ్చి ఎమ్మెస్ ఎక్సెల్ ఫార్ములాలు తప్ప ఇంకేమీ చేయకపోవడం, మహా ఉంటే జావా పోజోలు,  డౌక్లాసులు, సర్వీసుక్లాసులు రాయడం తప్ప ఇంకేమీ చెయ్యకపోవడం ఆఫీసు క్యూబికళ్ళనబడే పెరటిలో చచ్చడమేకదా మరీ!! Well! this is not about that.

అసలు మనం ఈ IT తద్దినంలోకి రాగానే ఒక బాదుడు కార్యక్రమం మొదలెడతారు. ముందుగా 16,483 సంతకాలు చేయించుకుంటారు. మీరు alertగా లేకపోతే ఆ సంతకాల కర్యక్రమంలో మీ ఆస్తి మొత్తం కూడా రాయించేసుకుంటారు. ఇలాగే నాచేతకూడా ఒక కంపెనీవారు నా ఆస్తి రాయించుకున్నారు. ఇది మీరు నమ్మాక, ఆ నమ్మకం నాగార్జున సిమెంటులా పటిష్టపడ్డాకమాత్రమే, చదవడం కొనసాగించమని విన్నపం. ఆ తరువాత ఇంకో దరిద్రపు కార్యక్రం. 'మా కంపెనీ అంతా ఫ్యామిలీ, మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్లు' అని అక్కడున్న కుర్ర్లపిల్లలూ, బట్టతలాయనా నొక్కివక్కాణిస్తారు. మన బజారు బ్రతుకులకు ఒక ఆసరా ఇస్తున్న, వరదబాధితులకు పులిహోరపొట్లాలు పంచుతున్న, సినిమాహాల్లోంచి వస్తూ "హండ్రెడ్ డేస్, టూ హండ్రెడ్ సెంటర్స్" అని అరచి చెబుతున్న వాళ్ళలో కనిపించే పారవశ్యంతో కూడిన ఆనందమూ, ఉన్మాదంతో కూడిన గర్వమూ వాళ్ళలో ఆసమయంలో మనం చూడొచ్చు. ఈ ఫ్యామిలీ-వ్యవహారాల గురించి The White Tigerలో అరవింద్ అడిగ ఓమాత్రంగా ఉతికాడు. అన్నట్లు చైనా యుధ్ధం సమయంలో చైనావాళ్ళు ఇదే టార్చర్ టెక్నిక్‌ని రహస్యాల్ని కక్కించడానికి భారత సైనికులమీద వాడారట. 

మీరు దీన్ని తట్టుకొని లోపలికొచ్చారనుకోండి. వచ్చి ఒక వారమైనా పారిపోలేదనుకోండి, అప్పుడు టార్చర్‌ని ఒక డిగ్రీ పెంచుతారు. "మీకు కొన్ని బాధ్యతలు ఇవ్వబోతున్నాం" అని చెబుతారు మనకా టైంలో వాడు "బాధ్యతలు" అన్నాడో, "బహుమతులు" అన్నాడో అర్ధమైఛావదు. ఇక అఖ్ఖడినుంచి మనకు రోజుకొక "బాధ్యత" అప్పజెప్పి, అదేదో ఆడికారు తాళాలప్పజెప్పినట్లు మననుంచి Thanks ఆశిస్తారు. ఈ సమయంలో మ్యానేజరు అనబడే శత్రుదేశపు జనరల్ అదేదో ప్రెసిడెన్షియల్ మెడల్ మన ఛాతీపై గుచ్చుతున్నట్లు నవ్వుతాడు. ఇహ ఆతరువాత మామూలే... "క్లైంటు అనేవాడు దేవుడు, వాడిసేవ మోక్షమార్గము", "క్లైంటుని అర్చించు కరములుకరములు"  టైపులో డైలాగులేసి మనల్ని తోమేస్తారు. మీకు ఒకే ప్రొడక్టుండి, ఇద్దరుముగ్గురు క్లైంట్లుంటే అప్పుడుంటుంది నా సామిరంగా! ఇంటిపోరు, ముండపోరు ఒకేసారి మొదలైనంత ఆనందంగా... పదిలక్షలుపోసి కొన్నకారుకి లక్కీడిప్లో మెహర్రమేష్ సినిమాకి మార్నింగ్ షో టికెట్టుతగిలినంత సంబరంగా... ఆక్సిడెంటయిన తరువాత, ఇన్ష్యూరెన్సు lapse అయ్యిచచ్చి దశాబ్దమయ్యిందని తెలిసినంత అద్భుతంగా... ఒక క్లైంటుగాడిద 'ఈ ఫీచరిలా ఉండాలి' అంటాడు. ఇంకొక గాడిద 'అలా ఉండాలి అంటాడు'. వీటిని రెండు ఫీచర్లుగా పరిగణించి feature-based-enablement చేద్దామండీ అంటే అర్ధదశాబ్దం క్రింద ప్రోగ్రామింగొదిలేసిన, తననుతాను architect మయబ్రహ్మలాగా భావించుకొనే మొగుడుగారు 'అదేం కుదర'దంటారు. ఇప్పుడుకాకపోతే if-else ఇంకెప్పుడు వాడుకుంటాం చెప్పండి? మనం ప్రోగ్రాం తిన్నగా ఇలా రాసుకుంటాం.
if (client.getId() == 1) {
display-this;
} else {
display-that;
}
కొన్నాళ్ళకి అదికూడా సరిపోదని తెలుసుకున్నాక, సరికాదని తెలిసినా if-elseif-elseif-elseకో, కొద్దిపాటి తెలివితేటలున్నోళ్ళు switch-caseకో దిగుతారు. బుద్ధిజ్ఞానం ఉన్న ఉన్నతశ్రేణి జీవులు ఈ పాటికే బిచాణా ఎత్తేసుంటారు.

ఇదిలా ఉంటే ఇహ సేల్సు జనాలుంటారు. వీళ్ళుపోయి క్లైంటుకి Axeవాడు కుర్రాళ్ళకి చూపిచ్చినట్లు, టీవీల్లో తాయెత్తులమ్ముకొవాడు మన తింగరోళ్ళకి చూయించునట్లు క్లంట్ల చెవ్వుల్లో పొగాకు పువ్వులు పూయించొస్తారు. "మీరు ఆప్‌లోకి లాగినవ్వగానే కంప్యూటరు షకీరాలా గెంతడం మొదలెడుతుంది" అని చెబుతారు. అలా కంప్యూటర్ని గెంతించే పనిలో డెవలపర్లకు దుంపతెగుతుందన్న విషయం వీళ్లకు పట్టదు. వీళ్ళకదనవసరం కూడా. వీళ్ళకుండే ఒకే ఒక్క పనేంటంటే రోడ్డుమీద పోయే ప్రతిటోపీవాలాని అవసరమైతే కిడ్నాపు చేసిమరీ క్లైంటుగా పట్టుకురావడమే. వీళ్ళు... మరియ క్లైంటు గొంతెమ్మకోరికలు product road-map పొసగవని తెలిసినా గంగిరెద్దుగంగిరెద్దులా తలూపే మొగుళ్ళు ఉన్న ప్రాజెక్టులని గ్రక్కున విడువంగ వలయుగదరా సుమతీ అని శతకకారుడు ఎప్పుడో అన్నాడు.

ఇదిలా ఉంటే కొలీగులుంటారు. కొందరికి సబ్జెక్టుంటది. వీళ్ళు కొంచెం పొగరుగా మాట్లాడినాకూడా అది ముద్దుగానే ఉంటుంది. వాడేం మాట్లాడుతున్నాడో వాడికి తెలిసినప్పుడు, ఏం చెయ్యాలో వాడికి తెలిసినప్పుడు, ఎలా చెయ్యాలో వాడికి చేతనైనప్పుడు ఇహ మనకు సమస్యే ఉండఖ్ఖర్లేదు. ఇంకొందరుంటారు. పొట్టపొడిస్తే parenthesis కనబడదు. అందుకోసమని extra-nice వేషాలేస్తుంటారు. ఇది పూర్తిగా నాకుడు భాచి. ఆఫీసుకు బయల్దేరేముందు ఇంట్లో అద్దమ్ముందు నుంచొని ఓమారు "నానాటి బ్రతుకూ నాకటము... సైనిన్ను నిజము... సైనౌటు నిజము... నట్టనడి నీపని నాకటమూ..." అని పాడుకొనొచ్చే బ్యాచిది. ఇలాంటి duffers ఎలా వస్తారో అస్సలర్ధం కాదు. ఇందులో కొందరి ఇంగ్లీషు KFC రెస్టారెంట్లలో కౌంటర్లలో పనిచేసే పిల్లకాయలకంటే దరిద్రం. ఈ సారి KFC పిల్లగాళ్ళని అడగండి వాళ్ళ క్వాలిఫికేషనేమిటోనని. "ఇంటర్మీడియట్" అనో ఇంకేదనో చెబుతారుగానీ MCA/B.Tech/M.Tech అని మాత్రం చెప్పరు.

ఇదిలా ఉండనీండి. ఒక శుభ ముహుర్తాన మీరు వేసారిపోయి, కంపెనీకి విడాకులిద్దామని నిర్ణయించుకుంటారు.  రెండోపేరాలో కనబడ్డాడే ఒక బట్టతలాయన సరిగ్గా ఇప్పుడు మీకు కనబడతాడు.  ఆయన మిమ్మల్ని అవసరమైతే ఇంటిక్కూడా పిలిచి కొంచెం సేపు మృదు మధురంగానూ, తరువాత కంపెనీగొప్ప గురించి ఇంద్రసేనారెడ్డి గురించి తనికెళ్ళ భరణి క్యారెక్టరు మాట్లాడినంత ఆవేశంగానూ మాట్లాడుతాడు.  మన కంపెనీవల్లే భూమ్మీద ఇంకా వర్షాలు పడుతున్నాయనీ, ధర్మం ఎన్నోకొన్ని పాదాలమీద నడుస్తుందనీ చెబుతాడు. మొగుడుగారు పైకి నికృష్టుడులా అనిపించినా ఆయనది స్వాతిముత్యంలో కమల్ హాసన్ క్యారక్టరని నమ్మబలుకుతాడు. అవసరమైతే మీకోసం ఆయన రెండు కిడ్నీలూ + లివరూ ఇవ్వడానికి సిధ్ధమన్న విషయన్నికూడా మీరు నమ్మేలా చెబుతాడు. నమ్మారో అంతే సంగతులు. "ఓకే" అన్న మాట మీనుండి వెలువడగానే ఈ భేతాళుడు ఇంటితో సహా మాయమౌతాడు.  పునర్దర్శనం మరోసారి మీరు విడాకుల పత్రం పంపించినప్పుడే.  మీలో ఇంకా sense of humor  మిగిలుంటే మీరు ఈ బట్టతలాయనకి మీకు తెలిసిన ఒక కంపెనీలో ఆయనకోసం 50% హైకుతో కూడిన ఆఫరొకటుందని చెప్పండి. ఈయన పూర్తిగా different trackలో వెళ్ళకపోతే అప్పుడు చూడండి.

Monday 1 August 2016

జర సోచో

మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికా?
పొద్దస్తమానం శత్రువుల్లా పోట్లాడుకోవడానికా?
ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో
ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో
ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో
ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడని అవకాశం ఉంటుందో
ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే మేధస్సు ఉంటుందో
ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలన్న పంతం నశించి ఉంటుందో
ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో
ఎక్కడైతే ... మాట,పట్టింపులకు ప్రధాన్యత ఉండదో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి.

అమ్మ కడుపు చల్లగా..

శనివారం –  ఒకపూట భోజనమే కాబట్టిపెద్ద వంట పనేమీ లేదులేఆయనొక్కడికీ  ఇంత,  –చారెడు పెసరప్పేసి ఒక టొమోటా పడేస్తారెండు బంగాళ దుంపలు వేయించి జీలకర్ర కారం జల్లివిస్తట్లో వడ్డించానంటే,  పిచ్చి మా రాజు  సంతొషం గా తిని లేస్తాడుఅక్కడితో అయిపోతుంది.
తనకా? ఆ, తనదేం లెక్కనీ? ఏం తింటే సరిపోదనీ? తనకేమైనా స్పెషల్స్ కావాలా ఏవిటీ?
అయినా! కొత్తగా తిరగమూతేసిన మాగాయి వుందిగా! ఇంకానేమో , గోంగూర – పళ్లమిరపకాయలేసి నూరిన పచ్చడుంది, సున్ని పొడుంది. నిన్నటి పెరుగుంది, ఇవాళ్టిదీ వుంది అబ్బో! చాలు చాలు. ఇంకెందుకూ, కూరలు నారలు?
ఇక రాత్రికంటావా, మిగిలిన ఇడ్లీ పిండి –  నాలుగు ప్లేట్లొస్తాయి. అంటే పదహారు ఇడ్లీలు. పది ఆయనకి, ఆరు నాకు అక్కడితో చెల్లు.   గుల్ల శనగపప్పు,  పచ్చి కొబ్బరి చిప్ప వేసి పచ్చడి నూరుతా.  చక్కరకేళీలున్నాయి గా! తలా ఒకటి నోట్లో వేసుకుని పడుకుంటే తెల్లారుతుంది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు.  ఇహ ఇవాళ్టికి  పెద్ద వంట హడావిడేం లేనట్టేలే..’ అనుకుంటూ జానకి –  పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది.
దీపం వెలిగిస్తూ – ఒకసారి, అష్టోత్తరం  చదువుతూ –  మరోసారి, పాలు, బెల్లం ముక్క నైవేద్యం పెడుతూ ఇంకొక సారి – ఇలా – పూజలో ప్రతి ఘట్టంలోనూ..  ఆ రోజు  చేయఖర్లేని వంట గురించే ఆలోచించింది.
‘యానికానిచ పాపానిచ ..’ కళ్ళు మూసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి..నాలుగు అక్షింతలు తల మీద జల్లుకుని, ‘నాయనా, ఏడుకొండలవాడా! ఎక్కడ్లేని ఆలోచన్లు నీకు పూజ చేసేటప్పుడే వస్తాయెందుకు తండ్రీ?.. క్షమించు క్షమించు..’ అంటూ చెంపలేసుకుంది. ఆ పైన  సాష్టాంగ నమస్కారం చేసుకుని, పూజ గదిలోంచి బయటకొచ్చింది.
మరో సారి ఫిల్టర్ కాఫీ తగిలిద్దామా?, లేక ఆయనొచ్చేదాకా అగుదామా? అని  సందేహపడుతుండగా..అప్పుడు..అప్పుడు వినిపించింది  “అమ్మా” అనే పిలుపు. ఎంత ప్రియమైన స్వరం. ప్రాణాలు కదిలినట్టౌతుంది, ఆ పిలుపెప్పుడు విన్నా ఆమెకి.
ఆ రెండక్షరాలలోనే కదా మరి సృష్టి జనియించబడింది. అందుకే అంత పరవశమేమో మాతృమూర్తికి.
ఆ గొంతు వినీవింటమే –   ఒక్క అంగలో చెంగున వరండాలోకి వచ్చింది.
కొడుకు – వంశీ!  లోపలకొస్తూ కనిపించాడు. “మా నానే, వచ్చావురా కన్నా?!..” అంటూ ఆనందంగా  ఎదురెళ్ళి,  అతన్ని  చేతుల్తో చుట్టేసుకుంది.
చేతిలో బాగ్ కిందపెట్టి, తల్లి బుజాలు చుట్టూ చేతులేస్తూ  ‘ఎలా వున్నావమ్మా? ఆరోగ్యం బావుందా?” అడిగాడు.
“బాగున్నాం రా ! మాకేం? బ్రహ్మాండంగా వున్నాం.”  అంటూ ఏదో గుర్తుకొచ్చినదాన్లా, రెండడుగులు వెనక్కేసి – “ఎప్పుడొచ్చావు, వూళ్ళొకి?” అడిగింది.
“వారమైంది విజయవాడకొచ్చి. పనైపోంగానే ఇటే వస్తున్నా. అమ్మా, ఆకలేస్తోందే..” – పొట్ట మీద అర చేత్తో రాసుకుంటూ గారాలు పోయాడు.
ముఫైఐదేళ్ళ కొడుకు ఆ క్షణం లో ఆ తల్లి కంటికి మూడేళ్ళ వాడిలా కనిపించాడు. దేవుడికి  – మనం కూడా అలానే కనిపిస్తుంటాంట. అమ్మ దేవుని ప్రతినిధి కదా!
ఎంత పెద్దవాడైనా, ‘అమ్మా ఆకలి ‘ అని అడిగే బిడ్డ –  తల్లి కళ్ళకెప్పుడూ పసివాడుగానే కనిపిస్తాడు.
‘అయ్యొ, అయ్యో, నా మతి  మండిపోను.  రా.. రా! ముఖం  కడుక్కుని రా!  చేసిన ఉప్మా  వుంది.  తిని, కాఫీ తాగుదువు గానీ..” అంటూనే, ఒక్క గెంతులో వంటింట్లోకి పరుగు తీసింది.
పెరట్లో బావి దగ్గర బట్టలుతికే నల్ల రాయి మీద కుర్చుని, అమ్మ పెంపుడు బిడ్డైన పెరటి తోటని ఆనందంగా చూస్తూ.. బ్రష్ చేసుకుని వచ్చాడు.
వంటింటి గుమ్మా నికెదురుగా  కుర్చీ పీటేసుకుని కుర్చున్నాడు.  ఎదురుగా – తులసి కోట లో గుచ్చిన    అగరు ధూపం గాల్లోకి మెలిక తిరిగి,  గాల్లో  మాయమౌతూ  చక్కటి పరిమళాల్ని విరజిమ్మి పోతోంది.  మందారాలు తురుముకున్న తులసమ్మ అచ్చు అమ్మంత పవిత్రం గా కనిపిస్తోంది.
” ఇదిగో ముందు  ఉప్మా తిను.”  అంటూ ప్లేట్ చేతికిచ్చింది. వెండి పళ్ళెం లో బొంబాయి రవ్వ ఉప్మా!  దోరగా వేగిన జీడిపప్పులతో, కర్వేపాకు ఘుమాయింపుతో  తెగ నోరూరించేస్తోంది.  కొత్తావకాయ గుజ్జు, దాన్లోంచి ఊరిన వెల్లుల్లి రెబ్బ, వూటా, నూనె కలిసిన చిక్కటి ద్రవం  గుజ్జులోకి కలిపి, చెంచాలోని ఉప్మాకి పట్టించి, నాలుగు నిముషాల్లో  మొత్తం ఉప్మా అంతా  లాగించేసాడు.
తింటున్నంత సేపూ ఎప్పుడూ ఏదో ఒకటి వాగే కొడుకు – కళ్ళు దించుకుని అదే పనిగా ఉప్మా తింటుంటె..చూస్తున్న ఆ తల్లి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి.
‘పిచ్చి వాడు. ఎంత ఆకలి మీదున్నాడు! ఎప్పుడనగా తిన్నాడొ, ఏమిటో! ఈ కాంపుల ఉద్యోగం కాదు కానీ, వాడికి సరైన తిండీ నిద్రా రెండూ కరువైపోయాయి.
‘ ఆ సిటీ వొద్దు, ఆ వుద్యోగమూ వొద్దు.  వచ్చి హాయిగా  మాతో బాటు  వుండరాదురా? ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకు బ్రతుకుదువుగానీ’ అని చెప్పి చూసింది.
ఒక నవ్వు నవ్వి మిన్నకుండిపోతాడు తప్ప, జవాబు చెప్పడు. అయినా కోడలికి ఇష్టముండదని కూడా తెలుసు కానీ, పైకి అనదు. అది ఆమె సంస్కారం.
కళ్ళొత్తుకుంటున్న తల్లిని క్రీగంట గమనిస్తూనే వున్నాడతను.
మనకోసం అలా కంట తడిపెట్టే వాళ్ళు వుంటం చాలా అదృష్టం. కానీ ఆమె అలా కన్నీటిలోనే ఆనందిస్తుందని తెలిసి, చేరువగా నిలవడం ఇక్కడి విచిత్రం.
ఎంత బావుంది. ఉత్తి ఉప్మా.  మెత్తగా, వెన్న విచ్చుకున్నట్టు,  అప్పుడే కాచిన నేతి సువాసనతో, తింటుంటే జీడిపపప్పులు పంటికింద కమ్మటి రుచిని పెంచుతూ..నంజుకున్న ఆవకాయ కారం కారంగా పుల్ల పుల్ల గా..జిమ్హ్వ లూరుతూ రుచినిఊరిస్తూ..గుటక గుటకకీ మధ్య కొత్త రుచులు రేపుతూ..
అబ్బ ఏం కాంబినేషన్లే!
నీరజ కూడా ఉప్మా చేస్తుంది. కానీ, వేగని ఆవాలు ఎసట్లో ఉబ్బి, పచ్చిమిరప కాయ వేగకపోవడం వల్ల నాలిక మీద ఒకసారి అలా మండి,  కర్వేపాకు పచ్చి వాసన తేలి,  జీడిపప్పు మెత్తబడిపోయి,  నీళ్లతో రవ్వ – అనుపానం కాకపోవడం వల్ల .. ఉప్మా  ఉండలు కట్టి తింటున్నప్పుడు చెంచా తో అన్నీ తీసి పక్కన పెట్టె వ్యర్ధ పదార్ధాలౌతాయి. అందులో ఉప్మా రుచి తెలిసిన మనసు వెంటనే బుస్సుమంటుంది. -‘ఛ. నీకు ఉప్మా చేయడం కూడా రాకపోతే ఎలా? మా అమ్మ దగ్గర నేర్చుకోరాదూ?’ అని మందలించబోతే, వెంటనే రిటార్ట్. – “ఓహో, ఐతే మీ అమ్మదగ్గరే  వెళ్ళి వుండొచ్చు గా! ఎంచక్కా రోజూ ఉప్మా తినొచ్చు. అమ్మ చేసిన ఉప్మా..” మూతి తో బాటు కనుబొమలు విరుస్తూ ముఖమంతా మొటమొట లాడించుకుంటున్న నీరజ రూపం చటుక్కున కళ్ళ ముందు మెదిలింది.
నిట్టూర్చాడు.
ఇంతలో – సురలకు కూడా దక్కని అమృతపు సువాసన  ముక్కుకి తగలడంతో ఈ లోకంలోకొచ్చి పడ్డాడు.
–   ఫిల్టర్  ఫిల్టర్ పై కప్పులో వేసిన కాఫీ పొడి మీద ప్రెస్సింగ్ డిస్క్ వుంచి, పై నించి మరగ కాగిన నీళ్ళు    దిమ్మరిస్తున్నప్పుడు..అది బుస్సున పొంగి ఆగిపోతున్నప్పుడు..చూసారా?..ఆ కాఫీ డికాషన్ సువాసన!?.. మాటల్లో చెబితే ఫీలింగ్ పోతుంది. ఇదిగో వంశీ లా కళ్ళు మూసుకుని  ఊపిరి పీల్చి, ఆ కాఫీ పరిమళాన్ని గాఢంగా గుండెలకెత్తుకున్నప్పుడు తెలుస్తుంది ‘ ఆహా! ఇలాటి కాఫీ – ఒక్క కప్పు.. కాదు, కాదు.  ఒక్క బొట్టయినా చాలు.   కాలం చేసే జాలాలు తట్టుకుని ముందుకెళ్ళిపోడానికి..’ అని అనుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు కొన్ని క్షణాల సేపు.
“ఆహా.   అమ్మా, మన వంటింట్లో ఇన్నేసి   ఘుమఘుమలెలా సృష్టిస్తావ్?” అన్నాడు తల్లిని ప్రశంసిస్తూ.
నిజానికి ఇల్లాలి సిగ్నేచర్ కి ఒక తెల్ల కాగితం లాంటిది – వంటిల్లు.
అభిరుచికి అమరిక తార్కాణమైతే ,  అద్భుత రుచులకు – లేని ఆకలి రేగడం  ప్రత్యక్ష సాక్ష్యం.
“చాల్లేరా, నీ పొగడ్తలకి పడిపోతాననుకోకు. నువ్వుస్తొన్నావని ఒక్క ఫోన్ కొడితే  నీ సొమ్మేంపోతుందిరా  వంశీ? బిడ్డ వాయిట్లోకొచ్చాడని, నాలుగు రకాల వంటలు చేసి  పెట్టక పోదునా? ఆ?!”
తల్లి ప్రేమని  అర్ధం చేసుకున్న వాడిలా నవ్వి అన్నాడు. “ఇప్పుడు మాత్రం నువ్వు తక్కువ చేస్తావా ఏమిట్లే..’ అంటూ   ఆమె  చేతిలోంచి కాఫీ కప్పుని అబగా అందుకున్నాడు. కప్పులోంచి సొగసుగా చిమ్ముతున్న పొగని  గట్ఠిగా ఆఘ్రాణించి,  మైమరచిపోయాడు.  ఆ తర్వాత – అపురూపం గా ఒక సిప్ తీసుకుని..’ అహా..ఏం రుచి. చక్కటి చిక్కటి కమ్మటి రుచి. అమ్మా! నీకు నువ్వే సాటి. రాలేరెవరూ కాఫీ తయారీలో నీకు పోటీ..’ అంటూ..తన గదిలోకొచ్చి టేబుల్ ముందున్న కుర్చీలో కూర్చున్నాడు-  ఎంతో ఎంతో హాయిగా సేద తీరుతూ.
తెరిచి వున్న కిటికీల్లోంచి పచ్చని తోటని, గాలికి ఊగే పూల రెమ్మల్ని,  బీర తీగకు  పూసిన చామంతుల్ని చూస్తూ… కాఫీ ని పూర్తి చేసాడు.
జానకీ, రామారావు దంపతులకు వంశీ ఒక్కడే కొడుకు. కృష్ణా జిల్లా పామర్రు పక్కన చిన్న గ్రామం. ఆవిడ తెలుగు టీచర్. ఆయన గ్రామ పంచాయితీ లో ఉద్యోగం. కొడుకుని కష్టపడి ఇంజినీరింగ్ చదివించారు.
చాలామంది అనుకున్నట్టు ఇంజినీర్లందరకీ   –  పెద్ద పెద్ద జీతాలుండవు.  వంశీ కూడా ఆ కోవకు చెందినవాడే. హైదరాబద్ లో నీటిమోటార్లు తయారు చేసే ఒక ప్రైవేట్ కంపెనీలో మర్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. వృత్తి రీత్యా, టూర్లు తిరుగుతుంటాడు.  ఆఫీస్ పని మీద  విజయవాడ కి వచ్చినప్పుడు  అక్కడ పనులయ్యాక, వెంటనే తల్లి దగ్గరకొచ్చి వాలి,  ఒక పూటుండి తిరుగు ప్రయాణమై వెళ్ళిపోతుంటాడు.
రిటైరైన తల్లి తండ్రుల్ని తన దగ్గర వుంచుకుని బాధ పెట్టటం అతనికి ఇష్టం వుండదు. ఎందుకంటే, వీళ్ళిప్పుడున్నంత రిచ్ గా వుండదు తనుంటున్న అపార్ట్ మెంట్.  ఈ పచ్చని లోగిలి, స్వచ్చమైన గాలి, వెలుతురు ముందు –  తన ఫ్లాట్  ఏ పాటిది? తమ బాల్కనీ కుండీలో ముళ్ళ మొక్క కూడా ఏపుగా పెరగదు. కొన్ని వాతావరణాలు అలాంటివి.
నీరజ  నీడలో కూడా అంతే. – మరో మనిషి ఆనందం గా వుండలేడు. కారణం ‘ఇది’ అని ఎంచి చూపేంత నేరాలుండవు. అలా అని పట్టించుకోకుండా హాయిగా బ్రతికేంత మంచి తనాలు కనిపించవు.
సమాజం లో చాలామంది తప్పు చేసి  తప్పించుకు తిరుగుతున్న వారిలానే,  కుటుంబం లోనూ  బాధ్యతల నించి తప్పించుకుని, తాము చాలా కరక్ట్ అని చలామణి అయే స్త్రీలూ వున్నారు.
పెళ్ళైన ఈ పదేళ్ళల్లో అమ్మా నాన్నలు  ఏ రెండు సార్లో, మూడు సార్లో తనింటికి వచ్చినట్టు గుర్తు. నెల రోజుల కని వచ్చి వారమైనా కాకముందే..’మేం వెళ్తాం రా కన్నా’అన్నారు. ‘అప్పుడేనా’ అన్నట్టు చూసాడు. ‘ ప్లీజ్ మమ్మల్ని వదిలేయి రా! మా పాలి మేం బ్రతుకుతాం హాయిగా ‘ అని వేడుకుంటున్న భావం చదివాడు వాళ్ళ చూపుల్లో. అప్పుడే అర్ధమైంది తనకి  – తన భార్య వ్యక్తిత్వం ఎలాటిదో అని.
అయినా అమ్మ ఒక్క పొర్లుమాటయినా చెబుతుందా కోడలి మీద!? – ఊహు. చెప్పదు. పైగా తను ఎక్కడ బాధపడతాడోనని.. ‘కొన్నాళ్ళు పోనీరా..అమ్మాయి శుభ్రంగా మనలో కలిసిపోతుంది’ అంటూ ఊరడిస్తుంది తల్లడిల్లుతున్న మనసుని.
కొంతమందిని కలిసినప్పుడు, పోయిన శ్వాస తిరిగొస్తుంది. మరికొంతమందితో కలిసి నడుస్తున్నప్పుడు బ్రతకాలన్న ఆశ చచ్చిపోతుంది.
తను చేసినబొమ్మల్లోనే ఇంత  తేడానా ? – అని దేవుడెప్పుడూ విస్తుపోడా?
గంధపు  చెట్టు – తనని చుట్టుకున్న –  పాముకైనా, తన నీడన కుర్చున్న పరమ పురుషునికైనా ఒకేలా పరిమళలాలను పంచుతుంది.
తన ఇంటి కల్పవృక్షం – అమ్మ కూడా  అంతే.
తన నించి అమ్మ ఏమీ కోరుకోదు. ఆ అవసరమే లేదు.  తను కనిపిస్తే చాలు. తను ఈ ఇంట్లో అడుగుపెడితే చాలు..ఇలా గదిలో విశ్రాంతి తీసుకుంటూ..ఇదిగో..ఈ మెత్తని పరుపు మీద నిద్రలోకి జారిపోతుంటే..అమ్మ శబ్దం లేకుండా వచ్చి చూసి, తలుపులు దగ్గరకేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ భోజనం సమయం వరకు తనని నిద్ర లేపదు.’ – నవ్వుకుంటూ మెల్ల మెల్లగా గాఢ నిద్రలోకి జారిపోయాడు.
*****
వీడు చెప్పా పెట్టకుండా వచ్చేస్తాడు తుఫాన్లా. సాయంత్రం చీకటి పడుతుండగా ప్రయాణమై వెళ్ళిపోతాడు. ఈ ఒక్క పూట. ఏం వండాలి ఇప్పుడు. ఏం కూర చేస్తే బావుంటుంది?
కూరల బుట్ట చూసింది. ఒక పెద్ద గట్టి దోసకాయ కనిపించింది. వంటింటి కిటికీ లోంచి ఒక చూపేసి గాలించింది పెరటి తోటని. ఏపుగా నవనవలాడుతూ పెరిగిన  తోటకూర మొక్క – మనిషంత ఎత్తు లో  మంచి ఏపుగా ఎదిగి వుంది.
ఇంకేం, అనుకుంటూ – గబగబా వెళ్ళి, ఒక మొక్క మొక్క బలంగా పెరికి తీసుకొచ్చింది. ముదురాకు వొలిచి  పంపు ధార కింద కడిగి, నీళ్ళు వోడ్చే బుట్టలో వేసి, గోడకి వారగా వుంచింది.
తోటకూర కాడ  చివర వేరు కట్ చేసి, కత్తి పీట తో నాలుగు ముక్కలు గా తరిగింది. ఆ పై, మందమైన చక్రలు గా  తరిగి,  తరిగిన ముక్కల్ని నీళ్ళల్లో వేసింది.
రెండు కుంపట్లంటించి, ఒక దాని మీద మందపాటి ఇత్తడి గిన్నెలో  రెండు గరిట్ల కంది పప్పు వేసి, దోరగా కమ్మటి  సువాసన వచ్చేదాకా వేయించి,  సరిపడ నీళ్ళు పోసి, మూత పెట్టింది.
మరో కుంపటి మీద గిన్నె లో ఎసరు పోసి, అందులో ఒక చుక్క నూనె బొట్టేసి, చిటికెడు ఉప్పు రాల్చి, బాగా మరిగాక – కడిగి, వార్చిన బియ్యం వేసి, గరిటతో నాలుగు వైపులా తిప్పి, మూతేసింది. అన్నం ఉడుకుపట్టగానే – కుంపటిని అటు ఇటూ కుదిపి, గిన్నె చుట్టూ వున్న బొగ్గుల్ని లాగేసి, సన్నసెగ చేసింది.
కత్తి పీట ముందు కుర్చుని, ముందుగా దోసకాయని నిలువుగా రెండు చెక్కలు చేసింది. ఒక దాని మీద పెచ్చు తొలగించి, గింజ  తీసి లావాటి ముక్కలు తరిగి గిన్నెలోకేసుకుని, పసుపు జల్లింది.
రెండో చెక్క చిన్న చిన్న ముక్కలుగా తరిగి చిన్న జాడిలో వేసి, పసుపుతో బాటు సరిపడ ఉప్పు కారం  వేసి పక్కన పెట్టుకుంది. నానబెట్టుకున్న ఆవాలతో బాటు, ఓ ఎండు మిరపకాయ  జోడించి  రోట్లో వేసి బండ తో నూరింది. మెత్తగా అయిన ఆ మిశ్రమాన్ని దోసకాయ  ముక్కలకి పట్టించి, పచ్చి ఆవ  నూనె వేసి నాలుగువైపులా కలియదిప్పి మూతేసింది.
పప్పు గిన్నె ఒక సారి చెక్ చేసింది.  సగం బద్ద ఉడకగానే, దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాముక్కలు వేసి కలిపి మూతేసింది.
అన్నం వుడికి, అడుగున బంగారు వన్నెలో పొర చుట్టుకుంటున్న సువాసన గుప్పు మంది. క్షణమైనా ఆలస్యం చేయకుండా  గబుక్కున గిన్నె కిందకి దింపి, దాని చుట్టూ నీళ్ళు చిలకరించింది. చుయ్..చుయ్ మంటూ రాగాలు తీసింది అన్నం గినె.  మూత అయినా  తీసి చూడకుండానే తెలిసిపోతుంది ఆమెకి. తడి లేకుండా అన్నం ఉడికిన సంగతి.
వంటలకి స్పర్శ వుంటుంది. అది మనసు పెట్టి చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ భాష చాలా అర్ధమౌతుంది.
ఖాళీ అయిన  కుంపటి మీద  మూకుడు వేసి, నూనె వేడయ్యాక బూడిద గుమ్మడొడియాలు, ఊరినమిరపకాయలు, వేయించి తీసింది.  అదే నూనెలో నాలుగు మెంతి గింజలు, ఆవాలు ఎండుమిరపకాయ ముక్కలు, వేసి, అవి వేగాక – జాస్తి ఇంగువ పొడి జల్లి, బుస్సుమని పొంగగానే..  పప్పు గిన్నెలో తిరగమూత బోర్లించి మూతేసేసింది.
అదే మూకుట్లో – పోపు వేయించి,  అందులో – సన్నగా తరిగి,  బిరుసుగా వుడికించి  వార్చిన తోటకూర ముద్దని వేసి, కలియబెట్టింది. తడి ఇంకగానే అల్లం, పచ్చిమిరపకాయ, వెల్లెల్లి రెబ్బల ముద్ద చేర్చి, కలియబెట్టి దింపేసింది. చల్లారాక గుమ్మడికాయ వడియాలని చేత్తొ నులిమి  కూరలో కలిపింది.
ఒక రెండు కప్పుల అన్నాని చల్లార్చి, నిమ్మకాయ పిండి, జీడిపప్పు, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాలు, వేయించిన పోపు పెట్టి, సన్నగా తరిగిన కొత్తిమీర జల్లింది.  పుల్లటి పులిహోర సిధ్ధం.
లేత సొరకాయ తెంపుకొచ్చి, మజ్జిగ పులుసు కాచింది.
జాడీలోంచి తీపి ఆవకాయ తీసి వుంచింది.
మట్టి కుండలో తోడేసిన పెరుగు, నీళ్ళలో ముంచిన మామిడి రసాలు, వీట్నన్నిట్నీ –  వేటికవి విస్తట్లోకి వివరంగా  అమర్చేందుకు వీలుగా బౌల్స్ , వడ్డించడానికి  స్పూన్లూ, గరిటెలు, బౌల్స్  సిధ్ధం చేసుకుంది.
అలా బావి గట్టు చివరికల్లా వెళ్ళి, మూడు అరిటాకులు కోసుకొచ్చింది. ఆకుపచ్చటి పత్రాలని తడి బట్టతో శుభ్రం చేస్తుంటే –
భర్త వచ్చాడు. “ ఏవిటీ!!వీడొచ్చాడేమిటీ?” అని,  ముసిముసిగా నవ్వుకుంటూ  అడిగాడు.
“అవును. వచ్చాడు. ముందు గదిలో బాగ్ చూసి అడుగుతున్నారా? ” అని అడిగింది,   మంచి నీళ్ళందిస్తూ.
“కాదు. వంటింట్లోంచి ..వీధి వరకు వంటలు ఘుమాయిస్తుంటే అనుకున్నాలే..” సరసమాడాడు.
వంశీ గదిలోంచి బైటకొచ్చాడు.  తండ్రి తో కాసేపు కుశలమాడి, స్నానం చేసొచ్చాడు.
పొద్దున ఉప్మా కుమ్మేయడం తో – ఇక ఆకలి వేయదనుకున్నాడు. కానీ, వంటింట్లో అలా పరిచిన వంటకాలు చూసే సరికి  ఆవురావురుమంటూ ఎక్కడ్లేని ఆకలి పుట్టుకొచ్చేసింది.
చేసే వంటల రుచిని బట్టి ఆకలేస్తుంది. తినాలని మనసు ఉవ్విళ్లూరుతుంది.
జీవితమైనా అంతే.-  భాగస్వామి ప్రెమానురాగాల అభివ్యక్తీకరణలో జీవితం ఒక సంపూర్ణతని సంతరించుకుంటుంది. అయుష్షు తీరిపోతున్నా, ఇంకా బ్రతుకులోని మాధుర్యాన్ని గ్రోలాలనిపిస్తుంది. కాదూ?
అరిటాకు మధ్యలో అన్నం, చుట్టూ రకరకాల పదార్ధాలు, కొసరి కొసరి వడ్డిస్తూ అమ్మ. పక్కనే కూర్చుని, కబుర్లాడుతూ నాన్న.
ఇలా పీట మీద కుర్చుని, ప్రేమ విందు ఆరగించడానికి ఎంత  పుణ్యం చేసుకు పుట్టాలి?
“అమ్మా! నెయ్యి ఇప్పుడే కాచినట్టున్నావ్? గోగు అట్టిపెట్టావా నాకోసం? అరటి గెలేసిందన్నావ్ మగ్గేసారా? తోటకూర కాడల కూర చాలా బావుంది, ఆవ పెట్టావు కదూ? అబ్బ!  దోసావకాయ ఘాటు అంటింది. మజ్జిగ పులుసు నువ్వు చేసినంత అద్భుతం గా నేనెక్కడా తిన్లేదమ్మా! నిజం. ఒట్ట్టు. ఏవో పప్పులు నానేసి రుబ్బుతావు కదూ. నీరజ కి చెప్పాను. ఉత్తి శనగపిండి మాత్రమే కాదు, అమ్మ ఇంకేవెవో ఇం గ్రీడియంట్స్ కలుపుతుందని. ఒక సారి ఫోన్లో చెప్పకూడదూ? మీ కోడలికి. కుండలో పెరుగు ఎంత తీయగా వుందో..మామిడి రసం తో కలిపి తింటుంటే స్వర్గానికి బెత్తెడు దూరం అని అంటారు చూడు..అలా వుంది..”
భోజనం చేస్తున్నంతసేపూ..తన వంట గురించి మాట్లాడుతున్న కొడుకు మాటలకి, పొగడ్తలకి, అతను పొందుతున్న ఆనందానుభూతులకి ఆమె కడుపు నిండిపోతోంది. అతడిలో బాల్యపు వంశీ  మురిపెంగా చూస్తూ వుండిపోయింది.
ఇంత తక్కువ సమయం లో ఏం వంటలు వండి చేసి పెడతానా, భోజనాల వేళకి అందుతాయా లేదా అనుకుంది కానీ, కొడుకు ఒక్కోపదార్ధాన్ని వర్ణించి వర్ణించి చెబుతుంటే..’హమ్మయ్యా! నాలుగు రకాలు చేసానన్నమాట?’ అనుకుంది తృప్తిగా.
నిజమైన తల్లి చూపెప్పుడూ పిల్లల సంపదల మీద వుండదు. పిల్లల సంక్షేమం మీద వుంటుంది.
నిజమైన పుత్రులకు కూడా అమ్మ చూపే చాదస్తపు ప్రేమల మీద కోపం వుండకూడదు. దాని వెనక అంతరార్ధం ఏవిటో కనుక్కొని వుండాలి.
ఇది మనసు కు చెందిన ప్రత్యేకమైన లిపి. రహస్యం గా రాసి వుండే ఒక భాష. కన్న తల్లి ఆంతర్యం కన్న కొడుక్కి మాత్రమే అర్ధమౌతుంది. అయితె, అమ్మ అంటె ఏవిటో అర్ధం తెలిసిన పుత్రులకు మాత్రమే.
అలా..వంశీ   తల్లి మనసుని  పూర్తిగ చదివి తెలుసుకున్నాడు.
భోజనాలు చేసి లేచే సరికి, రెండున్నరైంది.
ఆమె వంటిల్లు సర్ది హాల్లోకొచ్చి కుర్చుని, పిచ్చా పాటి మాట్లాడుకుంది కొడుకుతో.
ఏడింటికి బస్ బయల్దేరుతుందని చెప్పడం తో…లేచి లోపలకొచ్చింది జానకి.
భర్తని పిలిచి, యాభై గట్టి అరటి పళ్ళని పాక్ చేయించింది. దొడ్లో పండిన కూరల పంటంతా కలిపి పది కిలోల పొట్లం కట్టిపెట్టింది.
రెండ్రోజుల కిందట చేసి డబ్బాలో పోసిన కారప్పూస జిప్ లాక్ కవర్లో పోసింది. ఓ పాతిక కొబ్బరి లౌజుండల్ని మరో పాకెట్ లో వేసింది.
వీటన్నిట్నీ రెండు పెద్ద సంచుల్లో వేసి, జిప్ వేసి,  కొడుకి చేతికందించింది.
ఇప్పుడివన్నీ ఎందుకమ్మా అంటూనే..’కారప్పూస మంచి వాము  వాసనేస్తున్నాయి.  బావుంది’ అన్నాడు.
జానకి తనలో తాను నవ్వుకుంది. కొడుకు మాటలకి.
మధ్యాహ్నం హెవీ లంచయ్యిందని ఏమీ తిననన్నాడు. కానీ, ఆమె బలవంత చేసి దిబ్బరొట్టె తాజా వెన్న లో అద్ది, వెల్లుల్లి కారప్పొడితో కలిపి తినిపించింది.
అమ్మ చేతి ముద్దు కాదనలేకపోయాడు. బస్సు ప్రయాణం వేడి చేస్తుందంటూ కవ్వంతో చిలికిన చిక్కటి మజ్జిగ లో పంచదార పొడి, ఇలాచి పొడి వేసి, చిటికెడు ఉప్పు రాల్చి కలిపి స్వీట్ లస్సీ చేసి అందించింది.
ఖాళీ గ్లాస్ అక్కడ పెడుతూ..ఇక వెళ్ళేందుకు లేచాడు.
‘రెండు ఆపిల్స్ ఇవ్వనా మధ్య రాత్రి ఆకలేస్తుందేమో..’ అంటున్న తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఏమీ వద్దమ్మా అన్నట్టు తలూపాడు. అమ్మ ముఖం లోకి..కళ్లల్లోకి..చూస్తుండిపోయాడు.

ఏదో చెప్పలేని అద్వితీయమైన భావం అతని మూగవాణ్ణి చేస్తోంది. ఇంత గా తనని ప్రేమించే అమ్మ వుండటం ఒక వరం. ఒక దైవానుగ్రహం. కానీ తిరిగి ఏమిస్తున్నాడు?..ఏమివ్వలేడు. తను ఇవ్వగలిగేవన్నీ ఆమెకి తృణ ప్రాయం. ఆశించని లంచం. ఇలా వండి పెట్టుకోవడం లో ఆవిడ పొదుతున్న అపురూపమైన ఆనందం ముందు అవన్నీ బలాదూర్.
అందుకే వస్తుంటాడు..అమ్మని సంతోష పెట్టటం కోసం.
అఫ్కోర్స్. విందు ఎలానూ వుంటుంది. అమ్మని అంత ఆనందంగా చూడటమూ విందే కదూ?
నిన్ననే ఎండీ తో మాట్లాడాడు. కొత్త రాష్ట్రం లో బ్రాంచ్ ఓపెన్ చేస్తే కంపెనీ లాభాలు పుంజుకుంటుందని.  గుంటూరు, విజయవాడకొచ్చేస్తే..అమ్మని చూడ్డానికి తరచూ రావొచ్చు.
“ఏమిట్రా అలా చూస్తున్నావ్? పిచ్చి వాడిలా?” కొడుకుని నవ్వుతూ అడిగింది.
“ఏం లేదమ్మా..మళ్ళీ ఏ రెండు వారాలకో కానీ రాను కదా.. తనివితీరా చూసుకుంటున్నా..నిన్ను, నీ ప్రేమని..” అంటూ వొంగి, ఆ ఇద్దరి పాదాలనూ స్పృశించాడు కళ్ళకద్దుకున్నాడు.
“అమ్మాయిని అడిగానని చెప్పు. పిల్లలు జాగ్రత్త. ఈసారి సెలవులకి అందరూ కలిసి రండి..”
బస్సులో ప్రయాణిస్తున్న వంశీకి ఇంకా తల్లి మాటలు వినిపిస్తూనే వున్నాయి.
వంట చేసి అమ్మ శ్రమ పడుతుందని పూర్తిగా తెలుసు. కానీ అది ఆమె శ్రమ అనుకోదు. పైగా తన కష్టన్నంతా… కొడుక్కి వడ్డిస్తున్నప్పుడు పొందే ఆనందంలో మరచిపోతుంది. ఆమె ఆనందమే తనకి ముఖ్యం.
తను బ్రతికున్నంత వరకు కొడుక్కి కంచంలో అన్నం పెట్టుకోవాల్నఏ చాలా సామాన్యమైన కోరిక ఎంత విలువైనదో…ఎందరికి  తెలుస్తుంది?