అదో వూరు….
పల్లెకు ఎక్కువ….పట్టణానికి తక్కువ. ఆ ఊల్లో శిథిలమై పోయిన ఓ బస్టాపు. వీధి కుక్కలకు ఆవాసమైన ఆ బస్టాపులో రెండు రోజులుగా కదలకుండా పడిపోయాడు ఆ బిచ్చగాడు.
అప్పుడే తెల్లవారింది. లేత ఎండ వేడికి వాని వంట్లో చురుకు పుట్టింది. మెల్లగా కన్ను తెరిచి చూశాడు.ఆకాశం ఆ బిచ్చగాని చిప్పలాగే బోసిపోయి ఉంది.మెరిసే సూరీడు వాడి కంటికి.. తన సత్తుగిన్నెలో పడే ఎర్ర కారం ముద్దలాగే కనిపించాడు. మూడు రోజులుగా ఒళ్లు కాలిపోయే జ్వరం…దేహం స్వాధీనంలో లేదు. నాలుగు మెతుకులు బిచ్చమెత్తుకుందామనుకున్నా…. లేవలేక అలాగే ఉండిపోయాడు. ఇవాళ ఎలాగైనా ఒక ముద్ద తినాలనుకుని మెల్లగా పైకి లేశాడు.చేతి కర్ర కోసం వెతికాడు. దాన్ని దొరకబుచ్చుకుని మెల్లగా పైకి లేచాడు. తన ఏకైక ఆస్తి సత్తుగిన్నె కోసం అటూ ఇటూ చూశాడు. ఏ వీధికుక్కో అన్నం వాసనకు పళ్లెం దూరంగా లాక్కెళ్లినట్టుంది. దూరంగా మట్టిలో పడిపోయి ఉంది.
వాడిదీ వూరు కాదు. ఆ మాటకొస్తే వాడికసలు ఏవూరూ లేదు. ఒక ఊరు నుంచి మరో ఊరు తిరుగుతూ బిచ్చమెత్తు కుంటాడు.అలా ఊళ్లు తిరుగుతూ,తిరుగుతూ…. రెండు రోజుల కింద ఈ ఊరు చేరుకున్నాడు. వచ్చిన రోజు రాత్రే ఆరోగ్యం బాగాలేక పడిపోయాడు. వాన్ని పట్టించుకున్న నాథుడు లేడు వీధి కుక్కలు, ఈగలు తప్ప.
అనేక సొట్లు పడిపోయి….దుమ్ము కొట్టుకుపోయిన సత్తు పళ్లాన్ని తీసుకున్నాడు.ఇయ్యాల ఎలాగైనా ఒక్క ముద్ద బువ్వ దొరికితే బాగుండనుకున్నాడు.
ఆకలి….ఆకలి… కడుపులో మంట. భరించలేని మంట.
ఒక్క ముద్ద కడుపులో పడితే కానీ మంట చల్లారదు.
కానీ నడిచేందుకు ఓపిక రావడం లేదు. ఒంట్లో శక్తినంతా కూడదీసుకున్నాడు.వాడికి ఒక కాలు కాస్త వంకరగా ఉంది. మెల్లగా కుంటుకుంటూ దగ్గరలోని ఓ ఇంటి ముందుకు చేరుకున్నాడు.
ఎవరు ఒప్పుకున్నా..ఒప్పుకోకున్నా అన్ని విద్యల్లోకి… బువ్వ సంపాదించడమే గొప్ప విద్య.
ఆ బిచ్చగాడికి తెలిసింది కూడా ఆ ఒక్క విద్యే.
“అమ్మా….నీకు దండం పెడతాను తల్లే… కాసింత బువ్వుంటే ఎయ్యమ్మా…
తల్లే…..మూడు రోజులైందమ్మా బువ్వతిని….ఒక్క ముద్దుంటే ఎయ్యమ్మా…”
వాడి అసహ్యకరమైన ఆకలి కేకలు పరమపవిత్రమైన ఆ ఇంటి వాతావరణాన్ని భంగపరిచినట్టున్నాయి.!
” పొద్దున్నే తగలడ్డాడు…..వెధవ ముష్టివాడు…నీకు ఈ ఊళ్లో ఏ ఇళ్లు దొరకలేదట్రా వెధవ్వా… వెళ్లు.”
” అమ్మా బుువ్వ తిని….”
” పో బయటకు తగలడు. నువ్వు…నీ అవతారం. పో…..”
ఇక లాభం లేదనుకుని మరో ఇంటి ముందుకు చేరుకున్నాడు
” అమ్మా…..మూడు రోజులైంది తల్లీ…బువ్వ తిని. ఒక ముద్దుంటే ఎయ్యమ్మా….నీకు దండం పెడతాను తల్లే…”
” ఒరేయ్ దిక్కుమాలిన వెధవ…పొద్దున్నే నీ దరిద్రపు మొహం చూశాను. ఏం ప్రమాదం జరుగుతుందో ఏమో…? బయటకు తగలడురా అంట్ల వెధవ.”
కాళ్లీడ్చుకుంటూ ఇంకో ఇంటి ముందుకు వచ్చాడు.
” అయ్యా మూడురోజులైందయ్యా అన్నం తిని. …”
” అరే సాలే. ఎవడ్రా నువ్వు. పొద్గాల పొద్గాల….ఇంటి ముందుకొచ్చి లొల్లి చేస్తున్నవ్. నీ తల్లీ… చల్ బే చల్….”
ఇంకో ఇంటి ముందు ఎంత మొత్తుకున్నా స్పందన లేదు. ఈ సారి కనీసం తిట్లైనా రాలేదు.
అరిచి అరిచీ గొంతు పోయింది తప్ప లాభం లేదు. ఇంక నడిచే ఓపిక లేదు.
ఆకలి…ఆకలి….మంట..కడుపులో మంట
పేగులు కోస్తున్నట్లు భరించలేని బాధ.
ఒక్క ముద్ద. ఒకే ఒక్క ముద్ద…. కడుపులో పడితే బాగుండు.
నడిచే ఓపిక లేక దూరంగా ఓ చెట్టు కనిపిస్తే దానికింద కూలబడ్డాడు. ఓ వైపు ఆకలి. మరోవైపు చేతకావట్లేదు. ఎవరైనా ఒక ముద్దవేస్తే బాగుండని ఆశగా ఎదురు చూశాయి అతడి కళ్లు. అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అలా ఎదురు చూసీ చూసీ కళ్లు మూతపడ్డాయి.
***
మెల్లగా ఏదో మైకు శబ్దం వినిపించింది. ఆ చప్పుడుకు బిచ్చగానికి మెలకువ వచ్చింది. కళ్లు తెరిచి చూశాడు. శక్తి కూడదీసుకుని పైకి లేచాడు. అక్కడ ఏదో సభకు సంబంధించిన ప్రచారం జరుగుతున్నట్టుంది. ఓ జీపులో కొంత మంది వచ్చారు. జీపుకు ముందు వెనకాల మైకులు…జెండాలు కూడా కట్టారు.జనాలు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు.
అక్కడేమైనా దొరుకుతుందేమోనని ఆశగా బిచ్చగాడు మెల్లగా అక్కడికి కదిలాడు.ఒకాయన జీపు పైకి ఎక్కి మాట్లాడుతున్నాడు. అతనికి బాగా గడ్డం పెరిగింది. పేద్ద బొట్టు కూడా పెట్టుకున్నాడు.
“సోదర సోదరీమణులారా…..మన సంస్కృతికి భయంకర ప్రమాదం పొంచి ఉంది. కాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా మన మీద దాడి జరుగుతోంది. అందుకే మనమంతా ఏకం కావాలి. లేదంటే విదేశీ శక్తులు మనల్ని ఆక్రమిస్తాయి.మతోన్మాద శక్తులు మన పుణ్యభూమిని పరాయిదేశంలా మారుస్తాయి. అప్పుడు మనమంతా…బానిసల్లాగా బతకాల్సి వస్తుంది….” ఆవేశంగా మాట్లాడుతున్నాడు.
ఆ గడ్డం పెంచుకున్నాయన ఏం మాట్లాడుతున్నాడో బిచ్చగాడికి ఒక్క ముక్కా అర్థం కావడం లేదు. వాడికి కావాల్సింది ఒక్క ముద్ద బువ్వ లేదా ఒక్క రూపాయి బిళ్ల. మెల్లగా ఓ గుంపు దగ్గరికి వెళ్లి అడిగాడు.
మైకులో అక్కడ గడ్డం నాయకుడు స్వరం పెంచి మాట్లాడుతున్నాడు.
” సోదరులారా…మనది ఎంతో సంపన్న దేశం….”
” మూడురోజులైంది బాబూ అన్నం తిని… ఒక్క రూపాయి దరమం చేయి బాబూ……” బిచ్చగాడూ దీనంగా వేడుకుంటున్నాడు.
” సోదరులారా మనది ఎంతో విశిష్ట సంస్కృతి, ఘనమైన వారసత్వం గల దేశం మనది.”
” సచ్చి మీ కడుపున పుడతాను బాబూ…ఒక్క రూపాయి ధర్మ చేయండి బాబూ…”
” ఎంతో సహనశీలత గల దేశం మనది….”
” ఏరా దొంగ నా కొడుకా. అడుక్కోవడానికి నీకు ఈ మీటింగే కనపడిందా. పో బే…పో సాలె…ఛల్”
ఎవరో బలంగా నెట్టేయడంతో బిచ్చగాడు కిందపడిపోయాడు.
గడ్డం నాయకుడు చెపుతూనే ఉన్నాడు. ” ఇంతటి మన సంస్కృతికి ఆపదవచ్చింది. రేపు జరిగే సమావేశానికి పై దేశం నుంచి గొప్ప స్వామీజీ వస్తున్నారు. కాబట్టి అందరూ తరలిరండి….దేశాన్ని కాపాడటానికి సిద్ధం కండి…..” అంటూ పిలుపునిచ్చాడు.కాసేపటికి ఆ జీపు అక్కన్నుంచి వెళ్లిపోయింది.
జనం కూడా రేపు ఆ సమావేశానికి వెళ్లి….దేశాన్ని ఆపదనుంచి కాపాడేందుకు సిద్దం కావాలని మనసులో తీర్మానించుకున్నారు. కానీ ఇవాళ్టికి మాత్రం ఎవరిపని వాళ్లు చూసుకుందాం అనుకుని వెళ్లిపోయారు.
ఊరంతా తిరిగినా ఎక్కడా ముద్ద బువ్వకానీ…ఒక్క రూపాయి కానీ పుట్టక పోవడంతో బిచ్చగాడికి నీరసం వచ్చింది. చివరకు ఓ పాత గుడి కనపడితే దాని ముందు కూలబడ్డాడు. సూరీడు కూడా పగలంతా తిరిగి తిరిగీ అలిసిపోయి….పాతగుడి లాంటి పడమట దిక్కులోకి జారిపోయాడు.
” సామే….మూడు రోజులనుంచీ ముద్ద పుట్టలేదు సామే….దయుంచి ఒక ముద్ద బువ్వో….పది రూపాయలు దొరికేలా చెయ్యి సామే…” దేవున్ని వేడుకున్నాడు.
మెల్లగా చీకట్లు ముసురుకున్నాయ్. భక్తులు వస్తున్నారు….పోతున్నారు ఒక్కరూ వాని పళ్లెంలో రూపాయి వెయ్యలేదు.బిచ్చగానికి ఇవాళ కూడా ఓ ముద్ద దొరికేదారి కనపడడం లేదు. ఇంతలో దూరంగా ఏదో అలికిడైతే మెల్లగా అటు వేపు వెళ్లి చూశాడు. అది పాతకాలపు గుడి కావడంతో పెద్దగా భక్తుల సంచారం లేదు. గుడికి దూరంగా పిచ్చి చెట్ల పొదలున్నాయి. ఆ చెట్ల చాటున ఎవరో తాగుబోతుల గుంపు ఏదో పార్టీ చేసుకుంటున్నారు.
” అయ్యా దండం పెడతా…ఒక రూపాయి దరమం చెయ్యండి సామే…” దీనంగా వేడుకున్నాడు.
” అరె ఎవడ్రా బే.? మేం పుల్ ఖుషీగా దావత్ చేసుకుంటుంటే…ఎవడ్రా నువ్ బేవకూఫ్. ఛల్ దూరంగా పో. ”
” మూడు రోజులైంది సామీ అన్నం తిని…ఒక్క రూపాయ దరమం చేయండి పున్నెం ఉంటాది.”
” మేం కూడా మందు దాగి పది రోజులైంది…..హ హ్హ హ్హ….” తాగుబోతులంతా పడీపడీ నవ్వుకున్నారు.
అట్ల చాలా సేపు వాళ్లు తాగీ…తాగీ….తెచ్చుకున్న పొట్లాలు తిని వెళ్లిపోయారు.వాళ్లు వెళ్లిపోయాక బిచ్చగాడు మెల్లగా అక్కడికి వెళ్లాడు. ఏమైనా దొరుకుతుందేమో అని ఆశగా వెతికాడు. ఖాళీ మందు సీసాలు. నీళ్ల పాకెట్లు.చివరికి సగం తిని వదిలేసిన ఒక పొట్లం కనపడింది. తెరిచి చూశాడు.
వాసన. కమ్మని వాసన. పలావు వాసన. అన్నం మెతుకులు చూడడంతో బిచ్చగానికి మళ్లీ ప్రాణం లేచి వచ్చినట్లైంది.
ఆ చీకటిలోంచి బయటకొచ్చి గుడి దీపాల వెలుగు దగ్గరకు వచ్చాడు. గుడి దగ్గర కుళాయి కనిపించింది. కాళ్లూ, చేతులూ
సత్తు గిన్నె తేటగా కడుక్కున్నాడు. కాసిన్ని నీళ్లు తాగాడు. గుడి బయటకు వచ్చి మెల్లగా పొట్లం విప్పాడు.
“దేవుడా… నీ గుడి దగ్గరకు రాగానే ఇంత ముద్ద దొరికింది. దండాలు సామే.”అనుకుంట ఆబగా ముద్ద నోటిలో పెట్టుకోబోయాడు.
అంతలోనే ఎక్కణ్నుంచి వచ్చాడో గడ్డం నాయకుడు అక్కడకు వచ్చాడు. పొద్దున జీపు మీద పెద్ద ప్రసంగం ఇచ్చిన గడ్డం నాయకుడే. పెద్ద బొట్టు పెట్టుకుని ఉన్నాడు. చూస్తేనే భయపడేలా ఉన్నాడు.
” అరే సాలే….ఎవడ్రా నువ్. నిన్నెపుడు ఈ గుడి దగ్గర చూడలే. ?” బిచ్చగాన్ని గద్దించిండు.
” అయ్యా…బిచ్చగాన్ని సామీ…?”
” అది కాదుర మాత్తర్ చో…. ఎవ్వన్నడిగి ఈ గుడిలెకి వచ్చినవ్. ”
” అయ్యా తప్పయిందయ్యా. నేనేం గుడి లోపటికి రాలేదయ్యా. నీళ్లు తాగటానికి ఈ పంపు దగ్గరకి వచ్చిన… అయినా నీళ్లు దాగటానికి కూడా ఎవుర్నో అడగాలా సామీ…”
” ఈ గుడి నీ తాతదన్నుకున్నవారా బట్టెబాజ్. ? ఈ గుడి కట్టిందే మేము. ఈ గుడిలె దేవుడు కూడా మేం చెప్పినట్లు ఇంటడు.గస్మంటిది కాళీ బిచ్చపోనివి…నాకే ఎదురు చెప్తావ్ రా….? నా కొండె.! అవుర….ఏంది నీ బొచ్చెల….? ఏదో పార్శిల్ తెచ్చుకున్నవ్. బిచ్చగాన్ని అంటున్నవ్. బిర్యానీ సెంటర్ కెళ్లి పార్శిల్ ఎట్ల తెచ్చుకున్నవ్ రా….? అంటే మా గుడి దగ్గర అడుక్కోని మస్తు పైసలు కమాయిస్తున్నవన్న మాట.?…..ఆరా తీసిండు గడ్డం నాయకుడు.
” అయ్యా…మూడు రోజులైంది నాయనా అన్నం తిని….ఇప్పుడే అక్కడ ఓ పొట్లాం దొరికితే తెచ్చుకుని తింటున్న.”
” అబే సాలే…నువ్వు ఏం పార్శిల్ తింటున్నవ్ ఎరికేనారా.? బీఫ్ బిర్యానీ. అంటే గొడ్డు కూర. అదీ గుడి దగ్గర కూచొని. ఎంత ధైర్యంరా నీకు బేవకూఫ్.,?”
” అయ్యా తప్పయిందయ్యా…నీళ్లు తాగుదామని గుడి దగ్గరికి వచ్చిన. ఐనా నేను గుడి బయటే కూచొని తింటున్నాను కదా సామే…?”
” అరే సాలే. నేను చెప్పేది బీఫ్ గురించి. నువ్వు గొడ్డు కూర తినొద్దనిరా….నా కొడుకా.”
” సామే. నీకు దండం పెడత. మూడు రోజుల్నించీ తిండిలేదు. ఏదో నాకింత కూడు దొరికింది. ..అది ఏందో కూడా నాకు తెలవదు.ఏదో కడుపు నింపుకోవడానికి దొరికింది నేను తింటున్న. అంతే. ”
” అరే నీచ్ కమీనే కుత్తే… నీ ఇష్టమొచ్చింది…నువ్వు ఎట్ల తింటవురా.? ఈ దేశంలో ఉండాలంటే మేం చెప్పిందే తినాలే.
నీకు తినడానికి గొడ్డుకూరే దొరికినాదిరా. మేకను తిను. గొర్రెను తిను. కానీ గొడ్డును మాత్రం తినకు. ” అంటూ అసలు రహస్యం తేల్చి చెప్పిండు గడ్డం నాయకుడు.
” అదెట్టా సామే… నాకు ఏది దొరికితే అంది తింటున్న. అయినా నేను రోజూ గొడ్డునే తినను బాబయ్యా. గోంగూర తింటా…గొడ్డు కూరా తింటా. బలుసాకు తింటా…బర్రె కూరా తింటా. అంతే. ఏది దొరికితే అదే తింట….” బిచ్చగాని సమాధానానికి గడ్డం లీడర్ కి కోపం పెరిగింది.
” అరే అట్ల అంటే నడవదు. ఈ దేశంల ఉండాలంటే ఏ ఒక్క నా కొడుకూ గొడ్డు కూర తినకూడదు. అవురా..! నీ పేరు ఏంపేర్రా….? ”
” నాకో పేరు…. ఊరు లేదు సామీ. ఏదో ఆ ఊరూ..ఈ ఊరూ తిరిగే బుట్టా ఫకీర్ గాన్ని.”
” ఫకీర్ వా. …ఫకీర్ అంటే…తురకనోవి…!అంటే ముస్లింవి.!! అంటే ఉగ్రవాదివి,పాకిస్తాన్ ఏజెంటువన్నమాట…!!!”
” చూడు సామే…నువ్వేమంటున్నావో నాకు తెలీదు. మూడురోజులైంది అన్నం తిని…” బిచ్చగాడు ముద్ద నోట్లో పెట్టుకోబోయాడు.
” వద్దని చెప్పినంక కూడా తింటవురా దొంగ నా కొడుకా“…. అంటూ గడ్డం నాయకుడు ఒక్క తన్ను తన్నడంతో…బిచ్చగాడు బొక్క బోర్లా పడ్డాడు. సత్తు గిన్నె దూరంగా పడిపోయింది. ఈ గొడవకు చుట్టుపట్టు ఉన్న భక్తులు కూడా అక్కడకి వచ్చారు.
” అరే ఏమైందన్నా…? ” అనుకుంట గడ్డం నాయకుని అనుచర గణం కూడా అక్కడకి చేరుకుంది. వాళ్లు గడ్డం నాయకుని అనుచరులే అని ఎలా చెప్పొచ్చంటే…తమ నాయకునికి ఉన్నట్లే వాళ్లందరికి పెద్ద పెద్ద గడ్డాలున్నాయి.అచ్చం నాయకునిలాగే పెద్ద పెద్ద ఎర్రని బొట్లు పెట్టుకున్నారు. వాళ్లందరి కట్టూ,బొట్టూ ఒకే తీరుగా ఉంది.
” అరే వీడు గొడ్డు కూర తింటున్నడురా…ఎంత ధైర్యం….?” ఆవేశంగా చెప్పిండు లీడర్.
” గొడ్డు కూర తినడానికి ధైర్నమెందుకు సామె…? ఆకలైతే సాలదా..? ఐనా మీరు అడ్డుకోవాలంటే ఆ గొడ్డు కూరతో కోట్ల రూపాయల యాపారం చేసే వాళ్లను అడ్డుకోండి. ఆకలికి కడుపు నింపుకుంటున్న నన్ను అడ్డుకుంటే ఏ లాభం…?
బిచ్చగాని ప్రశ్నకు వాళ్లకు దిమ్మ దిరిగినట్లైంది. పౌరుషం పొడుచుకొచ్చింది.
” ఏమ్రా…? అన్న గొడ్డుకూర తినొద్దురా అని చెబితే…. తినొద్దు అంతే…! నువ్ వకీల్ లాగా వాదన చేస్తున్నవేమ్రా…?
గొడ్డు కూర తినాలంటే ఇండియాల ఉండొద్దు. పాకిస్తాన్ పో. పోయి అక్కడ తిను.”ఓ చోటా నేత గద్దించిండు.
” ఛీ…ఛీ ముష్టి వెధవ. నీకు తినడానికి అదే దొరికిందా. ఏ ఇంటి ముందైనా ఇంత అన్నం అడొక్కొని తిని చావచ్చు కదా…!?” ఒక పరమ పవిత్ర భక్తురాలు శాపనార్థాలు పెట్టింది.
” అలాగే తినేవాన్నమ్మా…పొద్దున మీ ఇంటి ముందే గంట సేపు మొత్తుకున్నపుడు అన్నం కాదు కదా..పాచి ముద్ద కూడా చిప్పలో వేయలేదు నువ్వు..” అని గట్టిగా అరవాలనిపించినా బిచ్చగాడు మాటరాక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.
వీళ్లతో వాదన కాదు ముఖ్యం. ” మంట…ఆకలి మంట. అది సల్లారాలంటే ఒక ముద్ద కడుపులో పడాలె.,” అనుకొని వాళ్ల మాటలు పట్టించుకోకుండా బిచ్చగాడు దూరంగా పడిపోయిన సత్తు పళ్లెం…బిర్యానీ పొట్లం తీసుకోబోయాడు.
” ఐనా గొడ్డు కూర తినే మందం వెధవలకు మాటలతో చెబితే అర్థమవుతుందా.. ?వాళ్ల మెదడు మొద్దు బారి ఉంటుంది.నాలుగు తన్నండి. అప్పుడు కానీ బుద్ధి రాదు.” వెనకాల నుంచి మరో పవిత్రునికి కోపం కట్టలు తెంచుకుంది.
ఇలా తన అనుచరులు తలా ఓ మాటతో మద్దతు ప్రకటించడంతో పెద్ద గడ్డం నాయకునికి బలం పెరిగినట్లైంది.
” తాను ఈ ఊరి మొత్తానికి పెద్ద లీడర్. నేను ఒక్క పిలుపు ఇచ్చానంటే….నా గ్యాంగ్ మొత్తం.. దేనికైనా సై అంటుంది. గుడి కట్టమంటే కడుతుంది. మందిరం కూల్చమంటే కూల్చుతుంది. ఎవడైనా ఎదురు మాట్లాడితే…వాడి అంతు చూడండిరా అంటే చాలు. పెట్రోలు పోసి కాల్చి పారేస్తారు.
అలాంటిది గొడ్డు కూర తినొద్దురా అని చెప్పిన తర్వాత కూడా…. ఆఫ్టరాల్ ఓ బిచ్చగాడు నా మాట వినకపోవడమా…? ఆఖరికి ఓ బిచ్చగాడే నా మాట వినలేదంటే…రేపు జనం నన్ను లెక్క చేస్తారా…? నాకు భయపడతారా…? ఇక లాభం లేదు. వీడ్ని చంపేయాల్సిందే” …. అనుకుంటూ బిర్యానీ పొట్లం కోసం వంగిన బిచ్చగాన్ని పరిగెత్తుకొచ్చి వెనకాల నుంచి వచ్చి బలంగా తన్నాడు. ఆ దెబ్బకు వాడు బొక్కా బోర్లా పడ్డాడు. బిచ్చగాని ముక్కు బండరాయికి బలంగా తగిలింది. నోట్లోంచి రక్తం కారుతోంది. చేతకాని శరీరం. ఓ వైపు ఆకలి. కడుపులో పేగులు మంటలో వేసినట్లు భగభగ కాలిపోతున్నాయ్.. దొరక్క దొరక్క దొరికిన తిండి నేలపాలు చేయడంతో కట్ట తెగిన చెరువులా బిచ్చగానిలో ఒక్కసారిగా తెగింపు పుట్టుకొచ్చింది. పౌరుషం పొంగుకొచ్చింది. నడవడానికి కూడా ఓపిక లేదు.ఐనా ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకున్నాడు…..
ఇష్టం వచ్చినట్లు కడుపులో తంతున్న గడ్డం నాయకుని తలపై…..తన చేతి కర్రతో గాట్టిగా కొట్టాడు. అంతే ఒక్క దెబ్బకే గడ్డం నాయకుని తల కొబ్బరికాయలా పగిలింది. ఆ దెబ్బకు వాడు కుప్పకూలాడు. నెత్తురు…ఎర్రెర్రని నెత్తురు.ఒక్కసారిగా బయటకు చిమ్మింది. అక్కడంతా రక్తమయంగా మారింది.
” రేయ్..రండిరా..” ఏదో ఆవేశం పూనిన వాడిలా… పిశాచం పట్టిన వాడిలా బిచ్చగాడు మొత్తుకుంటున్నాడు. చేతి కట్టెతో నేలమీద గట్టిగా కొడుతున్నాడు. ఆ హఠాత్ సంఘటనకు…బిచ్చగాడి అరుపులకు భయపడ్డ చెంచాగాళ్లంతా తలో దిక్కుకు పారిపోయారు. అప్పటి దాకా జరుగుతుంది చూస్తున్న జనం…అంతకన్నా ముందే మాయమయ్యారు.
” నా కొడకల్లారా… మూడు దినాల నుంచి తిండి లేదు. బుక్కెడు బువ్వ పెట్టండి సామీ…. అని ఊరంతా తిరిగినా ఏనా కొడుకూ కనికరం చూపలేదు. నాకు ఒక్క ముద్ద పెట్టని కొడుకులకి…నాకు దొరికింది నేను తింటుంటే… తినొద్దని చెప్పే అధికారం, హక్కు ఎవడిచ్చాడ్రా….?” బిచ్చగాని ప్రశ్న ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.
ముక్కులోంచి, నోట్లోంచి కారుతున్న రక్తాన్ని పంచెకు తుడుచుకున్నాడు. తన గొడ్డుకూర పలావు పొట్లం, సత్తుపల్లెం తీసుకుని అక్కన్నుంచి మెల్లగా చీకట్లోకి వెళ్లిపోయాడు. వాడు పోతోంది చీకట్లోనే ఐనా…. వెలుతురు మాత్రం వాడితో పాటే కదులుతోంది.
No comments:
Post a Comment