Tuesday, 21 June 2016

గుప్పెడు మెతుకులు



అదో వూరు….
పల్లెకు ఎక్కువ….పట్టణానికి తక్కువఆ ఊల్లో శిథిలమై పోయిన ఓ బస్టాపువీధి కుక్కలకు ఆవాసమైన ఆ బస్టాపులో రెండు రోజులుగా కదలకుండా పడిపోయాడు ఆ బిచ్చగాడు.
అప్పుడే తెల్లవారిందిలేత ఎండ వేడికి వాని వంట్లో చురుకు పుట్టిందిమెల్లగా కన్ను తెరిచి చూశాడు.ఆకాశం ఆ బిచ్చగాని చిప్పలాగే బోసిపోయి ఉంది.మెరిసే సూరీడు వాడి కంటికి.. తన సత్తుగిన్నెలో పడే ఎర్ర కారం ముద్దలాగే కనిపించాడుమూడు రోజులుగా ఒళ్లు కాలిపోయే జ్వరందేహం స్వాధీనంలో లేదునాలుగు మెతుకులు బిచ్చమెత్తుకుందామనుకున్నా…. లేవలేక అలాగే ఉండిపోయాడుఇవాళ ఎలాగైనా ఒక ముద్ద తినాలనుకుని మెల్లగా పైకి లేశాడు.చేతి కర్ర కోసం వెతికాడుదాన్ని దొరకబుచ్చుకుని మెల్లగా పైకి లేచాడుతన ఏకైక ఆస్తి సత్తుగిన్నె కోసం అటూ ఇటూ చూశాడుఏ వీధికుక్కో అన్నం వాసనకు పళ్లెం దూరంగా లాక్కెళ్లినట్టుందిదూరంగా మట్టిలో పడిపోయి ఉంది.
వాడిదీ వూరు కాదుఆ మాటకొస్తే వాడికసలు ఏవూరూ లేదుఒక ఊరు నుంచి మరో ఊరు తిరుగుతూ బిచ్చమెత్తు కుంటాడు.అలా ఊళ్లు తిరుగుతూ,తిరుగుతూ…. రెండు రోజుల కింద ఈ ఊరు చేరుకున్నాడువచ్చిన రోజు రాత్రే ఆరోగ్యం బాగాలేక పడిపోయాడువాన్ని పట్టించుకున్న నాథుడు లేడు వీధి కుక్కలుఈగలు తప్ప.
అనేక సొట్లు పడిపోయి….దుమ్ము కొట్టుకుపోయిన సత్తు పళ్లాన్ని తీసుకున్నాడు.ఇయ్యాల ఎలాగైనా ఒక్క ముద్ద బువ్వ దొరికితే బాగుండనుకున్నాడు.
ఆకలి….ఆకలి కడుపులో మంటభరించలేని మంట.
ఒక్క ముద్ద కడుపులో పడితే కానీ మంట చల్లారదు.
కానీ నడిచేందుకు ఓపిక రావడం లేదుఒంట్లో శక్తినంతా కూడదీసుకున్నాడు.వాడికి ఒక కాలు కాస్త వంకరగా ఉందిమెల్లగా కుంటుకుంటూ దగ్గరలోని ఓ ఇంటి ముందుకు చేరుకున్నాడు.
ఎవరు ఒప్పుకున్నా..ఒప్పుకోకున్నా అన్ని విద్యల్లోకి… బువ్వ సంపాదించడమే గొప్ప విద్య.
ఆ బిచ్చగాడికి తెలిసింది కూడా ఆ ఒక్క విద్యే.
అమ్మా….నీకు దండం పెడతాను తల్లే… కాసింత బువ్వుంటే ఎయ్యమ్మా
తల్లే…..మూడు రోజులైందమ్మా బువ్వతిని….ఒక్క ముద్దుంటే ఎయ్యమ్మా…”
వాడి అసహ్యకరమైన ఆకలి కేకలు పరమపవిత్రమైన ఆ ఇంటి వాతావరణాన్ని భంగపరిచినట్టున్నాయి.!
” పొద్దున్నే తగలడ్డాడు…..వెధవ ముష్టివాడునీకు ఈ ఊళ్లో ఏ ఇళ్లు దొరకలేదట్రా వెధవ్వా… వెళ్లు.”
” అమ్మా బుువ్వ తిని….”
” పో బయటకు తగలడునువ్వునీ అవతారంపో…..”
ఇక లాభం లేదనుకుని మరో ఇంటి ముందుకు చేరుకున్నాడు
” అమ్మా…..మూడు రోజులైంది తల్లీబువ్వ తినిఒక ముద్దుంటే ఎయ్యమ్మా….నీకు దండం పెడతాను తల్లే…”
” ఒరేయ్ దిక్కుమాలిన వెధవపొద్దున్నే నీ దరిద్రపు మొహం చూశానుఏం ప్రమాదం జరుగుతుందో ఏమో…? బయటకు తగలడురా అంట్ల వెధవ.”
కాళ్లీడ్చుకుంటూ ఇంకో ఇంటి ముందుకు వచ్చాడు.
” అయ్యా మూడురోజులైందయ్యా అన్నం తిని. …”
” అరే సాలేఎవడ్రా నువ్వుపొద్గాల పొద్గాల….ఇంటి ముందుకొచ్చి లొల్లి చేస్తున్నవ్నీ తల్లీ… చల్ బే చల్….”
ఇంకో ఇంటి ముందు ఎంత మొత్తుకున్నా స్పందన లేదుఈ సారి కనీసం తిట్లైనా రాలేదు.
అరిచి అరిచీ గొంతు పోయింది తప్ప లాభం లేదుఇంక నడిచే ఓపిక లేదు.
ఆకలిఆకలి….మంట..కడుపులో మంట
పేగులు కోస్తున్నట్లు భరించలేని బాధ.
ఒక్క ముద్దఒకే ఒక్క ముద్ద…. కడుపులో పడితే బాగుండు.
నడిచే ఓపిక లేక దూరంగా ఓ చెట్టు కనిపిస్తే దానికింద కూలబడ్డాడుఓ వైపు ఆకలిమరోవైపు చేతకావట్లేదుఎవరైనా ఒక ముద్దవేస్తే బాగుండని ఆశగా ఎదురు చూశాయి అతడి కళ్లుఅలా ఎదురు చూస్తూనే ఉన్నాడుఅలా ఎదురు చూసీ చూసీ కళ్లు మూతపడ్డాయి.
***
మెల్లగా ఏదో మైకు శబ్దం వినిపించిందిఆ చప్పుడుకు బిచ్చగానికి మెలకువ వచ్చిందికళ్లు తెరిచి చూశాడుశక్తి కూడదీసుకుని పైకి లేచాడుఅక్కడ ఏదో సభకు సంబంధించిన ప్రచారం జరుగుతున్నట్టుందిఓ జీపులో కొంత మంది వచ్చారుజీపుకు ముందు వెనకాల మైకులుజెండాలు కూడా కట్టారు.జనాలు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు.
అక్కడేమైనా దొరుకుతుందేమోనని ఆశగా బిచ్చగాడు మెల్లగా అక్కడికి కదిలాడు.ఒకాయన జీపు పైకి ఎక్కి మాట్లాడుతున్నాడుఅతనికి బాగా గడ్డం పెరిగిందిపేద్ద బొట్టు కూడా పెట్టుకున్నాడు.
సోదర సోదరీమణులారా…..మన సంస్కృతికి భయంకర ప్రమాదం పొంచి ఉందికాశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా మన మీద దాడి జరుగుతోందిఅందుకే మనమంతా ఏకం కావాలిలేదంటే విదేశీ శక్తులు మనల్ని ఆక్రమిస్తాయి.మతోన్మాద శక్తులు మన పుణ్యభూమిని పరాయిదేశంలా మారుస్తాయిఅప్పుడు మనమంతాబానిసల్లాగా బతకాల్సి వస్తుంది….” ఆవేశంగా మాట్లాడుతున్నాడు.
ఆ గడ్డం పెంచుకున్నాయన ఏం మాట్లాడుతున్నాడో బిచ్చగాడికి ఒక్క ముక్కా అర్థం కావడం లేదువాడికి కావాల్సింది ఒక్క ముద్ద బువ్వ లేదా ఒక్క రూపాయి బిళ్లమెల్లగా ఓ గుంపు దగ్గరికి వెళ్లి అడిగాడు.
మైకులో అక్కడ గడ్డం నాయకుడు స్వరం పెంచి మాట్లాడుతున్నాడు.
” సోదరులారామనది ఎంతో సంపన్న దేశం….”
” మూడురోజులైంది బాబూ అన్నం తిని… ఒక్క రూపాయి దరమం చేయి బాబూ……” బిచ్చగాడూ దీనంగా వేడుకుంటున్నాడు.
” సోదరులారా మనది ఎంతో విశిష్ట సంస్కృతిఘనమైన వారసత్వం గల దేశం మనది.”
” సచ్చి మీ కడుపున పుడతాను బాబూఒక్క రూపాయి ధర్మ చేయండి బాబూ…”
” ఎంతో సహనశీలత గల దేశం మనది….”
” ఏరా దొంగ నా కొడుకాఅడుక్కోవడానికి నీకు ఈ మీటింగే కనపడిందాపో బేపో సాలెఛల్
ఎవరో బలంగా నెట్టేయడంతో బిచ్చగాడు కిందపడిపోయాడు.
గడ్డం నాయకుడు చెపుతూనే ఉన్నాడు. ” ఇంతటి మన సంస్కృతికి ఆపదవచ్చిందిరేపు జరిగే సమావేశానికి పై దేశం నుంచి గొప్ప స్వామీజీ వస్తున్నారుకాబట్టి అందరూ తరలిరండి….దేశాన్ని కాపాడటానికి సిద్ధం కండి…..” అంటూ పిలుపునిచ్చాడు.కాసేపటికి ఆ జీపు అక్కన్నుంచి వెళ్లిపోయింది.
జనం కూడా రేపు ఆ సమావేశానికి వెళ్లి….దేశాన్ని ఆపదనుంచి కాపాడేందుకు సిద్దం కావాలని మనసులో తీర్మానించుకున్నారుకానీ ఇవాళ్టికి మాత్రం ఎవరిపని వాళ్లు చూసుకుందాం అనుకుని వెళ్లిపోయారు.
ఊరంతా తిరిగినా ఎక్కడా ముద్ద బువ్వకానీఒక్క రూపాయి కానీ పుట్టక పోవడంతో బిచ్చగాడికి నీరసం వచ్చిందిచివరకు ఓ పాత గుడి కనపడితే దాని ముందు కూలబడ్డాడుసూరీడు కూడా పగలంతా తిరిగి తిరిగీ అలిసిపోయి….పాతగుడి లాంటి పడమట దిక్కులోకి జారిపోయాడు.
” సామే….మూడు రోజులనుంచీ ముద్ద పుట్టలేదు సామే….దయుంచి ఒక ముద్ద బువ్వో….పది రూపాయలు దొరికేలా చెయ్యి సామే…” దేవున్ని వేడుకున్నాడు.
మెల్లగా చీకట్లు ముసురుకున్నాయ్భక్తులు వస్తున్నారు….పోతున్నారు ఒక్కరూ వాని పళ్లెంలో రూపాయి వెయ్యలేదు.బిచ్చగానికి ఇవాళ కూడా ఓ ముద్ద దొరికేదారి కనపడడం లేదుఇంతలో దూరంగా ఏదో అలికిడైతే మెల్లగా అటు వేపు వెళ్లి చూశాడుఅది పాతకాలపు గుడి కావడంతో పెద్దగా భక్తుల సంచారం లేదుగుడికి దూరంగా పిచ్చి చెట్ల పొదలున్నాయిఆ చెట్ల చాటున ఎవరో తాగుబోతుల గుంపు ఏదో పార్టీ చేసుకుంటున్నారు.
” అయ్యా దండం పెడతాఒక రూపాయి దరమం చెయ్యండి సామే…” దీనంగా వేడుకున్నాడు.
” అరె ఎవడ్రా బే.? మేం పుల్ ఖుషీగా దావత్ చేసుకుంటుంటేఎవడ్రా నువ్ బేవకూఫ్ఛల్ దూరంగా పో. ”
” మూడు రోజులైంది సామీ అన్నం తినిఒక్క రూపాయ దరమం చేయండి పున్నెం ఉంటాది.”
” మేం కూడా మందు దాగి పది రోజులైంది…..హ హ్హ హ్హ….” తాగుబోతులంతా పడీపడీ నవ్వుకున్నారు.
అట్ల చాలా సేపు వాళ్లు తాగీతాగీ….తెచ్చుకున్న పొట్లాలు తిని వెళ్లిపోయారు.వాళ్లు వెళ్లిపోయాక బిచ్చగాడు మెల్లగా అక్కడికి వెళ్లాడుఏమైనా దొరుకుతుందేమో అని ఆశగా వెతికాడుఖాళీ మందు సీసాలునీళ్ల పాకెట్లు.చివరికి సగం తిని వదిలేసిన ఒక పొట్లం కనపడిందితెరిచి చూశాడు.
వాసనకమ్మని వాసనపలావు వాసనఅన్నం మెతుకులు చూడడంతో బిచ్చగానికి మళ్లీ ప్రాణం లేచి వచ్చినట్లైంది.
ఆ చీకటిలోంచి బయటకొచ్చి గుడి దీపాల వెలుగు దగ్గరకు వచ్చాడుగుడి దగ్గర కుళాయి కనిపించిందికాళ్లూచేతులూ
సత్తు గిన్నె తేటగా కడుక్కున్నాడుకాసిన్ని నీళ్లు తాగాడుగుడి బయటకు వచ్చి మెల్లగా పొట్లం విప్పాడు.
దేవుడా… నీ గుడి దగ్గరకు రాగానే ఇంత ముద్ద దొరికిందిదండాలు సామే.”అనుకుంట ఆబగా ముద్ద నోటిలో పెట్టుకోబోయాడు.
అంతలోనే ఎక్కణ్నుంచి వచ్చాడో గడ్డం నాయకుడు అక్కడకు వచ్చాడుపొద్దున జీపు మీద పెద్ద ప్రసంగం ఇచ్చిన గడ్డం నాయకుడేపెద్ద బొట్టు పెట్టుకుని ఉన్నాడుచూస్తేనే భయపడేలా ఉన్నాడు.
” అరే సాలే….ఎవడ్రా నువ్నిన్నెపుడు ఈ గుడి దగ్గర చూడలే. ?” బిచ్చగాన్ని గద్దించిండు.
” అయ్యాబిచ్చగాన్ని సామీ…?”
” అది కాదుర మాత్తర్ చో…. ఎవ్వన్నడిగి ఈ గుడిలెకి వచ్చినవ్. ”
” అయ్యా తప్పయిందయ్యానేనేం గుడి లోపటికి రాలేదయ్యానీళ్లు తాగటానికి ఈ పంపు దగ్గరకి వచ్చిన… అయినా నీళ్లు దాగటానికి కూడా ఎవుర్నో అడగాలా సామీ…”
” ఈ గుడి నీ తాతదన్నుకున్నవారా బట్టెబాజ్. ? ఈ గుడి కట్టిందే మేముఈ గుడిలె దేవుడు కూడా మేం చెప్పినట్లు ఇంటడు.గస్మంటిది కాళీ బిచ్చపోనివినాకే ఎదురు చెప్తావ్ రా….? నా కొండె.! అవుర….ఏంది నీ బొచ్చెల….? ఏదో పార్శిల్ తెచ్చుకున్నవ్బిచ్చగాన్ని అంటున్నవ్బిర్యానీ సెంటర్ కెళ్లి పార్శిల్ ఎట్ల తెచ్చుకున్నవ్ రా….? అంటే మా గుడి దగ్గర అడుక్కోని మస్తు పైసలు కమాయిస్తున్నవన్న మాట.?…..ఆరా తీసిండు గడ్డం నాయకుడు.
” అయ్యామూడు రోజులైంది నాయనా అన్నం తిని….ఇప్పుడే అక్కడ ఓ పొట్లాం దొరికితే తెచ్చుకుని తింటున్న.”
” అబే సాలేనువ్వు ఏం పార్శిల్ తింటున్నవ్ ఎరికేనారా.? బీఫ్ బిర్యానీఅంటే గొడ్డు కూరఅదీ గుడి దగ్గర కూచొనిఎంత ధైర్యంరా నీకు బేవకూఫ్.,?”
” అయ్యా తప్పయిందయ్యానీళ్లు తాగుదామని గుడి దగ్గరికి వచ్చినఐనా నేను గుడి బయటే కూచొని తింటున్నాను కదా సామే…?”
” అరే సాలేనేను చెప్పేది బీఫ్ గురించినువ్వు గొడ్డు కూర తినొద్దనిరా….నా కొడుకా.”
” సామేనీకు దండం పెడతమూడు రోజుల్నించీ తిండిలేదుఏదో నాకింత కూడు దొరికింది. ..అది ఏందో కూడా నాకు తెలవదు.ఏదో కడుపు నింపుకోవడానికి దొరికింది నేను తింటున్నఅంతే. ”
” అరే నీచ్ కమీనే కుత్తే… నీ ఇష్టమొచ్చిందినువ్వు ఎట్ల తింటవురా.? ఈ దేశంలో ఉండాలంటే మేం చెప్పిందే తినాలే.
నీకు తినడానికి గొడ్డుకూరే దొరికినాదిరామేకను తినుగొర్రెను తినుకానీ గొడ్డును మాత్రం తినకు. ” అంటూ అసలు రహస్యం తేల్చి చెప్పిండు గడ్డం నాయకుడు.
” అదెట్టా సామే… నాకు ఏది దొరికితే అంది తింటున్నఅయినా నేను రోజూ గొడ్డునే తినను బాబయ్యాగోంగూర తింటాగొడ్డు కూరా తింటాబలుసాకు తింటాబర్రె కూరా తింటాఅంతేఏది దొరికితే అదే తింట….” బిచ్చగాని సమాధానానికి గడ్డం లీడర్ కి కోపం పెరిగింది.
” అరే అట్ల అంటే నడవదుఈ దేశంల ఉండాలంటే ఏ ఒక్క నా కొడుకూ గొడ్డు కూర తినకూడదుఅవురా..! నీ పేరు ఏంపేర్రా….? ”
” నాకో పేరు…. ఊరు లేదు సామీఏదో ఆ ఊరూ..ఈ ఊరూ తిరిగే బుట్టా ఫకీర్ గాన్ని.”
” ఫకీర్ వా. …ఫకీర్ అంటేతురకనోవి…!అంటే ముస్లింవి.!! అంటే ఉగ్రవాదివి,పాకిస్తాన్ ఏజెంటువన్నమాట…!!!”
” చూడు సామేనువ్వేమంటున్నావో నాకు తెలీదుమూడురోజులైంది అన్నం తిని…” బిచ్చగాడు ముద్ద నోట్లో పెట్టుకోబోయాడు.
” వద్దని చెప్పినంక కూడా తింటవురా దొంగ నా కొడుకా“…. అంటూ గడ్డం నాయకుడు ఒక్క తన్ను తన్నడంతోబిచ్చగాడు బొక్క బోర్లా పడ్డాడుసత్తు గిన్నె దూరంగా పడిపోయిందిఈ గొడవకు చుట్టుపట్టు ఉన్న భక్తులు కూడా అక్కడకి వచ్చారు.
” అరే ఏమైందన్నా…? ” అనుకుంట గడ్డం నాయకుని అనుచర గణం కూడా అక్కడకి చేరుకుందివాళ్లు గడ్డం నాయకుని అనుచరులే అని ఎలా చెప్పొచ్చంటేతమ నాయకునికి ఉన్నట్లే వాళ్లందరికి పెద్ద పెద్ద గడ్డాలున్నాయి.అచ్చం నాయకునిలాగే పెద్ద పెద్ద ఎర్రని బొట్లు పెట్టుకున్నారువా‌ళ్లందరి కట్టూ,బొట్టూ ఒకే తీరుగా ఉంది.
” అరే వీడు గొడ్డు కూర తింటున్నడురాఎంత ధైర్యం….?” ఆవేశంగా చెప్పిండు లీడర్.
” గొడ్డు కూర తినడానికి ధైర్నమెందుకు సామె…? ఆకలైతే సాలదా..? ఐనా మీరు అడ్డుకోవాలంటే ఆ గొడ్డు కూరతో కోట్ల రూపాయల యాపారం చేసే వాళ్లను అడ్డుకోండిఆకలికి కడుపు నింపుకుంటున్న నన్ను అడ్డుకుంటే ఏ లాభం…?
బిచ్చగాని ప్రశ్నకు వాళ్లకు దిమ్మ దిరిగినట్లైందిపౌరుషం పొడుచుకొచ్చింది.
” ఏమ్రా…? అన్న గొడ్డుకూర తినొద్దురా అని చెబితే…. తినొద్దు అంతే…! నువ్ వకీల్ లాగా వాదన చేస్తున్నవేమ్రా…?
గొడ్డు కూర తినాలంటే ఇండియాల ఉండొద్దుపాకిస్తాన్ పోపోయి అక్కడ తిను.”ఓ చోటా నేత గద్దించిండు.
” ఛీఛీ ముష్టి వెధవనీకు తినడానికి అదే దొరికిందాఏ ఇంటి ముందైనా ఇంత అన్నం అడొక్కొని తిని చావచ్చు కదా…!?” ఒక పరమ పవిత్ర భక్తురాలు శాపనార్థాలు పెట్టింది.
” అలాగే తినేవాన్నమ్మాపొద్దున మీ ఇంటి ముందే గంట సేపు మొత్తుకున్నపుడు అన్నం కాదు కదా..పాచి ముద్ద కూడా చిప్పలో వేయలేదు నువ్వు..” అని గట్టిగా అరవాలనిపించినా బిచ్చగాడు మాటరాక మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.
వీళ్లతో వాదన కాదు ముఖ్యం. ” మంటఆకలి మంటఅది సల్లారాలంటే ఒక ముద్ద కడుపులో పడాలె.,” అనుకొని వాళ్ల మాటలు పట్టించుకోకుండా బిచ్చగాడు దూరంగా పడిపోయిన సత్తు పళ్లెంబిర్యానీ పొట్లం తీసుకోబోయాడు.
” ఐనా గొడ్డు కూర తినే మందం వెధవలకు మాటలతో చెబితే అర్థమవుతుందా.. ?వాళ్ల మెదడు మొద్దు బారి ఉంటుంది.నాలుగు తన్నండిఅప్పుడు కానీ బుద్ధి రాదు.” వెనకాల నుంచి మరో పవిత్రునికి కోపం కట్టలు తెంచుకుంది.
ఇలా తన అనుచరులు తలా ఓ మాటతో మద్దతు ప్రకటించడంతో పెద్ద గడ్డం నాయకునికి బలం పెరిగినట్లైంది.
” తాను ఈ ఊరి మొత్తానికి పెద్ద లీడర్నేను ఒక్క పిలుపు ఇచ్చానంటే….నా గ్యాంగ్ మొత్తం.. దేనికైనా సై అంటుందిగుడి కట్టమంటే కడుతుందిమందిరం కూల్చమంటే కూల్చుతుందిఎవడైనా ఎదురు మాట్లాడితేవాడి అంతు చూడండిరా అంటే చాలుపెట్రోలు పోసి కాల్చి పారేస్తారు.
అలాంటిది గొడ్డు కూర తినొద్దురా అని చెప్పిన తర్వాత కూడా…. ఆఫ్టరాల్ ఓ బిచ్చగాడు నా మాట వినకపోవడమా…? ఆఖరికి ఓ బిచ్చగాడే నా మాట వినలేదంటేరేపు జనం నన్ను లెక్క చేస్తారా…? నాకు భయపడతారా…? ఇక లాభం లేదువీడ్ని చంపేయాల్సిందే” …. అనుకుంటూ బిర్యానీ పొట్లం కోసం వంగిన బిచ్చగాన్ని పరిగెత్తుకొచ్చి వెనకాల నుంచి వచ్చి బలంగా తన్నాడుఆ దెబ్బకు వాడు బొక్కా బోర్లా పడ్డాడుబిచ్చగాని ముక్కు బండరాయికి బలంగా తగిలిందినోట్లోంచి రక్తం కారుతోందిచేతకాని శరీరంఓ వైపు ఆకలికడుపులో పేగులు మంటలో వేసినట్లు భగభగ కాలిపోతున్నాయ్.. దొరక్క దొరక్క దొరికిన తిండి నేలపాలు చేయడంతో కట్ట తెగిన చెరువులా బిచ్చగానిలో ఒక్కసారిగా తెగింపు పుట్టుకొచ్చిందిపౌరుషం పొంగుకొచ్చిందినడవడానికి కూడా ఓపిక లేదు.ఐనా ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకున్నాడు…..
ఇష్టం వచ్చినట్లు కడుపులో తంతున్న గడ్డం నాయకుని తలపై…..తన చేతి కర్రతో గాట్టిగా కొట్టాడుఅంతే ఒక్క దెబ్బకే గడ్డం నాయకుని తల కొబ్బరికాయలా పగిలిందిఆ దెబ్బకు వాడు కుప్పకూలాడునెత్తురుఎర్రెర్రని నెత్తురు.ఒక్కసారిగా బయటకు చిమ్మిందిఅక్కడంతా రక్తమయంగా మారింది.
” రేయ్..రండిరా..” ఏదో ఆవేశం పూనిన వాడిలా… పిశాచం పట్టిన వాడిలా బిచ్చగాడు మొత్తుకుంటున్నాడుచేతి కట్టెతో నేలమీద గట్టిగా కొడుతున్నాడుఆ హఠాత్ సంఘటనకుబిచ్చగాడి అరుపులకు భయపడ్డ చెంచాగాళ్లంతా తలో దిక్కుకు పారిపోయారుఅప్పటి దాకా జరుగుతుంది చూస్తున్న జనంఅంతకన్నా ముందే మాయమయ్యారు.
” నా కొడకల్లారా… మూడు దినాల నుంచి తిండి లేదుబుక్కెడు బువ్వ పెట్టండి సామీ…. అని ఊరంతా తిరిగినా ఏనా కొడుకూ కనికరం చూపలేదునాకు ఒక్క ముద్ద పెట్టని కొడుకులకినాకు దొరికింది నేను తింటుంటే… తినొద్దని చెప్పే అధికారంహక్కు ఎవడిచ్చాడ్రా….?” బిచ్చగాని ప్రశ్న ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.
ముక్కులోంచినోట్లోంచి కారుతున్న రక్తాన్ని పంచెకు తుడుచుకున్నాడుతన గొడ్డుకూర పలావు పొట్లంసత్తుపల్లెం తీసుకుని అక్కన్నుంచి మెల్లగా చీకట్లోకి వెళ్లిపోయాడువాడు పోతోంది చీకట్లోనే ఐనా…. వెలుతురు మాత్రం వాడితో పాటే కదులుతోంది.

ఎవరు బాధ్యులు ?



చూరు మీంచి వర్షం ధారగా పడుతోంది. అక్కడే నిలబడి అరచేతులతో ఆ ధారని పైకి కొడుతూ ఆడుతున్నాడు మోహన్.
“వర్షంలో ఆడకు. లోపలికి రారా మోహన్.” అరిచింది తల్లి.
“నేను వర్షంతో ఆడుకుంటున్నా. వర్షంలో కాదు” అన్నాడు మోహన్.
“చెప్పిన మాట ఎప్పుడైనా విన్నావా” అంటూ రెక్క పట్టుకుని లోపలికి లాక్కొచ్చి కంచం ముందు కూర్చోబెట్టి “తిను ..” అంది. అప్పుడే మోహన్ తండ్రి ఇంటికి వస్తూ “ఏరా జేబులో ముప్పై రూపాయలు కనిపించడం లేదు తీసావా?” అనడిగాడు. అలానే తలొంచుకొని తింటున్నాడు ఏమి ఎరగనట్టు.
“నిన్నేరా అడుగుతోంది చెప్పు, తీసావా?” అనడిగింది తల్లి.
“నాకేం తెలియదు” అన్నాడు మోహన్.
“వాడిని అలా అడిగితే ఎందుకు చెప్తాడు.” అంటూ పైన షెడ్ రేకులో ఉన్న బెత్తాన్ని లాగాడు.
“నిజంగా నాకేం తెలియదు నాన్న” అన్నాడు భయంగా.
“తెలియదా?” కోపంగా చూస్తూ అడిగాడు తండ్రి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఇద్దరినీ చూస్తున్న మోహన్ తల్లికి విషయం అర్ధమైంది. మోహన్ తల మీద ఒక మొట్టికాయ మొట్టి “ఏం చేసావ్ రా ముప్ప్పై రూపాయలు?” అనడిగింది మోహన్ని.
“వాడిని అలా అడిగితే ఎందుకు చెప్తాడే,,” అంటూ రెక్క పట్టుకుని పక్కకు లాగాడు. కాళ్ళ మీద బెత్తంతో కొడుతూ “బొమ్మలు చెక్కుతాడంత ఈడు. ఉలి కొన్నాడు. అది వంద రూపాయలు అయితే ముప్పై ఇచ్చి డెబ్బై అరువు పెట్టాడు. ఆ కొట్టు వాడు ఇంటికొస్తుంటే నన్ను అడిగాడు డెబ్బై ఇమ్మని. ఇచ్చాను. దొంగతనం చేయడం కూడా నేర్చుకున్నాడు ఈ ఎదవ ” అంటూ తట్టు తేలేలా కొట్టాడు.
“ఇంకెప్పుడు చేయను నాన్నా, కొట్టకు నాన్నా” అన్నాడు బతిమాలుతూ.
దూరంగా నెట్టేసి “ఇయాల ఈడికి అన్నం పెట్టకు. కడుపు మాడితే తెలుస్తాది ఎదవకి.” అని చెప్పి విరిగిన కర్రను విసిరేసి వెళ్ళిపోయాడు. అక్కడ కర్రతో పాటు మోహన్ మనసు కూడా విరిగిపోయింది.
ఉదయాన్నే మోహన్ అన్నయ్య మురారి వచ్చాడు. వస్తూనే “అమ్మా తమ్ముడేడి?” అడిగేడు బ్యాగ్ కింద దించుతూ. మంచి నీళ్ళు అందించి “వాడేం చేస్తున్నాడో ఏమి అర్ధం కావడం లేదురా మురారి” అంది తల్లి.
“ఏం చేసాడమ్మా?” అనడిగాడు మురారి.
“ఏం చేసాడా! దొంగతనం చేసాడు.” అన్నాడు తండ్రి టిఫిన్ తింటూ.
“ఎక్కడున్నాడు?”
“అదిగో పెరట్లో ఎక్కడో ఉంటాడు. ఏం తినడంట. కోపం వచ్చిందంట నిన్న అన్నం పెట్టకు అన్నాను. ఈరోజు ఎందుకు తెచ్చారు అని పొమ్మన్నాడు. పౌరుషానికేం తక్కువ లేదు ఎదవకి.” అన్నాడు తండ్రి టిఫిన్ తినేసి చేతులు కడుగుకుంటూ.
“ఎందుకు నాన్న వాడిని అలా చేస్తారు” అని తమ్ముడి కోసం పెరట్లోకి వెళ్ళాడు టిఫిన్ ప్లేట్ తీసుకుని.
నూతిలోకి చూస్తూ ఏడుస్తున్నాడు మోహన్. అతని కన్నీరు అందులో పడుతుంటే నీటిలో అలజడి అవుతుంటే చూస్తూ ఉన్నాడు.
“తమ్ముడూ..” పిలిచాడు. వెంటనే వెనక్కి చూసాడు. ఆనందంతో పరిగెత్తికెళ్ళి అన్నయ్యని పట్టుకుని ఏడ్చాడు. “అన్నయ్య నన్ను కొడుతున్నారన్నయ్యా.. చూడు నాన్న ఎలా కొట్టాడో అంటూ కాలు చూపించాడు. నేను ఇక్కడ ఉండను అన్నయ్య. నన్ను నీతో తీసుకెళ్ళిపో అన్నయ్యా , ప్లీజ్ అన్నయ్యా ” అని బతిమాలాడు మోహన్.
“సరే తీసుకెళ్ళిపోతాను. ముందు టిఫిన్ చేయి” అని టిఫిన్ ప్లేట్ ఇచ్చాడు. రాత్రి కూడా ఏమి తినలేదేమో ఆబగా అంతా ఆవురావురు మంటూ తినేసాడు.
కాసేపు అయ్యాక  “చెప్పు ఎందుకు తీసావ్ ముప్పై రూపాయలు?” అనడిగాడు మురారి.
“ఉలి కొన్నాను” అన్నాడు మోహన్ తలొంచుకుని.
“ఎందుకు?” అనడిగాడు మురారి చిరు నవ్వుతో.
“ఎందుకేంటి అన్నయ్యా, మొన్న మనూరి శివుడి గుడికెళ్ళాను. అక్కడ ఎవరో ఫారనర్స్ వచ్చి గుడి మీద చెక్కిన బొమ్మలు ఫొటోస్ తీసుకుంటున్నారు. మా సోషల్ సార్ కూడా వచ్చారులే అప్పుడు, ఆయన వాళ్ళకు మన దేశ శిల్ప కళ చాలా గొప్పదని చెప్తున్నారు.. అప్పుడు నేను సార్ ని అడిగాను. నాకేలాగో చెక్క మీద బొమ్మలు చేయడం వచ్చు కదా, అందుకని ఇలా రాళ్ళ మీద ఎలా చేస్తారు అని అడిగాను. ఉలితో అని చెప్పారు. ఉలి ఎలా ఉంటుంది అని అడిగాను. చెప్పారు. మన సాంబడి కొట్లో దొరుకుతుంది అన్నారు. వెంటనే కొనేయాలి అనిపించింది. నా దగ్గర డబ్బులెక్కడివి? అందుకే నాన్న జేబులో తీసాను. నాకేం తెలుసు మిగిలిన డబ్బులు వాడు నాన్నని అడుగుతాడని? నువ్వొచ్చాక నీ దగ్గర తీసుకుని ఇద్దాం అనుకున్నాను.” అని ముగించాడు.
“సరే, బాగుంది. కాని ఈసారి డబ్బులు కావాలంటే నన్ను అడుగు సరేనా. అంతేగాని ఇలా డబ్బులు తీసి తన్నులు తినకు. ” అని చెప్పాడు మురారి.
“సరే అన్నయ్యా” అని మాట ఇచ్చాడు. మురారి హైదరాబాద్ లో ఎం.బి.బి.యస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మోహన్ టెన్త్ పరీక్షలు రాసి రిసల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
నాలుగు రోజులు ఉండి వెళ్ళడానికి సిద్ధ పడ్డాడు మురారి. అన్నయ్య వెళ్ళిపోతున్నాడు అంటే మోహన్ కి అప్పుడే బెంగ పట్టుకుంది. “ఇంకో రెండు రోజులు ఉండు అన్నయ్యా” అనడిగాడు మోహన్.
“నాకు ప్రాక్టికల్స్ ఉన్నాయిరా. వచ్చేస్తాను. వచ్చేవారం నీ రిసల్ట్ రోజు ఇక్కడే ఉంటాను. ఏమన్నా అవసరమైతే ఫోన్ చేయు సరేనా .” అని చెప్పి బయలుదేరాడు మురారి.
మురారి వెళ్ళినప్పటి నుండి మోహన్ అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు. పొద్దున్నే బయటకు పోయి రాత్రికి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు మోహన్ ఎక్కడున్నాడో చూడమని మోహన్ ఫ్రెండ్ రాంబాబుకి చెప్పింది మోహన్ తల్లి. మోహన్ ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఊరవతల కొండ మీద రాయి మీద ఏదో చెక్కుతూ కనిపించాడు మోహన్.
“ఇక్కడేం చేస్తున్నావ్ రా ?” అనడిగాడు రాంబాబు ఆయాస పడుతూ.
“చూడు,” అన్నాడు మోహన్  వెలిగిపోతున్న మొహంతో.
ఆ కొండ మీద ఉన్న ఒక పెద్ద రాయి మీద ఆ ఊరు ఎలా కనిపిస్తోందో చెక్కే పనిలో ఉన్నాడు. ముందుగా సుద్దతో దాని మీద బొమ్మ గీసుకుని చెక్కుతున్నాడు. ఆశ్చర్యంగా చూసాడు రాంబాబు. “ఓడియమ్మ, భలే చెక్కావ్ రా,” అన్నాడు రాంబాబు.
అప్పుడే అక్కడికి వచ్చిన మరో ఫ్రెండ్ గిరి “ఏం చేస్తున్నార్రా ఇక్కడ?” అనడిగాడు.
“చూడరా, మనోడు ఎలా చెక్కాడో.” అని చేయి పెట్టి చూపించాడు రాంబాబు.
“బానే ఉందిరా, రేపు మన రిసల్ట్స్, తేడా వస్తే వాడికి బడిత పూజే” అని అన్నాడు గిరి. మతాబులా వెలిగిపోతున్న మోహన్ ముఖం భయంగా మారిపోయింది.
*             *             *
హాస్టల్ లో మురారిని అతని ఫ్రెండ్ పలకరిస్తూ “రేపే కదా టెన్త్ రిసల్ట్? అన్నట్టు మీ తమ్ముడే టెన్త్ క్లాసే కదా” అనడిగాడు.
“అవును. వాడికి చదువు అంతగా అబ్బలేదు. కాని బొమ్మలు బాగా చెక్కుతాడు. మన ల్యాబ్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవకపోతే ఈరోజే వెళ్ళేవాడిని. కాని రేపు ఎగ్జామ్ అయ్యాక బయలుదేరుతాను. ఇదిగో చూడు వాడు చెక్కిన బొమ్మ” అని ఒక చెక్క బొమ్మను తీసి చూపించాడు మురారి.
“చాలా బాగా చెక్కాడు రా” అని మెచ్చుకున్నాడు అతని ఫ్రెండ్.
“ఓకే. ఒకసారి ఇంటికి ఫోన్ చేస్తాను. ఎందుకైనా మంచిది, తమ్ముడిని కంగారు పడద్దని చెప్తాను.” అని చెప్పి కాల్ చేసాడు.
పెరట్లో ఉన్న మోహన్ ఫోన్ రింగ్ విని అన్నయ్యే అయి ఉంటాడని ఇంటిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంతలో తండ్రి ఫోన్ ఎత్తాడు. “హలో..”
“హలో నాన్నా , నేను మురారి. రేపు సాయంత్రం బయలుదేరి వస్తాను. అదే రేపు తమ్ముడి రిసల్ట్ కదా. వాడితో చెప్దామని చేసాను. తమ్ముడు ఉన్నాడా?” అనడిగాడు మురారి.
“లేడు, బయట ఆడుకుంటున్నాడు అనుకుంట!!” మోహన్ ని చూస్తూనే చెప్పాడు.
“సరే, నేను కాల్ చేసానని చెప్పండి. ఉంటాను .” అని ఫోన్ కట్ చేసాడు. మోహన్ ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉన్నాడు.
“ఏరా రేపు నీ రిసల్ట్ అంట, చెప్పలేదే? పాస్ అవకపోతే చచ్చావన్నమాటే ” అన్నాడు తండ్రి.
“అన్నయ్య ఫోన్ చేస్తే నాకు ఎందుకు ఇవ్వలేదు ” గట్టిగా అరిచాడు మోహన్ .
“ఆడేమైనా నీలా అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతున్నాడా? లేక పిచ్చి బొమ్మలు చేసుకుంటున్నాడా? ఆడు డాక్టర్ ,, నా కొడకు,” గర్వంగా చెప్పుకున్నాడు తండ్రి.
“నేను నీ కొడుకునే ” రోషంగా అన్నాడు మోహన్.
“ఏంటిరా నోరు లెగుత్తాంది?” అనడిగాడు తండ్రి.
“మీరు మాట్లాడించకపోయినా పరవాలేదు. నా దగ్గర డబ్బులున్నాయి. నేనే అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడుతాను” అని చెప్పి ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు. తండ్రి వెనకాలే ఎంత అరిచినా పట్టించుకోకుండా గేటు దాటి వీధిలోకి దారి తీసాడు.
నాలుగు వీధుల తరువాత ఉన్న కాయిన్ బాక్స్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. కాసేపు అక్కడే ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. ఆయన అలానే మాట్లాడుతున్నాడు. షాప్ మూసేసే టైం అయిందని కొట్టు వాడు చెప్పాడు. అది విని ఆ మాట్లాడే ఆయన దగ్గరకు వెళ్లి  “సార్, ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. మా అన్నయ్యకు కాల్ చేసుకుంటాను. ఒక్క నిమిషం మాట్లాడి పెట్టేస్తాను” అని బతిమాలాడు. ఆయన మొహాన్ని పట్టించుకోలేదు. లాభం లేదు.. షాప్ వాడు వచ్చి ఫోన్ వైర్ పీకేసి ఆ పెద్దమనిషిని విసుక్కుంటూ ఫోన్ ని లోపలికి పట్టుకుపోయాడు. చేసేది లేక ఇంటికి పరిగెత్తాడు. ఇంటి దగ్గర తండ్రి “ఏరా ఎక్కడ తిరుగుతున్నావ్? వచ్చి తిను. మీ అన్నయ్య రేపు బయలుదేరి వస్తానని చెప్పమన్నాడు” అని చెప్పాడు. మోహన్ కి అన్నం తినాలనిపించలేదు. ఉదయం ఎలా అయినా అన్నయ్యతో మాట్లాడాలి అని అనుకుంటూ నిద్రపోయాడు. తొమ్మిదింటికి మెలకువ వచ్చింది. గబగబా ముఖం కడుగుకుని వీధిలోకి పరిగెత్తాడు.

అప్పటికే గిరి, రాంబాబులు ఇంటర్నెట్ సెంటర్ కి వచ్చేసారు. ఇంకో అరగంటలో మన జాతకాలురా అన్నాడు గిరి నవ్వుతూ. మోహన్ కి చాలా దడగా ఉంది. కంగారులో హాల్ టికెట్ నెంబర్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయాడు. ఒరేయ్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంటికి పరిగెత్తాడు. తిరిగి వచ్చేసరికి గిరి, రాంబాబులు ఇద్దరి మొహాలు వెలిగిపోతున్నాయి. “ఒరేయ్ మేము పాస్ రా” అన్నాడు గిరి.
“నీ నెంబర్ ఎంతరా?” అనడిగాడు రాంబాబు. ముఖం మీద ఉన్న చెమటను తుడుచుకుని జేబులోంచి నలిగి ఉన్న హాల్ టికెట్ భయంగా అందించాడు మోహన్. లోపలికి వెళ్లి వచ్చి ఒరేయ్ పది రూపాయలు అడుగుతున్నాడురా ఇంటర్నెట్ వాడు అన్నాడు గిరి. లోపలే ఉన్న రాంబాబు నెంబర్ చెక్ చేసాడు. కనిపించలేదు. మోహన్  బయటే నిలబడే లోపల ఉన్న జనాల మధ్యలోంచి రాంబాబుని చూస్తున్నాడు. రాంబాబు మోహన్ ని చూసి పెదవి విరిచాడు ఫెయిల్ అయ్యావ్ అన్నట్టుగా. అందరు మోహన్ ని చూసారు. బయటకు వచ్చి “ఒరేయ్ మోహన్, నువ్వు  ఫెయిల్ అయ్యావు రా” అని చెప్పాడు గిరి.
మోహన్ బీతావహుడు అయిపోయాడు. అన్నయ్య గుర్తొచ్చాడు. ఫోన్ చేద్దాం అనుకున్నాడు కాని జేబులో ఉన్న డబ్బులు ఇంటర్నెట్ వాడికి ఇచ్చేసాడు. ఒరేయ్ డబ్బులున్నాయా మా అన్నయ్యకు ఫోన్ చేయాలి అని అడిగాడు మోహన్.
“లేవురా, ఉంటే ఇందాక నిన్ను ఎందుకు అడుగుతానురా, నేనే ఇచ్చేవాడిని కదా” అన్నాడు గిరి.
“నా దగ్గర కూడా లేవురా, ” అన్నాడు రాంబాబు.
“ఇప్పుడెలారా? మీ నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా?” అన్నాడు గిరి మరింత భయపెడుతూ.

ఇంటర్నెట్ షాప్ లోకి పరిగెత్తి రెండు కాగితాలు తీసుకున్నాడు. అక్కడే ఉన్న పెన్ తీసుకుని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. కొండ మీదకు చేరుకొని పెద్ద బండ రాయి నీడలో కూర్చుని ఏడ్చాడు. సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాడు. పెన్ తీసుకుని కాగితం ఏదో రాసాడు. రాసిన దాన్నే మళ్ళి మరో పేపర్ లో ఎక్కించాడు. దాన్నే హాల్ టికెట్ వెనకాల ఎక్కించాడు. హాల్ టికెట్ ని చొక్కా జేబులో పెట్టుకున్నాడు. రెండు కాగితాలను ప్యాంటు జాబుల్లో కుక్కాడు. సూర్యాస్తమయానికి సమయం అయింది. అదే సమయంలో మురారి ఉరికి బయలుదేరాడు. బస్సు లో ఉండగా ఇంటికి ఫోన్ ట్రై చేసాడు కాని సిగ్నల్ కలవలేదు. ఉదయం చేరుకుంటాం కదా అని ఊరుకున్నాడు. “ఏంటే మోహన్ ఇంకా రాలేదు” అనడిగాడు అన్నం కలుపుతూ తండ్రి భార్యతో.
“ఏమో .. చెప్పి వెళ్తున్నాడా?” అందావిడ ఇంకొంచెం కూర వడ్డించి.

రాంబాబు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. రొప్పుతూ నిలబడ్డాడు. అంకుల్ … మన మోహన్ గాడు రైలుకి ఎదురెళ్ళిపోయాడంట!!” అని చెప్పాడు.గబుక్కున లేచాడు. కంచం కాలికి తగిలిందన్న స్పర్శ కూడా పరిగెత్తాడు. ఆ మాట వినగానే మోహన్ తల్లి శోష వచ్చి పడిపోయింది. రాంబాబుకి కంగారు అనిపించి అక్కడి నుండి పారిపోయాడు. “కుర్రాడు కావాలనే ఇలా చేసాడట. చూసినోళ్లు ఆపాలనుకున్నారు. కాని కుదరలేదట” అని చెప్పాడు ఊరిలో పెద్దమనిషి. విడివడిన భాగాలను అతికించినట్టుగా పెట్టారు. శవాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చారు.  సూర్యోదయం దాదాపుగా అయింది. మురారి ఊరిలో దిగాడు. ఇంటి ముందు అంత జనం ఉండటం కొంచెం కీడు శంకించింది. కాని మనిషి కీడు అంటే ఒప్పుకోడు. ఒప్పుకోలేడు. మురారి చేతిలో బ్యాగ్ వదిలేసి ఇంటిలోకి పరిగెత్తాడు. స్థాణువైపోయాడు. “తమ్ముడూ ,,, ” అని వెర్రిగా అరిచాడు. కళ్ళల్లో కన్నీటి కెరటాలు ఎగసి పడ్డాయి. “ఎందుకిలా చేసావురా? చెప్పా కదరా, అవసరమైతే నాకు ఫోన్ చేయి అని” అంటూ రోదించాడు. రోదిస్తూ తమ్ముడి మీద పడ్డాడు. అంతే ఒక్కసారిగా వెనక్కి జరిగిపోయాడు. భయంగా వెళ్లి కప్పి ఉన్న గుడ్డ ఎత్తి చూసాడు. ఇంకా గట్టిగా రోదిస్తూ అరిచాడు. ప్యాంటు జేబులో రక్తంతో తడిసిన కాగితం కనిపించింది. ఎదురుగా కూర్చుని ఒక్కొక్క మడత విప్పాడు. అంతా నిశబ్ధం ఆవహించింది. అందరు ఆ కాగితాన్ని చూడసాగారు. అందులో ఈ విధంగా రాసి ఉంది

అనయ్య,
నెను పదొతరాగతి ఫయిల్ అయాను. అమ్మ, నాన నను కోడతరాని బయంతో చచ్చిపోతన. నన్ను క్షమిచు. ఇంట్లో నను నన్నుగా ఎవరు చుడటం లెదు. ఎప్పడు కొడుతూనారు. చాల నెప్పిగా ఉంటొంది అనయ్య. నువ్ బాగ చదవటం నాకు కూడ గొప్పె కాని ఆ సదువు నకు సరీగా రాలెదు అనయ్య. దానికి నెను ఏమి చయను అనయ్య . నీ మీద కొపంతో కాదన్నయ చచ్చిపోతున్నాది , నా మీద కొపంతోనే..! నీకొసం ఒక డాటర్ బొమ్మ చేక్కాను, అది నా గూట్లో ఉంది , తీసుకో.. ఫయిల్ అయి ఇంటికి ఎల్తే నను ఎలాగో అమ్మ నాన చంపెతారు. అందుకే నేనే చచ్చిపోతున్న ,, మల్లి నీకు బాగ చదివే తమ్ముడిగా పుటాలని కోరుకుంటున్న అనయ్య. నన్ను క్షమిచు. నెతో మాట్లాడదాం అనుకున్న, న దగ్గారున్న పది రూపాయలు నెట్ సెంటర్ లో కర్చు అయిపొయాయ్. . – ని తమ్ముడు మోహాన్.

ఉత్తరం చదివాక ఇంటి లోపలికి పరిగెత్తాడు. గూట్లో ఉన్న డాక్టర్ బొమ్మని తీసుకున్నాడు. వాకిట్లోకి వచ్చాడు నిస్తేజంగా. తండ్రి దగ్గరకి వెళ్లి నిలబడ్డాడు. ఆయన కళ్ళు కూడా ఏడ్చి అలసిపోయాయి. తలెత్తి మురారి చేతిలో ఉన్న బోమ్మ మీదుగా అతన్ని చూసాడు.
“నాన్న, ఈ బొమ్మని తమ్ముడు చెక్కాడు. జీవం లేని బొమ్మకు రూపం ఇచ్చాడు. నువ్వు చెక్కగలవా?” ప్రశ్నించాడు. మౌనం వహించాడు. తల్లి వైపు చూసి “నన్నేదో డాక్టర్ ని చేస్తున్నావని సంబరపడిపోతున్నారు గాని మా డాక్టర్స్ పోతున్న ప్రాణాలను కాపాడగలరేమో కాని పోయిన ప్రాణాలను తేలేరమ్మా” అని గద్గదమైన గొంతుతో చెప్పాడు.
కాసేపాగి కోపంతో” మీరే వాడిని చంపేశారు” అని అరిచాడు. “అవును, మీ వల్లే తమ్ముడు చనిపోయాడు. కాదు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడికి చదువు అబ్బకపోతే ఏమైంది? మీరేం చదువుకున్నారు? నేనొక పోసిషన్ కి వచ్చాక మిమ్మల్ని కూడా మీరు వాడిని నిర్లక్ష్యం చేసినట్టే చేస్తే మీరేం అయిపోతారు? అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నలభైకి పైబడిన మీకే ఇంత భయమేస్తుంటే చిన్న పిల్లాడు అమ్మా వాడు. పరిక్ష పోతే మళ్ళి రాసుకోవచ్చు, ప్రాణం పోతే.? అసలు నా చదువే వాడికి శాపం అయింది అమ్మా. ఇంట్లో ఏ ఇద్దరు ఒక్కలా చదవాలని లేదు. వాడికి వాడంటే కోపం అంట అమ్మ, అందుకే చచ్చిపోతున్నాను అని రాసాడంటే ఎంత కృంగిపోయుంటాడో కదా నాన్న? వాడు రాసిన ఉత్తరంలో ప్రతి లైన్ లో రెండు మూడు తప్పులున్నాయి. కాని ప్రతి అక్షరంలో వాడు పడ్డ  బాధ, భయం ఉన్నాయి నాన్న. పుట్టగానే ఎవడు మేధావి అవడు నాన్నా, ఎవరి ప్రతిభ ఎవరి నైపుణ్యత వారిది. నాన్న, తమ్ముడికి చదువు రాకపోవచ్చు కాని దేవుడు వాడికి ఎవరికీ రాని బొమ్మలు చెక్కే కళ ఇచ్చాడు. వాడి ఇష్టాన్ని మెచ్చుకోలేదు. అసలు పిల్లల నుండి ఏదో ఒకటి ఆశించడం తప్పు నాన్నా.. ఆశించి కనడం అనవసరం.  ఎందుకంటే కన్నాక పుట్టిన వాడుమీ ఆశలకు దూరంగా బతుకుతుంటే మీరు జీర్ణించుకోలేరు. అతని ఆశయాలకు మీలాంటి తల్లిదండ్రుల ఆశలకు మధ్య నరకం అనుభవించాలి. ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఎంత ఏడ్చినా తమ్ముడు రాడు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన వచ్చిందంటే ఎంత నలిగిపోయుంటాడో కదా నాన్నా? ప్రతి పిల్లవాడికి అమ్మంటే ఎంతో ఇష్టం ఉంటుంది. అందులో చిన్న వాళ్ళకు మరీను, పాపం ఆ రైలు గుద్దినపుడు ఆ నొప్పితో వాడు అమ్మా..!! అని ఎంత గట్టిగా అరిచి ఉంటాడో కదా అమ్మ!?”  అని తమ్ముడి ముందు మోకాళ్ళపై పడి అతని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు.

పది రోజులు పోయాక రాంబాబు మురారిని కొండ మీదకి తీసుకెళ్ళాడు. అక్కడ రాయి మీద అత్యంత అద్భుతమైన ఊరుని చెక్కిన తీరు మురారికి కించిత్ ఆశ్చర్యం కలిగించింది  ఆ సగం చెక్కిన శిల్పాన్ని తడిమి చూసాడు. “వాడేం చేస్తాడు పాపం దేవుడు కూడా వాడిని సగమే చెక్కి పంపాడు.” అని అన్నాడు.

Friday, 10 June 2016

ఏడో చేప




ఏడో చేప

మా పెంచెలయ్యమామ కలిసినాడంటే ఇహ సందడే సందడి. ఓ సీసాడు సరుకు, నాలుగు చేకోడి పొట్లాలు, జంతికల చుట్టలు ఉంటే చాలు. ఇంకేమీబళ్లా. మందల చెప్పడం మొదలైందంటే ఆపేదిల్యా. చెసేది పోలీసు వుద్యోగంగదా ఇంగ కథలకు కొరతేముందా?. మొన్న పండగకని నెల్లూరు పోయున్నానా అప్పుడు ఇట్టాగే ఓ పూట కుదిరింది.

“రేయ్ నర్సిమ్మా… నీకో కత చెప్తాగానా అది నువ్వు రాసి ఏ పత్రికకైనా పంపాల్రా..” అన్నాడు.
“అట్నేలే మామా.. ముందు కథ చెప్పు” అన్నా. ప్లాస్టిక్ గ్లాసు కడాకు లేపి గుటకేసి, నాలిక బయటికి చాపి “హా..” అని ఆమేన మొదలెట్టాడు.
“అనగనగనగా హైదరాబాదు అమీర్ పేట్ లో ఓ బాయిస్ హాస్టల్ ఉండాది. రాజుగోరి ఏడు చేపల్లాగ అందులో ఏడుగ్గురు పిలకాయలు ఉండారు..”
నేను ఆమంతనే ఆపినా. “ఏంది మామా కథంటే ఇట్టానేనా మొదలెట్టేది? మరీ చిన్నపిల్లల కథలాగుందే” అనిన.
“సరే అయితే ఈ సారి తిరగేసి చెప్తాలే గానీ నువ్వు మధ్యలో ఆపబాక” అంటూ ముందరే నా నోటికి తాళం వేసి మళ్ళీ మొదలుపెట్టినాడు.
“పోయినసారి రొట్టెలపండగ టైములో హైదరాబాద్ లో వెంగళ్రావునగర్ దగ్గర ఒక ఇసిత్రం జరిగింది. ఆక్కడ్నే ఒక చిన్న సందులో, రేత్రిపూట చీకట్లో ఎవరో ఆడకూతురు పోతావుంణ్ణింది. రైయ్యి మంటా ఇద్దరు పిలకాయలు బండేసుకోని పోతా పోతా ఆయమ్మి మెళ్ళో దండ, పుస్తెలతాడు పుట్టుక్కున తెంచి నూక్కబోయారు.. ఆ యమ్మి లబోదిబోమంటా పోలీసు స్టేషన్ కి వచ్చింది. మా వోళ్ళు అవీ ఇవీ కొచ్చెన్లేసి, ఆడా ఈడ తచ్చాడి చివరికి వల్లగాదని చేతులెత్తేశారు. ఆ పొద్దుకి సరిగ్గా మూడు రోజుల పోయినాక ఇక్కడ నెల్లూరు చిన్నబజారులో ఎవుడో దొంగసరుకు అమ్మతన్నాడని నాకు తెలిసింది. పొయ్యి జూస్తే చైను, పుస్తెలతాడు. అవి అమ్మతావున్న పిలకాయల్ని తీసకపోయి స్టేషన్లో కూర్చోబెట్టి అడిగితే వెంగళ్రావునగర్లో ఆయమ్మి మెళ్ళోంచి లాక్కోబోయింది మేమేనని ఒప్పుకున్నారు.
“హైదరాబాదు అమీర్ పేట హాస్టల్లో వుండారని చెప్పానే.. ఏడు చేపల్లాగ.. ఆ ఏడు చేపల్లో ఓ చేపగాడు కూడా వున్నాడు. ఏం చదువుకున్నావురా అంటే ఇంజనీరన్నాడు. నేను బిత్తరపొయినా.
“చేపా చేపా ఇంజనీరింగు చదివి ఈ దొంగతనం ఎందుకు చేశావే? అని అడిగా. అప్పుడు వాడు భోరుమని కాలుగంట ఏడ్చి విషయం చెప్పకొచ్చినాడు.
“సార్… మూడు సంవత్సరాలు అయ్యిందిసార్… అల్లూరు నుంచి హైదరాబాద్ పొయ్యి. ఒక ఏడాది పొడవతా మా నాయన డబ్బులు పంపినాడు. ఆ తరువాత నీ బతుకేదో నువ్వే బతకరా ఎదవా అన్నాడు… రెండేళ్ళు నేను చెయ్యని పని లేదు సార్… కాల్ సెంటర్లో పనిచేశా, కోచింగ్ సెంటర్లో చెప్పా, చిన్నచిన్న పిలకాయల ఇస్కూల్లో అయ్యోరిలెక్క చదువులు కూడా చెప్పినా సార్… డబ్బులు జాలక ఈ పని చేశాను సార్..” అంటా మళ్ళా ఏడుపెత్తుకున్నాడు. సరే వాళ్ళ నాయనతో మాట్లాడదాలెమ్మనుకున్నా..
“నాయనా నాయనా… కన్న కొడుకుగదంటయ్యా? ఏమంట డబ్బులు పంపించేదానికి?” అని అడిగా
“ఎందాకని పంపించేది సామీ… నెల నెల నాలుగైదువేలంటే ఎట్టోకొట్ట తెచ్చి పోస్తిని. ఆ నా కొడుకు ఏదో పెద్ద ఉద్యోగం ఊడపెరుకుతానని చెప్పి నా ఇల్లు తనకా పెట్టి రెండు లక్షలు గుంజకపోయినాడు. అయన్నీ లెక్క అజం లేకుండా పాయ.. మళ్ళా డబ్బులంటే యాడ తెచ్చేది సామీ…” అన్నాడు.
వొరెవొరెవొరె.. ఇదేదో తిరగొట్టిన బంతిలాగా మళ్ళీ పిల్లోడి దగ్గరికే వచ్చిందే అని మళ్ళా చేప పిల్లోడి దగ్గరకే పొయినా.,.
“ఏమిరా చేపపిల్లోడా మీ నాయన దగ్గర రెండు లక్షలు గుంజకపోయినావంటనే? అయ్యన్నీ ఏం జేసినా?” అని అడిగా. ఆ పిలకాయ మళ్ళీ ఓ కాలుగంట ఏడస్తావుణ్ణేడు. ఆమేన అసలు జరిగిందేందో చెప్పకొచ్చినాడు.
“సార్ నిజమే సార్. రెండు లక్షలరూపాయలు తెచ్చింది నిజమే. ఎందుకు తెచ్చినానో తెలుసా? మాదాపూర్లో క్యూజెడ్ టెక్నాలజీస్ అని ఓ కంపెనీ వుంది. రెండు లక్షలు జమ జేస్తే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వుద్యోగం ఇస్తామన్నారు సార్. నేను మాములుగైతే నమ్మేవాణ్ణి కాదు సార్.. నాతో పాటు వున్న ఆరుగ్గురిలో నలుగురు అట్టానే వుద్యోగానికి కుదురుకున్నారు. పెద్ద బ్యాంకులో సాలరీ అకౌంట్ తెరిపించారు. నెలాఖరున ఖంగు మని మొబైల్ మోగింది. పాతికవేలు సార్.. జీతం. మా ఆరుగ్గురు చేపలకీ కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా రాద్సార్. అట్టాంటి ఎండు చేపగాళ్ళకే వస్తే నాకెందుకు రాదు? ఎట్లాగైనా అదే కంపెనీలో చేరాలనుకున్నాను సార్…”
ఆ పిలగాడు ఇట్టా చెబతావుంటే మధ్యలో ఆపినాను నేను.
“ఒరే అబ్బిగాడా… ఏదైనా వుద్యోగంలో చేరే ముందు మంచి చెడ్డా, ముందు ఎనక చూసుకోబళ్ళేదా? ఎవుడో అత్తరబిత్తరగాడు కంపెనీ పెడితే వాడి ఎదాన రెండులక్షలు ఎట్టా పెట్టావు?” అన్నా. దానికి ఆ పిల్లకాయ –
“సార్.. ఎట్టాగైనా వుద్యోగం సంపాదించాలి సార్. బ్యాక్ డోర్ కూడా ట్రై చేశా. ఫేకులు పెట్టి చూశా. ఏదీ కుదర్లేదు. చివరాకరికి రెండు లక్షలు ఇచ్చైనా వుద్యోగం తెచ్చుకుందాం అనుకున్నాను. అప్పటికీ ఆ కంపెనీ గురించి ఎంక్వైరీ చేశాను సార్. నా హాస్టల్లో నాతోపాటే వున్న ఆరుగురు చేపగాళ్ళలో నలుగురు అక్కడే పంజేస్తున్నారు కదా. హైటేక్ సిటీకి పొయ్యి మరీ ఆళ్ళ ఆఫీసు చూసొచ్చినా. ఏసీ గదులు, పట్టపగల్లా మెరిసిపోయే లైట్లు, గుండ్రంగా తిరిగే సీట్లు, ఒకటే జనం అటూ ఇటూ తిరగతా.. అబ్బో గొలగమూడి తిరణాలేసార్.. అదంతా చూసేకొద్ది నాకు అందులో ఎలాగైనా చేరాలనిపించింది. నాయన సంగతి తెలిసి కూడా వేధించి డబ్బులు తెచ్చుకున్న. ఉద్యోగంలో చేరినాక నెలనెలా డబ్బులు చేర్చిపెట్టి నాయనకి ఇద్దామనే అనుకున్నా. నాకేం తెలిసు నా లాంటి వాళ్ళని ముఫై మందిని మోసం చేసి బోర్డు తిప్పేస్తాడని.” అన్నాడు.
“బోర్డు తిప్పేశాడా?” అని ఆశ్చర్యపోయా
“అవున్సార్.. డబ్బులు తీసుకోని రసీదు కూడా ఇచ్చారు. రెండు రోజుల్లో వచ్చి ఆఫర్ లెటర్ తీసుకోమని చెప్పారు. వెళ్ళేసరికి ఎవరూ లేరు. ఏసీ గదులు, లైట్లు, సీట్లు అన్నీ వున్నాయి కానీ మనుషులే లేరు” అంటా మళ్ళీ ఓ కాలుగంట ఏడ్చాడా పిల్లకాయ.
ఇవరం కనుక్కుంటే ఆ కంపెనీ మొదలెట్టినోడు జైల్లోనే వున్నాడని తెలిసింది. ఇట్టగాదులెమ్మని నేను వాడి దగ్గరకు పొయినా – “కంపెనీ బాబు కంపెనీ బాబూ ఎందుకు బోర్డు తిప్పేశా?” అన్నా –
వాడు దిగాలుగా జైలు పైకప్పు వైపు చూసి పొడుగ్గా నిట్టూర్చి చెప్పడం మొదలుపెట్టినాడు.
“సార్.. కంపెనీ పెట్టింది నిజమే. డబ్బులు తీసుకుంది కూడా నిజమే సార్. మాకు ఓ అమెరికా కంపెనీతో టైఅప్ సార్. వాళ్ళకి పని చేసిపెట్టే మనుషులు కావాల్సార్. మన దగ్గర జనాన్ని చూపిస్తే వాడికి సరిపోలా. అందుకని కొంత మంది పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దాంట్లో చేర్పించమని వాళ్ళే చెప్పారు. మన మైత్రీవనంలో ఇంకో ఆఫీస్ ఓపెన్ చేసి తూ అంటే తా రాని ప్రతివాడికి ట్రైనింగ్ ఇచ్చాము సార్. ఇన్ని చేసినా ఆ అమెరికావాడికి కావల్సినట్టు తయారు చెయ్యలేకపోయాము”
“ఒరేనాయనా.. నాకేం అర్థం కావడంల్యా… కావాల్సినట్లు తయారు చేసేదేందియా? ఇదేమన్నా రాధామాధవ్ సెంటర్లో దోసెల బండా ఎట్టా కావాల్నంటే అట్టా తయారు చేసేదానికా?” అన్నాను
“అట్టాకాదు సార్… అమెరికాలో వుండే వాళ్ళు అన్ని పనులు చేసుకోరు సార్. ముఖ్యమైన పనులన్నీ వాళ్ళు చేసుకోని, పనికిరాని పనులన్నీ పరాయిదేశాల వాళ్ళకి చేసి పెట్టమని పడేస్తారు. ఇక్కడైతే రోజు కూలీ తక్కువని అట్లా చేస్తారు. అట్టా మా ముఖాన కూడా ఓ పని పడేశారు. కోవా అని ప్రోగ్రామింగ్ చెయ్యాలి. కానీ ఆ పని చెయ్యాలంటే ఎంతో కొంత కోవా తెలిసుండాలి కదా… మన దగ్గర అది తెలిసినోళ్ళు బాగా పెద్ద పెద్ద కంపెనీలో పని చేస్తున్నారు. మా దగ్గర పని చెయ్యడానికి ఎవరూ రాలేదు. అందుకని అమీర్ పేటలో హాస్టళ్ళల్లో వుండే పిల్లల్ని పోగేసి ట్రైనింగ్ ఇచ్చి, పని నేర్పించి వాళ్ళ చేత పని చేయించుకుందాం అని అనుకున్నాను. తీరా చూస్తే ఒక్కడంటే ఒక్కడికి అక్షరం ముక్క రాదు. పేరుకేమో ఇంజనీర్లు. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా అమెరికా వాడికి నచ్చలేదు. కాంట్రాక్ట్ కేన్సిల్ అన్నాడు. ఏం చేసేది సార్.. ఈ చదువురాని ఇంజనీర్లతో… ఇట్టాంటోళ్ళకి ఇంజనీరింగ్ పట్టా ఇచ్చిన కాలేజీ వాళ్ళని చంపినా పాపంలేదు..” అంటూ అక్కసంతా కక్కాడు.
కథ కాలేజీలకి మారింది. సరే అట్టనే కానీ అని ఓ కాలేజి డైరెక్టర్ ని పట్టుకున్నా.
“డైరెక్టరా డైరెక్టరా… హైదరాబాదులో ఓ చేప చైన్ స్నాచింగ్ చేసింది. అదేమంటే ఉద్యోగం పేరుతో ఎవడో మోసజేడంట. ఆణ్ణి ఎందుకు మోసంజేశావురా అంటే ఆయబ్బి కాలేజీలలో చదువు చెప్పకపోతే నేనేం చేసేది అంటన్నాడు. ఏమబ్బా.. కాలేజీ పెట్టినాడివి చదువులు జెప్పేదానికేమి రిమ్మతెగులు?” అంటా తెగేసి అడిగినా.
ఆ డైరెక్టరు అటూ ఇటూ చూసి, బోరుమంటా ఏడ్సినాడు. టై ఎత్తి ముక్కు చీదినాడు.
“నీ పాసుగోల ఇందేందయ్యా ఇట్టాగ ఏడస్తన్నావా?” అని మళ్ళీ అడిగా. ఆయన నిదానించి చెప్పడం మొదలు పెట్టినాడు.
“అయ్యా… ఏం చెప్పేది మా ఖర్మ. “హైదరాబాద్ కి పొయ్యి గట్టిగా ఇంజనీరింగ్ కాలేజి పెట్టాలనుకుంటున్నామహో” అని అరిస్తే చాలు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది. సర్లే అట్లాగే కానీ లెమ్మని కాలేజీ తెరిచాము. తీరా చూస్తే మా ఇంటెనక రెండు కాలేజీలకు, మా కాలేజి ముందు మూడు కాలేజీలకు పర్మిషన్లు వున్నాయి. ఊరు మొత్తం వైన్ షాపులు, ఇంజనీరింగ్ కాలేజీలే పుట్టగొడుగుల్లా వీధికి రెండు చొప్పున వున్నాయి. ఇట్టాంటప్పుడు ఎవరైనా ఏం చేస్తారో మేమూ అదే చేశాం..”
“ఏందది” అన్నా
“మా కాలేజీలో చేరినవారికి ఒక లేప్ టాప్ ఫ్రీ అన్నాము, ముగ్గురు చేరారు. పుస్తకాలు ఫ్రీ అన్నాం, ఇంకో ఆరుగ్గురు చేరారు. కేంపస్ ప్లేస్ మెంట్ అన్నాం ఇంకో ఇద్దరు చేరారు. ఇక లాభంలేదని మొదటి సంవత్సరం ఫ్రీ అన్నాం… అప్పుడు జనం ఓ ఇరవైమంది వచ్చారు. వాళ్ళతో కాలేజీ మొదలెట్టాము..”
“ఫ్రీగా చదువులు చెప్పావా? మా గొప్ప పని చేశావే” అన్నాను నేను.
“గొప్పా పాడా… చేరినవాడు మొదటి సంవత్సరం చదవటం ఆయిపోగానే గవర్నమెంటు ఫీజు మొత్తం తిరిగి ఇచ్చేస్తానంది. అదే ఫ్రీ..”
“ఏదో ఒకటి. మంచిదే కదా” అనబోయా.
“ఊరుకోండి సార్.. మీకేం తెలియట్లేదు. అట్టా చేరిన పిల్లలు అందరు కలిసి మాట్లాడుకున్నారు. – మనం పాస్ అయితే తప్ప కాలేజీకి డబ్బులు రావు. పైగా మనం ఫెయిల్ అయితే కాలేజీకి చెడ్డపేరు. కాబట్టి ఈ కాలేజి వాళ్ళే ఎట్లైనా మనల్ని పాస్ చేస్తారు – అని తెలుసుకున్నారు.”
“ఆమేన?”
“ఇంకేముంది? క్లాస్ మొదలవ్వగానే లేచి వెళ్ళిపోతారు. లెక్చెరర్ “ఏందిరా” అంటే “ఏందిరా” అంటం మొదలుపెట్టారు. వాళ్ళు రాకపోయినా అటెండెన్స్ వెయ్యాల్సిందే. అంటెండెన్స్ లేకపోతే పాస్ కారు. పాస్ కాకపోతే మాకు గవర్నమెంటు నుంచి డబ్బులు రావు. అందుకని వచ్చినా రాకపోయినా, చదివినా చదవక పోయినా అందరినీ పాస్ చెయ్యడమే ఒక పని అయిపోయింది. గవర్నమెంటు సంవత్సరం అయిపోయినాక ఫీజులు ఇస్తుంది. మరి సంవత్సరం అంతా మా ఖర్చుల మీదే నడపాలి.”
“అవును కదా.. అట్టా ఎట్టా గిట్టుబాటు అవతాంది మీకు?” అడిగా అమాయకంగా.
“ఏం చెప్పేది సార్. బిల్డింగ్ ఖర్చులు, కరెంట్ ఖర్చులు, లంచాల ఖర్చులు ఇట్టాటివన్నీ తగ్గేవి కావు కదా. మేము తగ్గించుకోగలిగిన ఖర్చు ఒకటే వుంది”
“ఏంటది?”
“ఫేకల్టీ ఖర్చులు”
“అంటే చదువు చెప్పేవాళ్ళ జీతాలు తగ్గిస్తాన్నారా ఎట్టా?”
“కాదండీ.. జీతం తక్కువ తీసుకునేవాళ్ళకే ఉద్యోగం ఇస్తున్నాం”
“అంటే?”
“ఏముందిసార్.. మా కాలేజిలో చదువు అయిపోయిన వాళ్ళను తరువాత సంవత్సరం మా కాలేజిలోనే ఉద్యోగం ఇస్తాం. మా దగ్గర చదువుకున్న పిల్లలే కాబట్టి కంట్రోల్ లో వుంటారు. చెప్పిన చోటల్లా సంతకం పెడతారు.”
“ఓరినీ పాసుగోల, ఇట్టాటి అయ్యోర్లను పెట్టుకుంటే పిల్లలికి చదువెట్టా వచ్చుద్ది సామీ… సరే కథ ప్రకారం నేను వాళ్ళతో గూడా మాట్లాడాలగానె ఒకసారి రమ్మనదరాదా..” అన్నాను. మొత్తం పదిగేను మంది వుండారన్నాడు. పిలిత్తే పదమూడు మందే వచ్చారు.
“మిగతా ఇద్దరు ఏరి సామీ” అన్నా.
“రేయ్.. ఆ ప్యూను సాంబయ్యగాణ్ణి, డ్రైవర్ సైదులుగాణ్ణి పిలవండ్రా” అని నా వైపు చూడలేక తల దించుకున్నాడు.
***
మామ ఇక్కడ దాకా కథ చెప్పంగనే ఇంక ఉగ్గబట్టుకోలేక ఆపేశా..
“ఏంది మామా? ఏడ మొదలెట్టావు ఏడకి పొయ్యావు? ప్యూనేంది? డ్రైవరేంది?”అన్నాను.
“ఒరే అల్లుడా, ఆపద్దని ముందేజెప్పినానా… ఇంక నేజెప్పను ఫో…” అన్నాడు.
“మామా..మామా… జెప్పుమామా… ఇంగ మాట్టాడితే ఒట్టు” అన్నా.
“సరే ఇను అయితే” అని మళ్ళీ మొదలుపెట్టాడు మామ.
***
ఏడు సేపల కథలో సివరాఖరు సీను – నేను మా వూరి ఎమ్మెల్యే, ఎడుకేషన్ మంత్రి రంగనాయకులు దగ్గరికి పొయినా. టోపీ తీసి దణ్ణమెట్టి నిలబడినా.
“ఏందిరా?” అన్నాడు
“అయ్యా చేప చైను లాగింది, అడిగితే ఉద్దోగం లేదన్నాడు, ఆడినడిగితే పిల్లలకి చదువు లేదన్నాడు, కాలీజీకి పోతే రీయంబర్సుమెంటు కత చెప్పి పనికిమాలినోళ్ళనందరినీ చూపించి అయ్యోర్లని చెప్తా వున్నాడు, అదేమిరా అంటే ఈధికో కాలేజి వుంటే ఏం జెయ్యమంటున్నాడు. అసలిట్టా ఇన్నేసి కాలేజీలు ఎందుకు తెరిచినారు తవరే సెప్పాల” అన్నాను.
మంత్రిగారు పొట్ట ఊపుకుంటా నవ్వాడు.
“నువ్వు దగ్గరోడివి కాబట్టి ఒగ రగస్యం జెపతన్నా. మా రాజకీయలోళ్ళ సంగతి తెలుసు కదా? డబ్బులొస్తాయంటే కాలేజీలు కాకపోతే కల్లు షాపులు… పర్మిట్లదేముంది. కానీ, ఇన్నేసి కాలేజీలు పెట్టేదానికి ఇంత మంది మాకు డబ్బులిచ్చి మరీ ఎందుకు ఎగబడతన్నారో తెలుసా? ఆళ్ళు పెట్టే కాలీజీల్లో చేరేదానికి కావల్సినంతమంది పిల్లలున్నారని నమ్మకం ఉండబట్టే కదా. అదట్టా ఎందుకో తెలుసా?” అని మంత్రిగారు మళ్ళీ నవ్వారు.
చీమ ఎందుకు కుట్టిందో తెలిసిపోయే సివరాఖరుకు వచ్చేశానని అర్థమయ్యి చెవులు కిక్కిరించా
“ఆశ. ఈ జనానికి ఆశరా… పెతోడు వాడి పిల్లకాయలు పెద్ద ఇంజినీర్లు అయిపోయి, అమెర్కా ఎల్లిపోయి లచ్చలు లచ్చలు అంపేయాలని ఆశ. పెజెల్లో ఇట్టాటి ఆశ పెరిగిపోయింది కాబట్టే ఇంత కతా జరిగింది” అన్జెప్పి మంత్రిగారు పెజాసేవకి ఎల్లిపోయారు.
***
కత అయిపోయినట్లు మామ ఆపేయడంతో అందరం చేతుల్లో గళాసులవైపు చూసుకున్నాం. కొసరూ అరా ఏమన్నా వుంటే అట్నే తాగేసి ఎవరింటికి వాళ్ళం ఎలబారినాం.
***