Sunday, 28 December 2014

ఎప్పుడు మారతారు ?

నాగరికత తెలీని రోజుల్లో.. జాతులు, తెగలూ ఉండేవి. భూమి అనేది ఓ సువిశాల ప్రపంచమని తెలీని అజ్ఞానంలో.. తమ తెగలో ఉన్న వంద మంది మాత్రమే తమ వారనీ, మిగతా తెగల వారూ, జాతుల వారూ కొందరు మిత్రులూ, కొందరు శత్రువులు అని భావిస్తూ బ్రతికేవారు.
ఆ తర్వాత ప్రపంచం చాలా పెద్దదని అర్థమైంది. అయినా మనిషి విచ్చలవిడిగా ప్రవర్తించకుండా ఉండడానికి కొన్ని కట్టుబాట్లతో కులాలూ, మతాలూ వేళ్లూనుకున్నాయి. అలాగే ఇప్పుడు మళ్లీ నాగరికత లేని కాలంలోని తెగలూ, జాతులకూ ప్రతిరూపాలుగా ప్రాంతాలూ వచ్చి చేరుతున్నాయి. ఏ కులం, మతం, ప్రాంతం అజెండా దానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అజెండా వైపు అందర్నీ లాగడమే "సామాజిక బాధ్యత"గా అందర్నీ బోధించబడుతోంది.
ఇదంతా చూస్తుంటే.. మనిషి ఎక్కడో ఏ మారుమూల తెగలో కట్టుబట్టల్లేకుండా అనాగరికంగా అదే ప్రపంచమని భ్రమించి బ్రతికేసిన గతం మళ్లీ ఇప్పుడు రిపీట్ అవుతున్నట్లు అన్పించట్లేదా?
మనిషి ఆలోచన విస్తృతం కావాలి.. తానొక సాటి మనిషినని ఫీలవ్వాలి, ఏ కులపో, మతపో, ప్రాంతపో ప్రతినిధిగా ఎస్టాబ్లిష్ అవడానికి ప్రయత్నిస్తే ఆ మనిషి అంతటితోనే సమాధి అయిపోయిట్లు లెక్క.
ఇప్పుడందరూ గొప్పగా పేర్ల చివర తగిలించుకుంటున్నట్లు 20 ఏళ్ల నుండి నేనూ నా పేరు చివర్న చౌదరి అని తగిలించుకోవచ్చు. అలా తగిలించుకుంటే ఏమొస్తుంది? ఈరోజు చౌదరి అయినా, రెడ్డి అయినా, రాజు అయినా, చారి, గౌడ, నాయక్ వంటి ఏ కులపు పేర్లయినా అసలు ఏం ఉద్ధరిస్తాయి మనల్ని? "మనిషిగా సంకుచితంగా బ్రతికేస్తున్నాం" అని మనం అందరికీ మన గురించి చిన్నచూపు కలిగించడానికి తప్పించి కులం పేర్లు ఎందుకూ పనికిరావు. కులం ద్వారా పౌరుషాలు రావు.. కులం ద్వారా రాజసం రాదు.. కులం ద్వారా దుర్గుణాలు రావు.. మన జీవితంలోకి ఏదొచ్చినా మన ఆలోచనల ద్వారానే, వ్యక్తిత్వం ద్వారానే!!
ఈ మధ్య చాలామంది Facebook ప్రొఫైళ్లలో "తెలంగాణ", "ఆంధ్ర" వంటి పేర్లు తోకలుగా కన్పిస్తున్నాయి. అసలు ఏమైంది మీకందరికీ? నిన్న మొన్నటి వరకూ లేని సంకుచిత భావాలు ఇప్పుడెందుకు మొగ్గతొడుగుతున్నాయి?
అమ్మ జన్మనిచ్చింది కాబట్టి.. అదృష్టం ఉండబట్టి ఈ భూమ్మీద పుట్టగలిగాం. పుట్టేటప్పుడు "అప్పటికే ఈ భూమ్మీద ఉన్న వాళ్లందరూ మనుషులు కాదు.. నేనొక్కడినే మనిషిని" అని అనుకునే హక్కు మనకి లేదు. మరి పెరిగి పెద్దయ్యాక ఏముందని నీ చేతిలో "మిగతా సమాజం ఏదీ నాకు వద్దు.. నాకు నా వాళ్లే కావాలి" అని గిరిగీసుకు బ్రతకడానికి సిగ్గేయట్లేదూ?
అవును.. ప్రపంచంలో సంకుచిత మనస్థత్వాల వారు చాలామందే ఉన్నారు. వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు సంకుచితంగా మారతావా?
ఈ భూమ్మీద ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు.. ఎవరి టాలెంట్ వాడిది.. ఎవడి జీవితం వాడిది.. కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, ప్రాంతం పేరు చెప్పో, దేశం పేరు చెప్పో "నువ్వు బ్రతకడానికి వీల్లేదని" అనడానికి అస్సలు నువ్వెవరు? ఒక్కసారి ఆలోచించు?
చివరిగా ఒక్కమాట.. నలుగురినీ కలుపుకుపోయి బ్రతికేది సమాజం.. నలుగురినీ తరిమేసి ఒక్కడివే పాతుకుపోవాలని చూసేది శ్మశానం!!
సమాజం కావాలో, శ్మశానం కావాలో మీరే డిసైడ్ చేసుకోండి.


No comments:

Post a Comment