ఈ కళ్యాణ సుందరం గారిని గురించి చదివిన తరువాత జన్మ ధన్యం అనిపించింది. ఇలాటి మంచి వాళ్లు ఇంకా వున్నారు. వాళ్ళ మధ్యనే మనం బతుకుతున్నాం. జన్మ ధన్యం కావడానికి ఇంకేమి కావాలి.
దాత్రుత్వంలో 'శిబి'ని తలపించే కళ్యాణ సుందరం చెన్నైలో ముప్పయ్యేళ్ళ పాటు లైబ్రేరియన్ గా పనిచేశారు. అయితే అందులో ప్రత్యేకత ఏముంది అనిపించవచ్చు. అందరి ఉద్యోగుల మాదిరిగానే నెలనెలా జీతం తీసుకున్నాడు. కానీ ఏనాడు ఒక్క రూపాయి కూడా ఇంటికి పట్టుకుపోలేదు. సంపాదించిన ప్రతి రూపాయి అవసరంలో వున్నవాళ్లకే దానం చేస్తూ వచ్చాడు. చివరికి ముప్పయ్యేళ్లు సర్వీసు చేసిన అనంతరం ముట్టిన పించను మొత్తం పదిలక్షలు దానధర్మాలకే ధారపోశాడు.
మరి ఉదర పోషణ అంటారా. తీరిక సమయాల్లో హోటల్లో సర్వర్ గా పనిచేసి ఆ భత్యంతో పొట్టపోసుకునేవాడు.
మూడో కంటికి తెలియకుండా చేసిన ఈ దానాలు గురించి తెలుసుకున్న ఐక్యరాజ్య సమితి ఈ చెన్నై సుందరాన్ని గుర్తించి శతాబ్దపు ఉత్తమోత్తమ పౌరుడిగా నిర్ణయించి సత్కరించింది. మరో అమెరికన్ సంస్థ 'కోటికొక్కడు' బిరుదు ఇచ్చి, దానితోపాటు అక్షరాలా ముప్పయ్ కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందచేసింది. ఆ చెక్కు అందుకున్న కళ్యాణ సుందరం గారు తన అలవాటు ప్రకారం ఆ మొత్తాన్ని అవసరంలో వున్నవారికి సాయపడేందుకు దానం చేసి చేతులు దులిపేసుకున్నారు.
కధ ఇక్కడితో ఆగలేదు. చేతికి ఎముకలేనట్టు దానం చేసే ఈ అభినవ శిబి గురించి మరో గొప్ప వ్యక్తికి తెలిసింది. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. ఏమిచ్చినా మళ్ళీ దానం చేసేస్తాడు కాబట్టి కల్యాణసుందరం గారిని ఓ మంచి రోజు చూసి తన తండ్రిగా దత్తత తీసేసుకున్నాడు. కళ్యాణ సుందరం గారి దాన ఫలం ఆ విధంగా దక్కి రజనీకాంత్ వంటి మహోన్నతుడికి తండ్రి కాగలిగాడు. రజనీకాంత్ సన్ ఆఫ్ కల్యాణ సుందరం అని అనిపించుకోగలిగాడు.
కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకుండా దానాలు చేస్తూ వచ్చిన ఈ కళ్యాణ సుందరం గారికి కళ్యాణ ఘడియ మాత్రం తోసుకురాలేదు. దానధర్మాలకు అడ్డం అనుకున్నారో యేమో పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మచారిగానే వుండిపోయారు.
No comments:
Post a Comment