Wednesday, 30 October 2013

mani dweepam



మణిద్వీప వర్ణన : మణిద్వీపం బ్రహ్మలోకానికి పైన ఉంతుంది. దీనిని సర్వలోకమని కూడా అంటారు. మణిద్వీపం కైలాసం, వైకుంఠం, గోలోకం కంటే శ్రేష్ఠంగా విరాజిలుతూంటుంది. మణిద్వీపానికి నాలుగు వైపులా అమృత సముద్రము విస్తరించి ఉంటుంది. ఆ సముద్రంలో శీతల తరంగాలు, రత్నాలతో కూడిన సైకత ప్రదేశాలు, శంఖాలు అనేక వర్ణాలు గల జలచరాలు కన్నులు పండుగ చేస్తూంటాయి. ఆప్రదేశానికి అవతల ఏడుయోజనాల వైశాల్యం గల లోహమయ ప్రాకారం ఉంటుంది. నానా శస్త్రాస్త్రాలు ధరించిన రక్షకభటులు కాపలా కాస్తుంటారు. ప్రతి ద్వారంలోను వందలాది మంది భటులు ఉంటారు. అక్కడ శ్రీఅమ్మవారి భక్తులు నివసిస్తూంటారు. అడుగడుక్కీ స్వచ్చమైన మధుర జల సరోవరాలు, ఉద్యానవనాలు ఉంటాయి. అవి దాటి వెళితే కంచుతో నిర్మించిన మహాప్రాకారం ఉంటుంది. సమస్త వృక్ష జాతులు అక్కడ ఉంటాయి. అనేక వందల సంఖ్యలలో దిగుడు బావులు, నదీ తీర ప్రదేశాలు అక్కడ కన్నుల పండువుగా ఉంటాయి. అనేక జాతులు పక్షులు, అక్కడ వృక్షాలపైన నివసిస్తూంటాయి. ఆ ప్రాకారం దాటగా తామ్రప్రాకారం ఉంది. అది చతురస్రాకారంగా ఉంటుంది. అక్కడ పుష్పాలు బంగారు వన్నెతో భాసిల్లుతూంటాయి. పండ్లు రత్నాలవలె కన్నుల కింపుగా ఉంటూ సువాసనలు వెదజల్లుతుంటాయి. తామ్ర ప్రాకారం దాటి వెళ్ళగా సీసప్రాకారం ఉంటుంది. సీస ప్రాకారాల మధ్య భాగంలో సంతాన వాటిక ఉంది. అక్కడ అనేక రకాల ఫలవృక్షాలు ఉంటాయి. అక్కద లెక్కలేనన్ని అమర సిద్ధగణాలు ఉంటాయి. సీస ప్రాకారాన్ని దాటి పురోగమించగా ఇత్తడి ప్రాకారం ఉంటుంది. సీస, ఇత్తడి ప్రాకారాల మధ్య భాగంలో హరిచందన తరువనాలు ఉన్నాయి. ఈ ప్రదేశమంతా నవపల్లవ తరు పంక్తులతో లేలేత తీగలతో, పచ్చని పైరులతో కనులవిందుగా ఉంటుంది. అక్కడి నదీనదాలు వేగంగా ప్రవహిస్తుంటాయి. ఆ ఇత్తడి ప్రాకారం దాటగా పంచలోహమయ ప్రాకారం ఉంటుంది. ఇత్తడి పంచలోహమయ ప్రాకారాల మధ్యలో మందార వనాలు, చక్కని పుష్పాలతో నయనానందకరంగా ఉంటాయి. ఆ పంచలోహ ప్రాకారం దాటి ముందుకు వెళ్ళగా, మహోన్నత శిఖరాలతో రజత ప్రాకారం ఉంది. అక్కడ పారిజాత పుష్పాలు సుగంధాలు వెదజల్లుతుంటాయి. ఆ ప్రాకారం దాటి వెళ్ళగా సువర్ణమయ ప్రాకారం తేజరిల్లుతుంది. రజత, సువర్ణమయ ప్రాకారాల మధ్య కదంబవనం ఉంది. ఆ చెట్ల నుండి కదంబ మద్యం ధారగా ప్రవహిస్తుంటుంది. దానిని పానము చేయడం వలన ఆత్మానందం కలుగుతుంది. సువర్ణమయ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా ఎర్రటి కుంకుమ వర్ణంగల పుష్యరాగమణి ఉంటుంది. సువర్ణమయ, పుష్యరాగ ప్రాకారాల మధ్య వృక్షాలు, వనాలు, పక్షులు అన్ని రత్నమయాలై ఉంటాయి. ఇక్కడ దిక్పతులైన ఇంద్రాదులు ఆయుధాలు ధరించి ప్రకాశిస్తుంటారు. దానికి తూర్పుగా అమరావతీ నగరం నానావిధ వనాలతో భాసిల్లుతూంతుంది. అక్కడ మహేద్రుడు వజ్రహస్తుడై దేవసేనతో కూడి ఉంటాడు. దానికి ఆగ్నేయభాగంలో అగ్నిపురం ఉంటుంది. దక్షిణ భాగంలో యముని నగరం సమ్యమిని ఉంది. నైరుతీ దిశలో కృష్ణాంగన నగరంలో రాక్షసులు ఉంటారు. పశ్చిమదిశలో వరుణ దేవుడు శ్రద్ధావతి పట్టణంలో పాశధరుడై ఉంటాడు. వాయువ్యదిశలో గంధవతిలో వాయుదేవుడు నివసిస్తూంటాడు. ఉత్తరదిశలో కుబేరుడు తన యక్షసేనలతో, అలకాపురి విశేష సంపదతో తేజరిల్లుతూంటుంది. ఈశాన్యంలో మహారుద్రుడు అనేకమంది రుద్రులతోనూ, మాతలతోనూ, వీరభద్రాదులతోనూ యశోవతిలో భాసిల్లుతూంటాడు. పుష్యరాగమణుల ప్రాకారం దాటి వెళ్లగా అరుణవర్ణంతో పద్మరాగమణి ప్రాకారం ఉంటుంది. దానికి గోపుర ద్వారాలు అసంఖ్యాక మండపాలు ఉన్నాయి. వాటి మధ్య మహావీరులున్నారు. చతుస్షష్టి కళలు ఉన్నాయి. వారికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి. అనేక వందల అక్షౌహిణీ సైన్యాలు ఉన్నాయి. రధాశ్వగజ శస్త్రాదులు లెక్కకు మించి ఉన్నాయి. ఆ ప్రాకారాన్ని దాటి వెళ్ళగా గోమేధిక మణి ప్రాకారం ఉంటుంది. జపాకుసుమ సన్నిభంగా కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. అక్కడి భవనాలు గోమేధిక మణికాంతులను ప్రసరింపచేస్తూంటాయి. అక్కడ 32 శ్రీదేవీ శక్తులు ఉంటాయి. 32లోకాలు ఉన్నాయి. ఆ లోకంలో నివసించే శక్తులు పిశాచవదనాలతో ఉంటాయి. వారందరూ శ్రీఅమ్మవారి కోసం యుద్ధం చేయడానికి సన్నద్ధులై ఉంటారు. గోమేధిక ప్రాకారం దాటి వెళ్తే వజ్రాల ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీత్రిభువనేశ్వరీదేవి దాసదాసీ జనంతో నివసిస్తూంటారు. వజ్రాల ప్రాకారం దాటి వెళ్ళగా వైడూర్య ప్రాకారం ఉంటుంది. అక్కడ 8దిక్కులలో బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ అనువారలు సప్త మాతృకలుగా ఖ్యాతి చెందారు. శ్రీ మహాలక్ష్మీదేవి అష్టమ మాతృకగా పిలువబడుతూ ఉంది.ఈ వైడూర్య ప్రాకారాన్ని దాటి వెళ్ళగా, ఇంద్రనీలమణి ప్రాకారం ఉంటుంది. అక్కడ షోడశ శక్తులు ఉంటాయి. ప్రపంచ వార్తలు తెలియచేస్తూంటాయి. ఇంకా ముందుకు వెళ్ళగా మరకత మణి ప్రాకారం తేజరిల్లుతూంటుంది. అక్కడ తూర్పుకోణంలో గాయత్రి, బ్రహ్మదేవుడు ఉంటారు. నైరుతికోణంలో మహారుద్రుడు, శ్రీగౌరి విరాజిల్లూతు ఉంతారు. వాయువ్యాగ్ని కోణంలో ధనపతి కుబేరుడు ప్రకాశిస్తూంటారు. పశ్చిమకోణంలో మన్మధుడు రతీదేవితో విలసిల్లుతూంటారు. ఈశాన్యకోణంలో విఘ్నేశ్వరుడు ఉంటారు. వీరందరు అమ్మవారిని సేవిస్తూంటారు. ఇంకా ముందుకు వెళ్ళగా పగడాల ప్రాకారం ఉంటుంది. అక్కద పంచభూతాల స్వామినులు ఉంటారు. పగడాల ప్రాకారాన్ని దాటి వెళ్ళగా నవరత్న ప్రాకారం ఉంటుంది. అక్కడ శ్రీదేవి యొక్క మహావతారాలు, పాశాంకుశేశ్వరి, భువనేశ్వరి, భైరవి, కపాలభైరవి, క్రోధభువనేశ్వరి, త్రిపుట, అశ్వారూఢ, నిత్యక్లిన్న, అన్నపూర్ణ, త్వరిత, కాళి, తార, షోడశిభైరివి, మాతంగి మొదలైన దశ మహావిద్యలు ప్రకాశిస్తూంటాయి. నవరత్న ప్రాకారం దాటి ముందుకు వెళ్తే, మహోజ్వల కాంతులను విరజిమ్ముతూ చింతామణి గృహం ఉంటుంది. చింతామణి గృహానికి వేయి స్తంబాలు, శృంగార, ముక్తి, ఙ్ఞాన, ఏకాంత అనే నాలుగు మండపాలు ఉన్నాయి. అనేక మణి వేదికలు ఉన్నాయి. వాతావరణం సువాసనలు వెదజల్లుతూంటుంది. ఆ మండపాలు నాలుగు దిక్కులా కాష్మీరవనాలు కనులకింపుగా ఉంటాయి. మల్లె పూదోటలు, కుంద పుష్పవనాలతో ఆ ప్రాంతమంతా సువాసనలు ఉంటుంది. అక్కడ అసంఖ్యాక మృగాలు మదాన్ని స్రవింపచేస్తాయి. అక్కడగల మహాపద్మాల నుండి అమృత ప్రాయమైన మధువులను భ్రమరాలు గ్రోలుతూంటాయి. శృంగార మండపం మధ్యలో దేవతలు శ్రవణానందకర స్వరాలతో దివ్యగీతాలను ఆలపిస్తూంటారు. సభాసదులైన అమరులు మధ్య శ్రీలలితాదేవి సింహాసనుపై ఆసీనురాలై ఉంటుంది. శ్రీదేవి ముక్తి మండపంలో నుండి పరమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఙ్ఞాన మండపంలో నుండి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఏకాంత మండపంలో తన మంత్రిణులతో కొలువైయుంటుంది. విశ్వరక్షణను గూర్చి చర్చిస్తుంటుంది. చింతామణి గృహంలో శక్తితత్త్వాత్మికాలైన పది సోపానాలతో దివ్య ప్రభలను వెదజిల్లుతూ ఒక మంచం ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు దానికి నాలుగు కోళ్ళుగా అమరి ఉంటారు. ఆ నాలుగు కోళ్ళపై ఫలకంగా సదాశివుడు ఉంటాడు. దానిపై కోటి సూర్యప్రభలతో, కోటి చంద్ర శీతలత్వంతో వెలుగొందుతున్న కామేశ్వరునకు ఎడమవైపున శ్రీఅమ్మవారు ఆసీనులై ఉంటారు. శ్రీలలితాదేవి ఙ్ఞానమనే అగ్నిగుండం నుండి పుట్టినది. నాలుగు బాహువులు కలిగి, అనురాగమను పాశము, క్రోధమనే అంకుశము, మనస్సే విల్లుగా, స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలను (పంచతన్మాత్రలను) బాణాలుగా కలిగి ఉంటుంది. బ్రహ్మాండమంతా తన ఎర్రని కాంతితో నింపివేసింది. సంపెంగ, అశోక, పున్నాగ మొదలగు పుష్పముల సువాసనలతో తలకట్టు కలిగినది. కురవిందమణులచే ప్రకాసించబడుతున్న కిరీటముచే అలంకరించబడినది. అమ్మవారి నుదురు అష్టమినాటి చంద్రునివలె ప్రకాశితూంటుంది. చంద్రునిలోని మచ్చవలె ఆమె ముఖముపై కస్తూరి తిలకం దిద్దుకుని ఉంటుంది. ఆమె కనుబొమ్మలు గృహమునకు అలంకరించిన మంగళ తోరణములవలె ఉన్నవి. ప్రవాహమునకు కదులుచున్న చేపలవంటి కనులు, సంపెంగ మొగ్గ వంటి అందమైన ముక్కు, నక్షత్ర కాంతిని మించిన కాంతితో మెరుస్తున్న ముక్కు పుదక, కడిమి పూల గుత్తిచే అలంకరింపబడిన మనోహరమైన చెవులకు సూర్యచంద్రులే కర్ణాభరణములుగా కలిగి ఉన్నది. పద్మరాగమణి కెంపుతో చేయబడిన అద్దము కంటె అందమైన ఎర్రని చెక్కిళ్ళతో ప్రకాశించుచున్నది. రక్త పగడమును, దొందపండును మించిన అందమైన ఎర్రని పెదవులు, షోడశీమంత్రమునందలి పదునారు బీజాక్షరముల జతవంటి తెల్లని పలువరుస కలిగియున్నది. శ్రీమాత సేవించిన కర్పూర తాంబూల సువాసనలు నలుదిక్కులకూ వెదజల్లుతుంటాయి. ఆమె పలుకులు సరస్వతీదేవి వీణానాదమును మించి ఉంటాయి. అమ్మ చుబుకముతో పోల్చదగిన వస్తువేదీ లేదు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళసూత్రముతో అమ్మ కంఠము శోభిల్లుతూంటుంది. ఆమె భుజములు బంగారు భుజకీర్తులతోనూ దండకడియములు, వంకీలతోనూ అందముగా అలంకరింపబడి ఉంటాయి. రత్నాలు పొదిగిన కంఠాభరణము ముత్యాల జాలరులు కలిగిన చింతాకు పతకము ధరించి ఉంటుంది. ఆమె నడుము సన్నగా ఉంటుంది. ఆమె కాలిగోళ్ళ కాంతి భక్తుల అఙ్ఞానాన్ని తొలగిస్తుంది. పద్మాలకంటే మృదువైన పాదాలు కలిగి ఉన్నది. సంపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశిస్తూ శివకామేశ్వరుని ఒడిలో ఆసీనురాలై ఉంటుంది.